Site icon NTV Telugu

PBKS vs DC: దాడి జరిగిందని స్టార్క్‌ చెప్పాడు.. డుప్లెసిస్‌ షూ కూడా వేసుకోలేదు: అలీసా హీలీ

Alyssa Healy

Alyssa Healy

భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మే 8న ధర్మశాలలో పంజాబ్‌ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఐపీఎల్‌ 2025 మ్యాచ్‌ రద్దైన విషయం తెలిసిందే. ఫ్లడ్‌లైట్ల సమస్య వల్లే మ్యాచ్‌ ఆగిందని ముందుగా అందరూ అనుకున్నా.. సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్‌ దాడుల నేపథ్యంలోనే మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని తర్వాత తెలిసింది. ఈ మ్యాచ్‌ జరుగుతున్నపుడు ధర్మశాల స్టేడియంలోనే ఉన్న ఆస్ట్రేలియా మహిళలా టీమ్ కెప్టెన్‌, మిచెల్‌ స్టార్క్‌ సతీమణి అలీసా హీలీ.. తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. స్టేడియంకు 60 కిలోమీటర్ల దూరంలో దాడి జరిగిందని స్టార్క్‌ తనకు చెప్పాడని, ఆ సమయంలో తాను బయపడిపోయా అని అలీసా తాజాగా తెలిపారు.

‘విల్లోటాక్’ పాడ్‌కాస్ట్‌లో అలీసా హీలీ మాట్లాడుతూ… ‘మైదానంలో రెండు ఫ్లడ్‌ లైట్లు ఆగిపోయాయి. మ్యాచ్‌ మళ్లీ మొదలవుతుందని మేము ఎదురుచూస్తున్నాం. మాకు దగ్గర్లో కూర్చున్న వారు స్టేడియాన్ని ఖాళీ చేయించబోతున్నట్లు మాట్లాడుకుంటుంటున్నారు. మా పక్కన, మిగతా ప్లేయర్స్ కుటుంబ సభ్యులు, అదనపు సహాయక సిబ్బంది ఉన్నారు. కాసేపటికి మా బృందంలో ఓ వ్యక్తి వచ్చి స్టేడియం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని చెప్పాడు. అతడు కాస్త కంగారుగా కనిపించాడు. జనాలు హడావుడిగా పైకి, కిందికి తిరగడం చూశాం. కొందరు మైదానం వీడడాన్ని చూసి ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. అప్పుడు కాస్త కంగారు మొదలైంది’ అని చెప్పారు.

Also Read: Ramagiri MPP Election: ఎంపీపీ ఇస్తామంటూ టీడీపీ నేతలు ప్రలోభ పెట్టారు.. వీడియో రిలీజ్ చేసిన ఎంపీటీసీ!

‘ఇంతలో ఓ వ్యక్తి వచ్చి మా బృందంలో ఉన్న ఒక చిన్నారిని ఎత్తుకుని.. మనం వెంటనే బయల్దేరాలన్నాడు. అంతలో ప్లేయర్స్ కూడా మా వద్దకు వచ్చారు. వారి ముఖాల్లో టెన్షన్ కనిపించింది. ఫాఫ్ డుప్లెసిస్‌ అయితే షూలు కూడా వేసుకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మిచెల్ స్టార్క్‌ను ఏమైందని నేను అడిగాను. మైదానంకు 60 కిలోమీటర్ల దూరంలో దాడి జరిగిందని, అందుకే ఇక్కడ పూర్తిగా విద్యుత్తు ఆపేశారని చెప్పాడు. ఆ సమయంలో నేను బయపడిపోయా. వెంటనే మేం వ్యాన్లలో హోటల్‌కు వెళ్లిపోయాం. అక్కడ పరిస్థితి అంత బాగా లేదు. అనంతరం మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్లారు’ అని అలీసా హీలీ తెలిపారు. మధ్యలో ఆగిన మ్యాచ్ మే 24న మళ్ళీ జరుగుతుంది. ఈసారి ధర్మశాలలో కాకుండా.. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.

Exit mobile version