ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై గత రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. శనివారం సాయంత్రం ఆయనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా వెన్నునొప్పి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు, వైద్యుల సూచన మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
Also Read : Raaka: ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్..
శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన అధికారిక పర్యటనలను రద్దు చేసుకుని ఆయన వెంటనే ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఎంఆర్ఐ (MRI), ఇతర పరీక్షలు నిర్వహించి, చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. శనివారం సాయంత్రం నిపుణులైన వైద్య బృందం ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసింది. శస్త్రచికిత్స తర్వాత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరో రెండు మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ గారికి ఆపరేషన్ జరిగిందని తెలియగానే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
