Parliament Session Record: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, సమావేశాలు అధికారికంగా ముగిసినట్లు (ప్రోరోగ్ అయినట్లు) ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. గత 89 రోజులుగా పార్లమెంట్ సెషన్స్ ప్రోరోగ్ కాకపోవడంతో ఇది పార్లమెంట్ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డుగా నిలిచింది. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 4 నుంచి 22 వరకు 15 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గతంలో కూడా పార్లమెంట్ ప్రోరోగ్ కాకుండా సుదీర్ఘకాలం కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. 2008లో నాటి యూపీఏ ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు జూలై 21, 22 తేదీలలో లోక్‌సభ రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడగా.. 87 రోజుల తర్వాత అక్టోబర్ 17న తిరిగి సమావేశాలు నిర్వహించారు. తాజాగా వర్షాకాల సమావేశాలు ముగిసి ఇప్పటికే 88 రోజులు దాటడంతో 2008 నాటి 87 రోజుల రికార్డు తిరగరాయబడింది.
సాధారణంగా ఉభయ సభల ప్రిసైడింగ్ అధికారులు సభలను నిరవధికంగా వాయిదా వేసిన రెండు మూడు రోజుల్లోనే సెషన్స్ ముగిసినట్లు రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేస్తుంటారు. కానీ ఈసారి ఆగస్టు 13న వాయిదా పడిన తర్వాత నేటివరకు ముగింపు ప్రకటన రాలేదు. అంటే, వర్షాకాల సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 85(2) కింద జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పటికీ అమల్లోనే ఉన్నట్లు భావించాలి. దీనివల్ల రాష్ట్రపతి ప్రమేయం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు సభలను తిరిగి ప్రారంభించే అధికారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు ఉంటుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు సంబంధించిన కీలక బిల్లులను ఆమోదించుకునేందుకే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ను ప్రోరోగ్ చేయలేదని ప్రచారం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా తేనున్న పునర్విభజన బిల్లు కోసం కేంద్రం త్వరలోనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్ సమావేశాల సమయంలో ఏప్రిల్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు సంఖ్యాబలం లేక ఆమోదం పొందలేదు. ఈ బిల్లు గనక ఆమోదం పొందితే లోక్‌సభలో సభ్యుల సంఖ్య 543 నుంచి ఏకంగా 850కి పెరిగే అవకాశం ఉంది.
పార్లమెంట్ ప్రోరోగ్‌పై ప్రకటన రాకపోవడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ బిల్లుకు అవసరమైన మెజారిటీని సమకూర్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ జాప్యం చేస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 4 నుంచి 22 వరకు నిర్వహించే అంశంపై ఈ వారంలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

