NTV Telugu Site icon

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌కు నేడు ముగింపు.. భారత పతాకధారులుగా మను, శ్రీజేష్‌!

Paris Olympics 2024 Closing Ceremony

Paris Olympics 2024 Closing Ceremony

Paris Olympics 2024 Closing Ceremony Today: గత 19 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికులను అలరిస్తున్న పారిస్‌ ఒలింపిక్స్‌ నేడు ముగియనున్నాయి. జులై 26న అధికారికంగా క్రీడలు ఆరంభమవ్వగా.. ఆగష్టు 11తో ముగియనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 12.30 గంటలకు క్రీడల ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ముగింపు వేడుకల్లో భారత పతాకధారులుగా షూటర్‌ మను బాకర్, హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేష్‌ వ్యవహరించనున్నారు.

పారిస్ ఒలింపిక్స్‌ 2024 చివరి రోజు అథ్లెటిక్స్‌ (మహిళల మారథాన్‌), బాస్కెట్‌బాల్, సైక్లింగ్‌ ట్రాక్, హ్యాండ్‌ బాల్, మోడర్న్‌ పెంటథ్లాన్, వాలీబాల్, వాటర్‌ పోలో, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్‌లో పోటీలు ఉన్నాయి. బాస్కెట్‌బాల్‌ అమ్మాయిల ఫైనల్‌తో విశ్వ క్రీడల పోటీలు ముగుస్తాయి. ఇక శనివారంతోనే భారత ప్రయాణం ముగిసిన విషయం తెలిసిందే. భారత్ మొత్తం 6 పతకాలు గెలుచుకుంది.

పారిస్‌ ఒలింపిక్స్‌ ముగింపు కార్యక్రమం స్టేడ్‌ డి ఫ్రాన్స్‌ స్టేడియంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత పాప్‌ గాయని, రచయిత హెచ్‌ఈఆర్‌ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నృత్యకారులు, సంగీత కళాకారులు తదితరులు తమ ప్రదర్శనలతో అలరించన్నారు.

Show comments