Site icon NTV Telugu

Arshad Nadeem: ఆరంభంలో క్రికెట్‌ ఆడా.. నీరజ్‌తో పోటీ పడటం బాగుంటుంది: పాక్‌ అథ్లెట్ అర్షద్

Arshad Nadeem Gold

Arshad Nadeem Gold

Arshad Nadeem Says It’s always good to compete with Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌ 2024 జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ ఏకంగా 92.97 మీటర్లు బల్లెం విసిరి గోల్డ్‌ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. హాట్ ఫేవరెట్, భారత బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా ఈటెను 89.45 మీటర్లు విసిరి రజతంతో సరిపెట్టుకొన్నాడు. ఫైనల్ అనంతరం అర్షద్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ మధ్య పోరంటే క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ రసవత్తరగానే ఉంటుందన్నాడు. నీరజ్‌తో పోటీ పడటం ఎప్పుడూ బాగుంటుందని, తాను ఎంతగానో ఆస్వాదిస్తానని అర్షద్ చెప్పాడు. స్థాయికి రావడానికి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా అని తెలిపాడు.

‘భారత్, పాకిస్తాన్‌ల మధ్య పోరంటే క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ ఉంటుంది. మైదానంలోనే మేం ప్రత్యర్థులం, బయట మంచి స్నేహితులమే. నీరజ్‌ చోప్రాతో ఇలాంటి పెద్ద వేదికలపై పోటీపడటం బాగుంటుంది. ఇలాంటి పోటీ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. క్రీడాకారులుగా ఇండో-పాక్ దేశాల మధ్య స్నేహభావం కొనసాగేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. పాక్‌ ప్రజలకు కృతజ్ఞతలు. కొన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలుస్తున్నారు. నాపై నమ్మకం ఉంచి ప్రతి ఒక్కరూ ప్రార్థించారు. వారి దీవెనలతోనే ఈరోజు గోల్డ్ మెడల్ సాధించా’ అని అర్షద్ నదీమ్‌ చెప్పాడు.

Also Read: PR Sreejesh: హాకీ కిట్ కొనడానికి ఆవును అమ్మిన శ్రీజేశ్‌ తండ్రి.. ఆ రోజు ఏం చెప్పాడంటే?

‘గాయం కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. కోలుకొని వచ్చాక రిథమ్‌ కోసం తీవ్రంగా శ్రమించా. ఫిట్‌నెస్‌పై ఎంతో దృష్టిపెట్టాను. ఫైనల్లో రెండో ప్రయత్నంలో 92.97 మీటర్లు విసిరా. అంతకుమించి విసరగలననే ఆత్మవిశ్వాసం నాలో ఉన్నా.. స్వర్ణం గెలిచేందుకు అది చాలనుకున్నా. భవిష్యత్తులోనూ ఇదేతరహా ప్రదర్శన ఇచ్చేందుకు కష్టపడతా. ఆరంభంలో నేను క్రికెట్‌ ఆడాను. టేబుల్ టెన్నిస్‌ కూడా ఆడాను. చివరకు అథ్లెటిక్స్‌ల్లో పాల్గొన్నా. జావెలిన్‌ త్రో తీసుకోవాలని నా కోచ్ సలహా ఇచ్చారు. దీంతో ఇటువైపు వచ్చా. మంచి ఫిజిక్‌ ఉండడంతో ఆయన అలా చెప్పారు. గోల్డ్ మెడల్ కొట్టడం సంతోషంగా ఉంది. అయితే ఈ స్థాయికి రావడానికి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చా. మెడల్ సాధించడం వెనుక మా ఊరి వారి పాత్ర ఎంతో ఉంది’ అని అర్షద్ పేర్కొన్నాడు.

Exit mobile version