ఎర్రకోట దాడి కేసులో పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఎర్రకోటపై దాదాపు 24 ఏళ్ల క్రితం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడిలో పాక్ ఉగ్రవాదికి ఉరిశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పిచ్చింది. దీంతో ఉగ్రవాది ఆరిఫ్ తన ప్రాణాలను రక్షించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు. ఇప్పుడు అక్కడ కూడా అతని క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించబడింది. అయితే మహ్మద్ ఆరిఫ్ కు ఇంకా ఒక ఆప్షన్ మిగిలి ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 (రాజ్యాంగ పరిష్కారాల హక్కు) ప్రకారం ఆరిఫ్ శిక్షలో రాయితీని కోరవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా.. 22 డిసెంబర్ 2000న ఉగ్రవాదులు ఎర్రకోటలోకి ప్రవేశించారు. వారు 7 రాజ్‌పుతానా రైఫిల్స్ సైనికులపై పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆరిఫ్ అలియాస్ అషఫ్కాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీం కోర్టు మరణ శిక్ష విధించగా.. రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే 15న ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్‌ను స్వీకరించారు. ఆగస్టు 27న ఎర్రకోట దాడిలో దోషిగా తేలిన పాక్ ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించినట్లు రాష్ట్రపతి సచివాలయం ఆగస్టు 29న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.