Site icon NTV Telugu

Salman Ali Agha: ప్రపంచ కప్‌లో ఎంట్రీపై ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ కెప్టెన్ వింత ప్రకటన..

Salman Ali Agha

Salman Ali Agha

T20 World Cup – Salman Ali Agha: టీ20లో పాకిస్థాన్ ఎంట్రీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓ వైపు ప్రపంచ కప్ దగ్గర పడుతోంది. మరోవైపు.. పాకిస్థాన్ జట్ట తన వ్యూహాలను క్రమంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా కెప్టెన్ సల్మాన్ అలీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేస్తానని ప్రకటించాడు. ఇప్పటి వరకు టీ20 సిరీస్‌లలో టాప్ సిక్స్‌ చివరిలో బ్యాటింగ్ చేసిన అలీ.. ప్రస్తుతం జట్టు అవసరాల నిమిత్తం ముందుగానే రంగంలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియాతో లాహోర్‌లో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఈ మార్పు కనిపించింది. నంబర్ 3లో బ్యాటింగ్‌కు దిగిన అలీ ఆఘా, ధైర్యంగా ఆడుతూ వేగంగా 39 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ వల్లే పాకిస్థాన్ జట్టు మంచి స్కోర్ చేయగలిగింది. చివరికి ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో గెలిచింది.

READ MORE: Greatest T20 Cricketer: ఏకంగా ఏడు సార్లు.. విరాట్ కోహ్లీ ఆధిపత్యం మాములుగా లేదుగా!

ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ అలీ ఆఘా మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాతో మిగిలిన మ్యాచ్‌లలోనే కాకుండా, టీ20 ప్రపంచకప్‌లోనూ నంబర్ 3లోనే బ్యాటింగ్ చేస్తానని స్పష్టం చేశాడు. ఈ నిర్ణయం వెనుక తన ఆలోచనను వివరించాడు. “ప్రపంచకప్‌లో స్పిన్ బౌలింగ్ ఎక్కువగా ఎదురవుతుందని నా అంచనా. పవర్‌ప్లే సమయంలో స్పిన్నర్లపై దాడి చేయడం నాకు బాగా అలవాటు, అందుకే ముందుకు వచ్చాను.” అని తెలిపాడు. సాధ్యమైనంత వేగంగా ఆడుతూ.. మంచి పరుగులు స్కోర్ చేయడమే తన లక్ష్యమని వెల్లడించాడు. అయితే.. అలీ ఆఘా నంబర్ 3కి రావడంతో జట్టులో మరో మార్పు కనిపించే అవకాశం ఉంది. బాబర్ ఆజమ్ తాజాగా జరిగిన మ్యాచ్‌లో నంబర్ 4లో బ్యాటింగ్ చేశాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 20 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో బ్యాటింగ్ క్రమం విషయంలో పాకిస్థాన్ కొత్తగా ఆలోచిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సయిమ్ అయూబ్ కీలక పాత్ర పోషించాడు. అతడు 40 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగినప్పుడు పాకిస్థాన్ స్పిన్ బౌలర్లు చెలరేగిపోయారు. స్పిన్‌కు ఆరు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. కాగా.. అలీ ఆఘా నంబర్ 3లో బ్యాటింగ్ చేయాలన్న నిర్ణయం పాకిస్థాన్ జట్టుకు కొత్త దిశ చూపిస్తోంది. ప్రపంచకప్ ముందు జట్టు సరైన కాంబినేషన్ వెతుకుతున్న సమయంలో ఈ మార్పు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. అయితే.. పాకిస్థాన్ జట్టు వరల్డ్ కప్‌లో ఎంట్రీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఇదో వింత ప్రకటన అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ వరల్డ్‌ కప్‌పై క్లారిటీ ఇవ్వండి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Exit mobile version