Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..

Pakistan

Pakistan

పాకిస్థాన్ టీ20 జట్టు నూతన పూర్తిస్థాయి కెప్టెన్‌గా సాహిబ్జాదా ఫర్హాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వర్తించిన సల్మాన్ అలీ ఆఘా స్థానంలో పీసీబీ ఈ నియామకం చేపట్టింది. ఇటీవలే ముగిసిన 2026 ఏషియన్ గేమ్స్‌లోనూ ఫర్హానే జట్టుకు నేతృత్వం వహించారు. అయితే ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలైంది. తాజాగా శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వదేశంలో జరిగే సిరీస్‌కు పాకిస్థాన్‌ జట్టుకు నాయకత్వం వహించడం గౌరవంగా ఉందని, ఈ కొత్త సవాల్‌ పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు.

అయితే కెప్టెన్‌గా వ్యవహరించడంపై కొంత ఒత్తిడి ఉంటుందని ఫర్హాన్ అంగీకరించారు. జట్టును ముందుండి నడిపించాల్సి ఉన్నందున విభిన్నమైన మైండ్‌సెట్‌ను ప్రదర్శించాల్సి వస్తుందన్నారు. దేశవాళీ క్రికెట్‌లో తనకు నాయకత్వ అనుభవం ఉండటం వల్ల జట్టును ఎలా నడిపించాలనే దానిపై స్పష్టత ఉందని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ అవుతానని ఊహించలేదని, తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పటికీ నిజమవుతాయని భావోద్వేగంగా వెల్లడించారు.

ప్రస్తుత జట్టుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సీనియర్ ఆటగాళ్ల అనుభవం మైదానంలో ఎంతో ఉపయోగపడుతుందని ఫర్హాన్ అన్నారు. టీ20 క్రికెట్‌లో తమ జట్టు మరింత దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఫఖర్ జమాన్, మాజ్ సదాకత్, హసన్ నవాజ్ వంటి ఆటగాళ్ల బ్యాటింగ్ శైలి కూడా తనలాగే దూకుడుగా ఉంటుందని, తాను కోరుకున్న పటిష్టమైన జట్టు తనకు దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు.

పాకిస్థాన్ – శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 9 నుంచి రావల్పిండి వేదికగా ప్రారంభం కానుంది. రెండో టీ20 అక్టోబర్ 11న, మూడో టీ20 అక్టోబర్ 13న జరగనున్నాయి. నూతన కెప్టెన్ నేతృత్వంలో పాక్ జట్టు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.