Henley Passport Index 2025: ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్ కొలిచే ప్రతిష్టాత్మక హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజాగా ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్ అనేది ఒక దేశ పౌరుడు ముందస్తు వీసా లేకుండా ఎన్ని ఇతర దేశాలలోకి ప్రవేశించవచ్చో వెల్లడిస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్‌పోర్ట్‌గా పాకిస్థాన్ నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ చివరి నుంచి నాలుగో స్థానంలో గత నాలుగు ఏళ్లుగా నిలుస్తూ వస్తుంది. కొత్త ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింగపూర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశ పౌరులు వీసా లేకుండా ప్రపంచంలోని దాదాపు ప్రతి మూలకు ప్రయాణించగలరు.
READ ALSO: Indian Air Force Strength: చైనాను వెనక్కి నెట్టిన భారత్.. యూఎస్, రష్యా తర్వాత ఇండియానే..
కేవలం 3 దేశాల కంటే మెరుగ్గా పాకిస్తాన్..
ఈ సంవత్సరం ర్యాంకింగ్‌లో పాకిస్థాన్ పాస్‌పోర్ట్ 103వ స్థానంలో ఉంది. ఈ ర్యాంక్ యెమెన్‌తో సమానంగా ఉంది. వాస్తవానికి ఈ ర్యాంకింగ్ అనేది పాకిస్థాన్‌కు పెద్ద దెబ్బ అని, ఇది ప్రపంచంలో నాలుగవ బలహీనమైన పాస్‌పోర్ట్‌గా నిలిచిందని విశ్లేషకులు పేర్కొన్నారు. తాజా జాబితా ప్రకారం.. 227 ప్రపంచ గమ్యస్థానాలలో పాకిస్థాన్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు 31 దేశాలకు మాత్రమే వీసా-రహిత యాక్సెస్ ఉన్నట్లు వెల్లడైంది. ఈ జాబితాలో దాయాది దేశం కంటే మూడు దేశాలు మాత్రమే దిగువన ఉన్నాయి. 104వ స్థానంలో ఉన్న ఇరాక్ పౌరులు వీసా లేకుండా కేవలం 29 దేశాలకు మాత్రమే ప్రయాణించడానికి వీలు ఉంది. 105వ స్థానంలో ఉన్న సిరియా 26 గమ్యస్థానాలకు మాత్రమే వీసా రహిత ప్రవేశాన్ని కలిగి ఉంది. జాబితాలో అట్టడుగు స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ (106వ స్థానం) ఉంది. ఈ దేశ పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా కేవలం 24 దేశాలకు మాత్రమే ప్రయాణించగలరు. హెన్లీ ఇండెక్స్‌లో పాక్ ప్రపంచంలోనే నాలుగవ చెత్త పాస్‌పోర్ట్‌గా నిలిచిపోవడం ఇది వరుసగా నాలుగో ఏడాది.
జాబితాలో ఆసియా దేశాలు ఆధిపత్యం కొనసాగించాయి. సింగపూర్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా గుర్తింపు పొందింది, ఈ దేశ పౌరులకు 193 గమ్యస్థానాలకు వీసా లేకుండా యాక్సెస్‌ను ఉంది. రెండవ స్థానంలో దక్షిణ కొరియా నిలిచింది. ఈ దేశపౌరులు వీసా లేకుండా 190 దేశాలకు ప్రయాణించవచ్చు. మూడవ స్థానంలో జపాన్ 189 వీసా రహిత గమ్యస్థానాలతో ఉంది. తరువాత యూరోపియన్ దేశాలు జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ నాలుగవ స్థానాన్ని పంచుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా 188 గమ్యస్థానాలకు ప్రయాణించగలరు. ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ 187 వీసా రహిత స్కోరుతో ఐదవ స్థానంలో ఉన్నాయి.
టాప్ 10 నుంచి అమెరికా ఔట్..
ఈ ఏడాది ర్యాంకింగ్‌లో అత్యంత ఆశ్చర్యకరమైన ఫలితాలలో ఒకటి US, UK వంటి శక్తివంతమైన దేశాల ర్యాంకింగ్ క్షీణత. గత 20 ఏళ్ల హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ చరిత్రలో మొదటిసారి యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోని 10 అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా నుంచి నిష్కమ్రించింది. 2014లో US పాస్‌పోర్ట్ అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు అది మలేషియాతో సమానంగా 12వ స్థానానికి పడిపోయింది. ఇప్పుడు US పౌరులు ప్రపంచంలోని 227 గమ్యస్థానాలలో 180కి మాత్రమే వీసా లేకుండా ప్రయాణించగలరు.
షాక్‌లో భారత్..
ఇప్పటివరకు అత్యల్ప ర్యాంకింగ్‌కు బ్రిటిష్ పాస్‌పోర్ట్ పడిపోయింది. ఇది 2015లో జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, తర్వాత 6 నుంచి 8వ స్థానానికి పడిపోయింది. ఇదే సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పాస్‌పోర్ట్ అద్భుతమైన పురోగతిని కొనసాగిస్తోంది. గత ఏడాది మొదటిసారి టాప్ 10లో ప్రవేశించిన UAE పాస్‌పోర్ట్, 184 వీసా-ఫ్రీ స్కోర్‌తో మరో స్థానం ఎగబాకి ఎనిమిదవ స్థానానికి చేరుకుంది. చైనా పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ కూడా తగ్గుదల చూసింది. గత సంవత్సరం 59వ స్థానంలో ఉన్న చైనా ఇప్పుడు 64వ స్థానానికి పడిపోయింది. దాని వీసా-ఫ్రీ స్కోర్ 85 నుండి 82కి దిగజారింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే భారతదేశం ర్యాంకింగ్ కూడా పడిపోయింది. గత ఏడాది ఇండియా 80వ స్థానంలో ఉంటే, ఇప్పుడు 85వ స్థానానికి పడిపోయింది. దీంతో భారతీయులు ముందస్తు వీసా లేకుండా కేవలం 57 దేశాలకు మాత్రమే ప్రయాణించగలరు.
READ ALSO: Crypto Scam : వెలుగులోకి మరో క్రిప్టోకరెన్సీ మోసం
