NTV Telugu Site icon

Pakistan: దేశం కోసం పాక్ అధ్యక్షుడు జర్దారీ కీలక నిర్ణయం

De

De

పాక్ అధ్యక్షుడు జర్దారీ దేశం కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న దేశం కోసం తన జీతాన్ని త్యాగం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను బయటపడేందుకు ప్రభుత్వ పెద్దలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సొమ్ము తీసుకోవడం భావ్యం కాదని అధ్యక్షుడు జర్దారీ జీతాన్ని వదులుకొన్నారు.

ఆర్థిక నిర్వహణను ప్రోత్సహించేందుకే జర్దీరీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయం ‘ఎక్స్‌’ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

దేశంలో ఆర్థిక నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చాలన్నదే అధ్యక్షుడి అభిప్రాయంగా కనిపిస్తోంది. దీంతో దేశ ఖజానాపై తన జీతం భారం కాకూడదని అధ్యక్షుడు నిర్ణయించుకొన్నారు. అందుకే ఆయన జీతం తీసుకోకూడదని అనుకొన్నారని ట్విటర్‌లో పేర్కొంది. ఇటీవలే జర్దారీ రెండో సారి దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

పాక్‌ ఇంటీరియర్‌ మంత్రి మొహసిన్‌ నక్వీ కూడా తన పదవీకాలంలో జీతాన్ని వదులుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఇది సవాళ్లతో కూడిన సమయం.. వీలైనన్ని మార్గాల్లో దేశానికి అండగా ఉండి సేవ చేయాలని నిర్ణయించుకొన్నట్లు ఆయన పేర్కొన్నారు.

గత కొంతకాలంగా పాక్‌ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. గత నెల ఐఎంఎఫ్‌ నుంచి 6 బిలియన్‌ డాలర్ల విలువైన అప్పు తీసుకొనేందుకు సన్నాహాలు చేసుకొంటున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే దేశ ప్రథమ మహిళగా తన కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పాక్‌ మీడియాలో కథనాలు ప్రచారం అయ్యాయి. జర్దారీ సతీమణి, మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో 2007లో హత్యకు గురయ్యారు. దీంతో ప్రథమ మహిళ స్థానాన్ని కుమార్తెతో భర్తీ చేయాలని జర్దారీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.