Pakistan: ఎన్నిసార్లు కొట్టిన చావని పాము లాంటిది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాదం. నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత టాప్, వాంటెడ్ టెర్రరిస్ట్‌లు అయిన హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి వారు పాకిస్థాన్‌లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే టైంలో పాకిస్థాన్ ఒక కొత్త టెర్రరిస్ట్ లీడర్‌ను సృష్టించింది. ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకని ఆయనకు పాకిస్థాన్ సైన్యం మద్దతు ఉందని చెబుతున్నారు.. ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Uttam Kumar Reddy : పాలమూరు మీద ఎందుకింత వివక్ష..?
ఈ కొత్త టెర్రరిస్ట్ లీడర్ పేరు ఖారీ మొహమ్మద్ యాకూబ్ షేక్. ఇతను లష్కర్ నుంచి ఉగ్ర శిక్షణ పొందిన వాడు. ప్రస్తుతం యాకూబ్ తన సొంత సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. పలు నివేదికల ప్రకారం.. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కొత్త ఉగ్రసంస్థ పేరు సెంట్రల్ ముస్లిం లీగ్. నిజానికి ఇది పాకిస్థాన్‌లో ఒక రాజకీయ పార్టీగా నమోదు అయ్యింది. అలాగే దీనికి ఆ దేశ సైన్యం మద్దతు కూడా ఉందని చెబుతారు.
ఎవరీ ఖారీ యాకూబ్ షేక్..
ఖారీ యాకూబ్ షేక్ 1972లో పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో జన్మించాడు. మదర్సాలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆయన మత ప్రచారకుడయ్యాడిగా తన జీవితాన్ని ప్రారంభించి, ఉగ్రవాదిగా మారాడు. 2012లో మొదటిసారిగా ఖారీ యాకూబ్ షేక్‌ను యునైటెడ్ స్టేట్స్ ఉగ్రవాదిగా పేర్కొంది. ఆ టైంలో ఇతను లష్కరే తోయిబా కోసం పనిచేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. అలాగే ఇతనికి ఉగ్రవాది మసూద్ అజార్‌తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతారు. 2017లో ఖారీ దిఫా-ఏ-పాకిస్థాన్ కౌన్సిల్ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేశాడు, కానీ విజయం సాధించలేదు. 2025 ప్రారంభంలో ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, ఇతను తాలిబాన్ పాలనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశాడు. ఇదే ఆయనకు పాకిస్థాన్ సైన్యంతో సన్నిహిత సంబంధాలకు దారితీసిందని చెబుతారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి మసూద్ అజార్, హఫీజ్ సయీద్ అజ్ఞాతంలో ఉన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో మసూద్ కుటుంబానికి చెందిన పద్నాలుగు మంది మరణించారు. అలాగే హఫీజ్ రహస్య స్థావరం కూడా ధ్వంసమైంది. హఫీజ్ – మసూద్‌లు ప్రస్తుతం పాకిస్థాన్ సైన్యం నిఘాలో భద్రంగా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మీడియాలో వారిద్దరి గురించి ఎటువంటి వార్తలు లేవు. ప్రస్తుతం పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-తాలిబాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు పాక్ సైన్యం ఈ రెండు ఉగ్రవాద సంస్థలను నిర్మూలించలేకపోయింది. ఇదే టైంలో TTP తన పోరాటాన్ని జిహాద్‌గా ముద్రవేసింది. అలాగే TTPకి స్థానిక పౌరుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. దీంతో TTP, BLA వంటి ఉగ్రవాద సంస్థలను ఎదుర్కోవడానికి పాకిస్థాన్ మళ్లీ అదే ఉగ్రవాద సూత్రాన్ని అనుసరించాలని నిర్ణయించిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయంలో హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి పాత ఉగ్రవాదులు ఇకపై పాకిస్థాన్‌కు ఉపయోగపడరు కాబట్టి వారి స్థానంలో కొత్త టెర్రరిస్ట్ లీడర్‌గా ఖారీ యాకుబ్‌ను సైన్యం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
READ ALSO: Siddhu Jonnalagadda: సిద్ధూ ‘డబుల్ షాక్’: ఆగిపోయిన రెండో సినిమా?
