Site icon NTV Telugu

Iman Mazari: పాకిస్థాన్ ప్రభుత్వానికి ఎదురెళ్లిన మహిళ..10 ఏళ్ల జైలు శిక్ష విధించినా “తగ్గేదే లే” అంటూ..

Iman Mazari

Iman Mazari

Iman Mazari: పాకిస్థాన్‌ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓ మహిళ గళంవిప్పుతోంది. ఎంత ఒత్తిడి తెచ్చినా, ఆన్‌లైన్‌లో దూషణలు చేసినా, అరెస్టులు చేసినా దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. ఆమె ఎవరో కాదు ఇమాన్ మజారి. మానవ హక్కుల న్యాయవాదిగా దేశంలోనే బాగా తెలిసిన మహిళ ఆమె. ఈ వారాంతంలో కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించినా, తన పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టంగా చెప్పింది. 32 ఏళ్ల ఇమాన్ మజారి పేరు దేశవ్యాప్తంగా వినిపించడానికి కారణం సున్నితమైన కేసులను లేవనెత్తడం. జాతి వివక్షకు గురైన వర్గాల కోసం, జర్నలిస్టులపై వచ్చిన పరువు నష్టం కేసుల్లో, అలాగే దైవదూషణ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరఫున ఆమె ధైర్యంగా వాదించింది. ఇవన్నీ పాకిస్థాన్‌లో చాలా ప్రమాదకరమైన అంశాలు. ఆమె పేరు పెరిగిన కొద్దీ, కేసులూ పెరిగాయి. “సైబర్ ఉగ్రవాదం”, “ద్వేష ప్రసంగం” లాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.

READ MORE: Devara 2 : దేవర 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పిన నిర్మాత సుధాకర్

శనివారం ఇస్లామాబాద్ కోర్టు ఆమె, భర్త హాది అలీ చట్టాకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. “దేశ వ్యతిరేక” సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. పాకిస్థాన్ సైన్యం ఆ పోస్టుల్లో విమర్శలు గుప్పించింది. ఈ పోస్టులను “అత్యంత అభ్యంతరకరమైనవి”గా కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఈ తీర్పు రావడానికి ముందు రోజు కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగానే దంపతులను మళ్లీ అరెస్ట్ చేశారు. అయితే.. కోర్టులో ఇమాన్ మజారి మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. ఈ దేశంలో నిజం చెప్పడం చాలా కష్టమని చెప్పింది. ఎన్ని సమస్యలు వచ్చానా వెనక్కి తగ్గము. నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. ఆమె ధైర్యాన్ని చూసి, పాకిస్థాన్‌లో ఒకప్పుడు మానవ హక్కుల కోసం పోరాడిన అస్మా జహాంగీర్‌తో పోల్చుతున్నారు. అలా పోల్చడం తనకు గర్వంగా ఉందని ఇమాన్ అంటుంది. ఇమాన్ మజారి తల్లి షిరీన్ మజారి ఒకప్పుడు పాకిస్థాన్ మానవ హక్కుల శాఖ మంత్రిగా పని చేశారు. తండ్రి దేశంలోనే ప్రముఖ పిల్లల వైద్యుడిగా కొనసాగుతున్నారు. ఇలాంటి సౌకర్యవంతమైన నేపథ్యం ఉన్నా, ఇమాన్ మాత్రం అణచివేయబడినవారి కోసం నిలబడే మార్గాన్ని ఎంచుకుంది.

Exit mobile version