Pakistan Gifts Turkiye: సొంత దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా భారత్‌పై విషం చిమ్మడం మాత్రం పాకిస్థాన్ ఆపదు. మే నెలలో జరిగిన భారతదేశం-పాకిస్థాన్ వివాదంలో తుర్కియే దాయాదికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ తుర్కియేకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా.. పాకిస్థాన్‌లోని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం తుర్కియేకు వెయ్యి ఎకరాల భూమిని ఉచితంగా అందించింది. కరాచీ ఇండస్ట్రియల్ పార్క్‌లో కొత్త ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (EPZ)ను స్థాపించడానికి ఈ భూమిని ఇస్తున్నట్లు టాక్. తుర్కియే కంపెనీలను పాకిస్థాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షించడం దీని ఉద్దేశ్యమని చెబుతున్నారు.
READ ALSO: Dhana Sri : చాహల్ మోసం చేశాడు.. ధనశ్రీ షాకింగ్ కామెంట్స్
వాణిజ్యాన్ని $5 బిలియన్లకు పెంచాలని ప్లాన్..
తాజాగా పాక్-తుర్కియే మధ్య కుదిరిన అగ్రిమెంట్‌తో రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని $5 బిలియన్లకు పెంచాలని దాయాది లక్ష్యంగా పెట్టుకుంది. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ 2025 ఏప్రిల్‌లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌ను కలిసి ఈ భూమిని అందించారని తాజా నివేదికలు చెబుతున్నాయి. పాకిస్థాన్ అధికారుల ప్రతినిధి బృందం ఇటీవల టర్కీని సందర్శించింది. అక్కడ ఉన్న ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోను వాళ్లు పరిశీలించి, పెట్టుబడులు ఏవిధంగా పెడుతున్నారో అర్థం చేసుకున్నారు. గతంలో ఇవి ఆ దేశ ఆధీనంలో ఉండేవి, ఇప్పుడు ప్రైవేట్ వాళ్లు నిర్వహిస్తున్నారు. తాజాగా పాక్‌లో పెట్టుబడులు పెట్టనున్న పెట్టుబడిదారులకు 20 ఏళ్ల పాటు పన్ను మినహాయింపులు, సరసమైన భూమి, నిరంతర విద్యుత్, నీటి సరఫరా లభిస్తాయని దాయాది చెబుతుంది.
పాకిస్థాన్ కూడా కరాచీలో ఇలాంటి జోన్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. కరాచీలో EPZ స్థాపించిన తర్వాత, ఇక్కడి నుంచి మధ్య ఆసియా, గల్ఫ్ దేశాలకు వస్తువులను సులభంగా రవాణా చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. టర్కిష్ కంపెనీలు ఇక్కడ ఉత్పత్తి చేస్తే, వారి రవాణా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం రవాణా ఖర్చులు టన్నుకు $4,000గా ఉన్నాయి, ఇది టన్నుకు $1,000కి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ టర్కీతో వాణిజ్య సంబంధాలను విస్తరించుకోవాలని, గల్ఫ్ (GCC) దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని కూడా ఆలోచిస్తుంది. ఈ కొత్త జోన్ పాకిస్థాన్, టర్కీలకు గణనీయమైన ప్రయోజనాలను తీసుకువస్తుందని, అలాగే ఇరుదేశాల వాణిజ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
EPZ అంటే ఏమిటో తెలుసా?
EPZ అంటు ఒక ప్రత్యేక జోన్. ఈ జోన్లలో ఏర్పాటు చేసిన కంపెనీలకు తమ వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను అందిస్తుంది. ఈ జోన్లలో ఏర్పాటు చేసిన కంపెనీలకు ముడి పదార్థాలు, యంత్రాల కొనుగోలుపై పన్నుల నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే ఇవి చౌకైన విద్యుత్, నీటి సదుపాయాలను పొందుతాయి. కానీ ఇక్కడ ఒక షరతు ఉంది. అది ఏమిటంటే ఈ EPZ జోన్‌లో తయారు చేయసిన వస్తువులను విదేశాలకు మాత్రం విక్రయించాలి. వీటితో ఏ దేశానికైనా మూడు ప్రధాన ప్రయోజనాలను సమకూరుతాయి. మొదటిది ప్రజలకు ఉపాధి, రెండవది విదేశీ కంపెనీల పెట్టుబడి, మూడవది విదేశీ కరెన్సీని (డాలర్లు) వస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అక్కడి ప్రభుత్వాలు దీనిని ఒక వ్యూహంగా ఉపయోగిస్తాయి.
