Pakistan Foreign Loans: ప్రపంచంపైకి ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాపం ఊరికే పోతుందా.. ఇప్పుడు పాకిస్థాన్‌కు ఆ పాపం చుట్టుకుంది. ఎందుకంటే దాయాది దేశం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ అప్పుల ఉచ్చులో చిక్కుకుపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల ముందు అప్పుల కోసం సాగిలాపడిపోతూ.. వంగివంగి దండాలు పెడుతుంది. పాక్ కొత్త అప్పులు తీసుకోవడం ద్వారా పాత అప్పులను తిరిగి చెల్లిస్తోందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా, చైనా మొదలైన దేశాలకు దాయాది దేశం భారీగా రుణపడి ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. పాకిస్థాన్ మొత్తం ఆదాయం కూడా దాని రుణాన్ని తీర్చడానికి సరిపోదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం పాక్ మొత్తం విదేశీ అప్పు $134.971 బిలియన్లకు (సుమారు ₹11 లక్షల కోట్లు) చేరుకుందని అంచనా.
READ ALSO: Israel: బ్రిటీష్ వారు కాదు, భారత సైనికులు మమ్మల్ని రక్షించారు.. ఇజ్రాయిల్ మేయర్..
ఈ ఏడాది ఎంత చెల్లించాలో తెలుసా..
ఈ ఏడాది పాకిస్థాన్ అక్షరాల $23 బిలియన్లు (సుమారు ₹1.9 లక్షల కోట్లు) విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంది. జూలై 2024లో పాక్ IMF నుంచి సుమారు $7 బిలియన్ల (సుమారు ₹58,000 కోట్లు) కొత్త రుణాన్ని పొందింది. జూన్ 2023లో $3 బిలియన్లు అప్పుగా తీసుకొని దేశం దివాలా తీయకుండా తప్పించుకోగలిగింది. దీని అర్థం దాయాది దేశం ప్రతి ఏడాది సహాయం కోసం IMFను వేడుకోవలసి వస్తుంది. తాజాగా పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆదేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు ట్రంప్‌కు అరుదైన మట్టి, విలువైన రాళ్లతో కూడిన పెట్టెను బహుమతిగా ఇచ్చారు. దీంతో పాక్ తన వనరులను ట్రంప్‌కు విక్రయించడానికి సిద్ధంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పాక్‌లోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో అరుదైన మట్టి ఖనిజాల నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. సెప్టెంబర్ 8న ఇస్లామాబాద్‌లో అమెరికన్ కంపెనీ యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజిక్ మెటల్స్ (USSM)తో పాక్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సమయంలో షాబాజ్, మునీర్ అమెరికన్ కంపెనీతో రెండు ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ ఒప్పందాలు యాంటిమోనీ, రాగి, బంగారం, టంగ్‌స్టన్, అరుదైన భూమి మూలకాలు వంటి కీలకమైన ఖనిజాల ఎగుమతి, పాకిస్థాన్‌లో మైనింగ్ సౌకర్యాల నిర్మాణాన్ని కవర్ చేస్తాయి.
ప్రతిఫలంగా పాక్ లభించేంది ఏంటి?
ఈ ఒప్పందానికి ప్రతిగా పాకిస్థాన్ అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పాక్ అమెరికాతో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఇది భద్రతా హామీలు, సైనిక సహకారం వంటి ప్రయోజనాలను అందించగలదు. 2023 ఆర్థిక సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ పాకిస్థాన్‌కు సుమారు $169.9 మిలియన్లు, 2024లో $164.7 మిలియన్లు, 2025లో $55.1 మిలియన్ల సహాయాన్ని అందించింది. యునైటెడ్ స్టేట్స్ IMFకి అతిపెద్ద సహకారి. IMF నిర్ణయాలలో యునైటెడ్ స్టేట్స్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పాక్ చైనా నుంచి దాదాపు $29 బిలియన్లు (₹2.4 లక్షల కోట్లు) రుణాలు తీసుకుంది. ఇది దాయాది దేశం మొత్తం బాహ్య రుణంలో దాదాపు 22% శాతం. జూన్ 2025లో పాక్ తిరిగి చెల్లించడానికి నిధులు లేకపోవడంతో చైనా మళ్లీ పాక్‌కు $3.4 బిలియన్ల రుణాన్ని అందించింది. ఇప్పుడు పాకిస్థాన్ ఏటా $4.5 బిలియన్లను చైనాకు మాత్రమే తిరిగి చెల్లించాల్సి వస్తుంది. అలాగే సౌదీ అరేబియా, పాక్‌కు దాదాపు $1.2 బిలియన్ల చమురు రుణాలను అందించింది. పాక్ ఈ చమురు రుణాలను వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదు. మార్చి 2025 వరకు ప్రతి నెలా దాదాపు $1 బిలియన్ విలువైన చమురును కొనుగోలు చేయవచ్చు. సౌదీ అరేబియా దాయాది దేశానికి $5 బిలియన్ల నగదును కూడా అందించింది. పాక్ దీనికి 4% వడ్డీ రేటుతో తిరిగి చెల్లించాల్సి ఉంది.
పాకిస్థాన్ కరాచీలో తుర్కియేకు 1,000 ఎకరాల భూమిని ఉచితంగా అందించింది. కరాచీ ఇండస్ట్రియల్ పార్క్‌లో కొత్త ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (EPZ)ను స్థాపించడానికి ఈ భూమిని అందిస్తున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. ఈ జోన్ ఉద్దేశ్యం తుర్కియే కంపెనీలను పాక్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షించడం. దీని ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని $5 బిలియన్లకు పెంచాలని పాక్ లక్ష్యంగా పెట్టుకుంది. కరాచీలో EPZ స్థాపించిన తర్వాత, ఇక్కడి నుంచి మధ్య ఆసియా, గల్ఫ్ దేశాలకు వస్తువులను సులభంగా రవాణా చేయవచ్చు. తర్కియే కంపెనీలు ఇక్కడ ఉత్పత్తి చేస్తే, వారి రవాణా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం, రవాణా ఖర్చులు టన్నుకు $4,000గా ఉన్నాయి. కంపెనీలు ఏర్పడిన తర్వాత ఇవి టన్నుకు $1,000కి తగ్గుతుందని అంచనా. అలాగే తుర్కియే పాక్‌కు ఆయుధాలు, డ్రోన్‌లు, క్షిపణులు, సైనిక సాంకేతికతను కూడా అందిస్తుంది.
READ ALSO: US Government Shutdown: షట్‌డౌన్ దిశగా యూఎస్ ప్రభుత్వం..పాపం ట్రంప్!
