Pakistan TLP: పురాణాల్లో భస్మాసురుడు గుర్తుకు ఉన్నాడు కదా.. అచ్చం ఆయన లాగానే ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి ఉంది. ఆయన సాధించుకున్న గొప్ప వరంతో తన నెత్తిన తానే చెయ్యి పెట్టుకొని భస్మం అయినట్లు.. ప్రపంచంపైకి ఉగ్రవాదం అనే పెనుభూతాన్ని వదిలిన దాయాది దేశం ఇప్పుడు.. అదే ఉగ్రవాదంతో అష్టకష్టాలు పడుతుంది. తాజాగా లాహోర్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలు పాకిస్థాన్ స్వయంగా చేసుకున్న తప్పుల ఫలితం అంటున్నారు విశ్లేషకులు. తాజాగా హింసాత్మక ఘర్షణల వెనుక ఒకప్పుడు పాక్ సైన్యానికి ఇష్టమైన తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్థాన్ (TLP) అనే రాడికల్ సంస్థ హస్తం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
READ ALSO: Bigg Boss 9: బిగ్ బాస్9లో సూపర్ షాకింగ్ ఎలిమినేషన్
TLPని పాలుపోసి పెంచిన పాక్ సైన్యం..
ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. TLPని పాక్ సైన్యం స్వయంగా సృష్టించి పెంచి పోషించింది. దేశంలో పౌరులు ఎన్నుకున్న ప్రభుత్వాలను అణచివేయడానికి “వీధి దళం”ను సృష్టించడం టీఎల్‌పీ లక్ష్యం. భారతదేశానికి వ్యతిరేకంగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్ అమలు చేసిన వ్యూహం ఇదే. కానీ ఇప్పుడు పాక్ పాలు పోసి పెంచిన పాము దానినే కాటు వేయడం ప్రారంభించింది. లండన్‌కు చెందిన పాకిస్థానీ మానవ హక్కుల కార్యకర్త ఆరిఫ్ అజాకియా మాట్లాడుతూ.. “లష్కరే తోయిబా లాగే టీఎల్‌పీ కూడా పాక్ సైన్యం సృష్టించిన సంస్థ అని అన్నారు. దీనిని దేశీయ రాజకీయాలను తారుమారు చేయడానికి సైన్యం సృష్టించింది అని చెప్పారు. ఇప్పుడు ఈ సంస్థ పాకిస్థాన్‌కు తలనొప్పిగా మారిందని అభివర్ణించారు. శనివారం లాహోర్‌లో భారీ తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్థాన్ (TLP) నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో వేలాది మంది పాల్గొని ఇస్లామాబాద్ వైపు కవాతు చేశారు. ఈ సమయంలో జరిగిన హింసాత్మక ఘర్షణల కారణంగా తన 11 మంది మద్దతుదారులు మరణించారని TLP వ్యవస్థాపకుడు ఖాదిమ్ హుస్సేన్ రిజ్వి వెల్లడించారు.
పాక్ సైన్యం డబుల్ గేమ్..
2015లో ఏర్పడిన నాటి నుంచి ఈ సంస్థ పాకిస్థాన్‌ను పదే పదే ఇబ్బందులకు గురిచేసింది. 2017లో ఇది 21 రోజుల పాటు ఇస్లామాబాద్‌ను ముట్టడించింది. ఆసక్తికరంగా ఈ సంస్థ ఇబ్బంది పెట్టినప్పుడ్లా పాక్ సైన్యం మధ్యవర్తిగా వ్యవహరిస్తూ.. వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ అనేది ఉర్దూ పదం. తెహ్రీక్ అంటే ఉద్యమం, లబ్బాయిక్ అంటే “నేను ఉన్నాను” అనే అర్థం వస్తుంది. 2017 ఈ సంస్థ ఆధ్వర్యంలో నిరసనలు జరిగిన సమయంలో.. ఒక సీనియర్ సైనిక అధికారి TLP నిరసనకారులకు డబ్బు పంపిణీ చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఆ సమయంలో, అప్పటి న్యాయ మంత్రి జాహిద్ హమీద్ రాజీనామా చేయవలసి వచ్చింది.
ఇమ్రాన్ ఖాన్‌కు కూడా TLPపై ప్రేమ..
2021లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం TLPపై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో TLP చీఫ్ సాద్ రిజ్వీని ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జైలులో పెట్టారు. ఆ సమయంలో వేలాది మంది TLP మద్దతుదారులు లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు ‘లాంగ్ మార్చ్’ నిర్వహించారు. ఈక్రమంలో తలెత్తిన హింసలో 10 మంది పోలీసులతో సహా 20 మందికి పైగా మరణించారు. పాక్ సైన్యం మధ్యవర్తిత్వంతో.. అప్పటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం TLP తో రహస్య ఒప్పందం కుదుర్చుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో సాద్ రిజ్వీ, సుమారుగా 2 వేల మందికి పైగా TLP కార్యకర్తలను జైలు నుంచి విడుదల చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆన్ గ్లోబల్ రిలేషన్స్ నివేదిక ప్రకారం.. 2018 ఎన్నికలలో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) ను బలహీనపరిచేందుకు, ఇమ్రాన్ ఖాన్‌కు మార్గం సుగమం చేయడానికి TLP ని ఉపయోగించారు. అంటే ISI ఆదేశానుసారం TLP పనిచేసిందని నివేదికలు స్పష్టం చేశాయి.
TLP వ్యూహం చాలా తెలివైనది. ఇది “ఖాతమ్-ఎ-నుబువ్వత్” వంటి భావోద్వేగ అంశాలను ఉపయోగించుకుంటుంది. మతపరమైన భావాలను ఆయుధంగా ఉపయోగించే ఈ ఆచారం పాకిస్థాన్‌లో కొత్త కాదు. దీనిని భారతదేశానికి వ్యతిరేకంగా కూడా ఉపయోగించారు. ఈ సమయంలో TLP తన శక్తిని తెలుసుకుంది. దానిని ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకుంది. టీఎల్‌పీ తీరుపై పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మానవ హక్కుల కార్యకర్త అమ్జద్ అయూబ్ మీర్జా మాట్లాడుతూ.. “ఈ రోజు మనం చూస్తున్న గందరగోళం దశాబ్దాలుగా మతాన్ని ఆయుధంగా మార్చడం వల్ల వచ్చిన అనివార్య ఫలితం” అని అన్నారు.. “పాకిస్థాన్ ఇప్పుడు దాని స్వంత వైరుధ్యాల బరువుతో కూలిపోతోంది” అని చెప్పారు. పలువురు విశ్లేషకులు పాక్ ప్రస్తుత పరిస్థితిని ఫ్రాంకెన్‌స్టైయిన్ కథను పోలి ఉంటుందని చెబుతున్నారు. కథలో ఆయన సృష్టించిన రాక్షసుడు చివరికి ఆయననే నాశనం చేశాడు. పాకిస్థాన్ సైన్యం పౌర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి TLPని సృష్టించింది, కానీ ఇప్పుడు ఈ సంస్థ పాకిస్థాన్ మొత్తాన్ని అస్థిరపరుస్తోందని చెబుతున్నారు.
READ ALSO: Trump China Tariff: క్రిప్టో మార్కెట్‌ను కుదిపేసిన ట్రంప్ నిర్ణయం.. $2 ట్రిలియన్లు ఆవిరి
