Site icon NTV Telugu

T20 World Cup 2026: పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య “అన్నదమ్ముల ప్రేమ”.. ఇది రాజకీయ వ్యూహమేనా?

Pakistan Bangladesh

Pakistan Bangladesh

T20 World Cup 2026: పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్‌పై అన్నదమ్ముల ప్రేమ పుట్టుకొచ్చిందా? ఇప్పుడు పాకిస్థాన్ మీడియాల్లో అదే చర్చ జరుగుతోంది. టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ ఆడకపోతే, తామూ టోర్నీని బహిష్కరిస్తామని పాకిస్థాన్ అంటోందనే కథనాలు వచ్చాయి. అయితే ఇది నిజంగా క్రీడల పట్ల ప్రేమా, లేక రాజకీయ వ్యూహమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి భారత్‌లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ జట్టు తమ అన్ని లీగ్ మ్యాచ్‌లను భారత్‌లోనే ఆడాల్సి ఉంది. ఇందులో మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో, ఒక మ్యాచ్ ముంబైలో ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని తెగేసి చెబుతోంది. ఇందుకు భారత్–బంగ్లాదేశ్ మధ్య ఇటీవల పెరిగిన రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతపై ఆందోళనలే కారణమని చెబుతున్నారు.

READ MORE: How Bombay Became Mumbai: ముంబైకి బాంబే అనే పేరు పెట్టింది ఎవరో తెలుసా?

తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరగాలని బంగ్లాదేశ్ కోరుకుంటున్నది. శ్రీలంక ఈ వరల్డ్ కప్‌ టోర్నీకి సహ ఆతిథ్య దేశం కావడంతో ఆ దేశంలో ఆడితే ఎలాంటి సమస్య ఉండదని బీసీబీ భావిస్తోంది. కానీ ఐసీసీ ఈ అభ్యర్థనను స్పష్టంగా తిరస్కరించింది. షెడ్యూల్ మార్చడం సరైన సంప్రదాయం కాదని, అలా చేస్తే భవిష్యత్ టోర్నీల న్యాయసమ్మతతపై ప్రశ్నలు వస్తాయని ఐసీసీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ మీడియా మాత్రం బంగ్లాదేశ్‌కు మద్దతుగా వార్తలు రాస్తోంది. ఐసీసీ బంగ్లాదేశ్ మాట వినకపోతే పాకిస్థాన్ కూడా టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరించవచ్చని కథనాలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. కానీ పాకిస్థాన్ ఇలా బంగ్లాదేశ్ తరఫున గొంతు విప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న చర్చ మొదలైంది.

READ MORE: Jammu Kashmir: తీవ్ర విషాదం.. లోయలో పడిన ఆర్మీ వాహనం..10 మంది జవాన్లు మృతి

ఇటీవల బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడుల విషయం పెద్ద దుమారం రేపింది. దాని ప్రభావం క్రికెట్‌పైనా పడింది. ఐపీఎల్ 2026 నుంచి ముస్తాఫిజూర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రిలీజ్ చేయడం, దానికి ప్రతిగా బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించడం ఇవన్నీ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. ఆ తర్వాతే బంగ్లాదేశ్ తమ వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి మార్చాలని గట్టిగా కోరడం మొదలుపెట్టింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ముందు రెండు దారులే మిగిలాయి. ఒకటి.. తమ డిమాండ్‌ను ఉపసంహరించుకుని భారత్‌లోనే ఆడటం. లేకపోతే టోర్నీ నుంచి తప్పుకోవడం. అలా అయితే వారి స్థానంలో మరో జట్టును చేర్చే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ విషయంపై ఆటగాళ్లతో చర్చించనుందని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు వరల్డ్ కప్ ఆడాలనే అభిప్రాయంలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్ Cలో ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో, 9న ఇటలీతో, 14న ఇంగ్లాండ్‌తో కోల్‌కతాలో మ్యాచ్‌లు ఉన్నాయి. ఫిబ్రవరి 17న ముంబై వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు జరుగుతాయా? లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

Exit mobile version