Site icon NTV Telugu

India – Afghanistan: పాకిస్థాన్ – ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలు.. కాబూల్‌కు భారత్ సహాయం..

India Afghanistan

India Afghanistan

India – Afghanistan: రెండు ముస్లిం దేశాలు పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఇటీవల కాలంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో కాబూల్‌కు భారత్ మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆఫ్ఘన్ భూభాగంలోకి పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు ఒక మహిళతో మరణించారు. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత, భారతదేశం శుక్రవారం మందులు, టీకాలు, మానవతా సహాయాన్ని ఆఫ్ఘనిస్థాన్‌కు పంపింది.

READ ALSO: Lady Gang: విజయవాడలో రెచ్చిపోయిన లేడీ గ్యాంగ్

ఆఫ్ఘనిస్థాన్ తక్షణ ఆరోగ్య అవసరాలను తీర్చడానికి ఈ సహాయం అందించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఏప్రిల్, సెప్టెంబర్‌ల తర్వాత, ఈ ఏడాది భారతదేశం ఆఫ్ఘనిస్థాన్‌కు అందించిన మూడవ అతిపెద్ద వైద్య సహాయం ఇది. ఇదే సమయంలో భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య వాణిజ్య సంబంధాలు కూడా బలపడుతున్నాయి. భారతీయ కంపెనీ జైడస్ లైఫ్‌సైన్సెస్ – ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రోఫీస్ ఇంటర్నేషనల్ గ్రూప్ మధ్య 100 మిలియన్ల డాలర్ల భారీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై దుబాయ్‌లోని ఆఫ్ఘన్ కాన్సులేట్‌లో ఇరు పక్షాలు సంతకం చేశాయి. ఒప్పందంలో భాగంగా మొదట భారతదేశం నుంచి ఆఫ్ఘన్‌కు మందులను ఎగుమతి చేస్తుంది, తరువాత కాబూల్‌లో ఔషధాల తయారీని ప్రారంభించడానికి సాంకేతికతను బదిలీ చేస్తుంది. ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన ఆఫ్ఘన్ పరిశ్రమ & వాణిజ్య మంత్రి నూరుద్దీన్ అజీజీ, ఈ అవగాహన ఒప్పందాన్ని ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్‌లో పనిచేస్తున్న పరిశ్రమలకు “పూర్తి భద్రతా హామీలు” అందిస్తామని హామీ ఇచ్చారు.

పాక్ – ఆఫ్ఘన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..
ఇటీవల కాలంలో ఆఫ్ఘన్-పాకిస్థాన్ సరిహద్దులో పరిస్థితి మరింత దిగజారుతూనే ఉంది. నవంబర్ 24, 25 రాత్రి, పాకిస్థాన్ జెట్‌లు ఆఫ్ఘన్ ప్రావిన్సులైన ఖోస్ట్, కునార్, పాక్టికాపై బాంబు దాడి చేశాయి. తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ కథనం ప్రకారం.. ఖోస్ట్‌లోని ఒక ఇంట్లో బాంబు దాడి జరిగింది, ఈ ప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలు, ఒక మహిళ మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో కునార్, పాక్టికాలో నలుగురు పౌరులు గాయపడ్డారు. దీనిని ఆయన అనాగరిక దాడిగా అభివర్ణించాడు, ఇలాంటి దాడులు కొనసాగితే, ఆఫ్ఘనిస్థాన్ కూడా అదే విధంగా స్పందిస్తుందని హెచ్చరించారు. అయితే బాంబు దాడిపై పాకిస్థాన్ సైన్యం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అక్టోబర్ 19న టర్కీ, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరినప్పటికీ, పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Ragging: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. గతేడాది బాధితుడే.. నేడు నిందితుడు..!

Exit mobile version