పాకిస్తాన్ వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో ఆత్మాహుతి బాంబు దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో ఐదుగురు మరణించగా, పది మంది గాయపడ్డారు. ఖురేషి మోర్ సమీపంలోని శాంతి కమిటీ చీఫ్ నూర్ ఆలం మెహసూద్ నివాసంలో జరిగిన వివాహ వేడుకలో జరిగిన ఆత్మాహుతి బాంబు పేలుడుని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా పోలీసు అధికారి సజ్జాద్ అహ్మద్ సాహిబ్జాదా ధృవీకరించారు. దాడి జరిగిన సమయంలో పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు నృత్యం చేస్తున్నట్లు సమాచారం. పేలుడు కారణంగా గది పైకప్పు కూలిపోయింది, దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
Also Read:Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో లోకేష్ బర్త్‌డే వేడుకలు.. అఖిలప్రియ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా!
ఖైబర్ పఖ్తుంఖ్వా రెస్క్యూ 1122 ప్రతినిధి బిలాల్ అహ్మద్ ఫైజీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఐదు మృతదేహాలను, 10 మంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఏడు అంబులెన్స్‌లు, ఒక అగ్నిమాపక వాహనం సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. అధికారులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, శాంతి కమిటీ నాయకుడు వహిదుల్లా మెహసూద్, అలియాస్ జిగ్రి మెహసూద్ మరణించిన వారిలో ఉన్నట్లు సమాచారం.
