Site icon NTV Telugu

P4 Policy: మాకేం లక్షల్లో జీతాల్లేవ్.. 164 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు!

Ap P4

Ap P4

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో అలజడి రేగుతోందా? ఇదెక్కడి గొడవరా… బాబూ… అంటూ తలలు బాదుకుంటున్నారా? ప్రభుత్వ ఆశయం మంచిదైనా… అమలు తీరు సరిగా లేక మమ్మల్ని బలి పుశువుల్ని చేస్తోందని ఫీలవుతున్నారా? ఏం… మాకేమన్నా లక్షలకు లక్షల జీతాలు వస్తున్నాయా? మేమేమన్నా కోట్లకు తీరిపోయామా అన్న మాటలు ఉద్యోగుల నోటి నుంచి ఎందుకు వస్తున్నాయి? ఏ విషయంలో ఆందోళ మొదలైంది?

పీ..ఫోర్‌ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. సమాజంలో ఉన్న ధనికులు పేదల్ని ఆదుకోవడమే ఈ ప్రోగ్రామ్‌ ముఖ్య ఉద్దేశ్యం. ధనిక వర్గాలను మార్గదర్శులుగా, పేదలను బంగారు కుటుంబాలుగా … ప్రకటించి ముందుకు వెళ్తోంది ప్రభుత్వం. వచ్చే ఆగస్ట్‌ 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారికి మేలు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఆ దిశగా కసరత్తు కూడా మొదలైంది. ఉద్దేశ్యం మంచిది, అది అత్యున్నతమైన ఆశయం… పేదల్ని పైకి తీసుకువచ్చే బృహత్తర కార్యక్రమం. అంతవరకు ఆల్‌ ఈజ్‌ వెల్‌. ఆ ఉద్దేశ్యాన్ని ఎవ్వరూ పేరు పెట్టడానికి కూడా వీల్లేదు. కానీ…. అమలు దగ్గరికి వచ్చేసరికే అసలు సమస్యలు ఎదురవుతున్నాయట.సమాజంలోని పేద వర్గాలను ఆదుకోమని చెప్పడం వరకు బాగానే ఉందిగానీ… ఆదుకుంటారా? లేదా? అంటూ… మెడ మీద కత్తి పెట్టినట్టు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం టార్గెట్‌ అవ్వడంతో మొదటికే మోసం వస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది.

ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా కొన్ని కుటుంబాల్ని కచ్చితంగా దత్తత తీసుకోవాల్సిందేనని చెప్పడంపై ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందట. వాళ్ళలో ఆందోళన పెరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. పేద కుటుంబాలను దత్తత తీసుకోవడం అన్నది స్వచ్చందంగా జరగాలిగానీ… ఇలా టార్గెట్స్‌ పెట్టి నిర్బంధం చేస్తే ఎలా? మా పరిస్థితుల్ని, మా కుటుంబ అవసరాల్ని కూడా చూసుకోవాలి కదా.. అంటూ కొందరు లోలోపల మధన పడుతున్నారట. ఇప్పుడున్న నిబంధన ప్రకారం… ఒక వ్యక్తి ఓ బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుంటే… ముందు వాళ్ళ అవసరాలేంటో తెలుసుకోవాలి. ఆ అవసరాల్ని తీర్చే క్రమంలో…. పరిస్థితిని బట్టి ఆర్థిక సాయం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ రెండిటిని వ్యతిరేకిస్తున్నాయట ఉపాధ్యాయ సంఘాలు. ఇప్పటికే… రకరకాల యాప్‌లు, ప్రభుత్వ కార్యక్రమాలతో ఉపాధ్యాయులు సతమతం అవుతున్నారని, అవన్నీ పోను..మళ్ళీ కొత్తగా ఇంకో కుటుంబం సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చడమంటే… ఇక మేం మా ఫ్యామిలీస్‌తో గడిపే టైం ఉండొద్దా అన్నది వాళ్ళ ప్రశ్న. స్కూలుకు వెళ్లిన దగ్గర్నుంచి. మధ్యాహ్న భోజనం, పిల్లలకు బూట్లు, పుస్తకాల పంపిణీ, హాజరు పట్టీ… ఇలా రక రకాల యాప్స్‌లో సమాచారం అప్‌లోడ్‌ చేసేసరికే… సగం రోజు గడిచి పోతోందని, అవన్నీ చాలవన్నట్టు కొత్తగా p4 అంటూ టార్గెట్ పెడితే ఎలాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట టీచర్స్‌. మాకు బోధనా స్వేచ్ఛ కల్పించండి..ఇతర పనులు చెప్పకండి అంటూ ఉద్యమం తప్పదేమోనని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొందరు అంటున్నారంటే… గవర్నమెంట్‌ టీచర్స్‌లో ఫ్రస్ట్రేషన్‌ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.

Also Read: Pawan Kalyan: కూటమి ప్రభుత్వానికి పవన్‌ ఝలక్‌లు ఇస్తున్నారా?.. డూడూ బసవన్నను కాదని చెప్పదల్చుకున్నారా?

పైగా… మిగతావన్నీ ఫిజికల్‌, మెంటల్‌ వత్తిడి పెంచే పనులైతే… p4 ఆర్థిక అంశాలతో కూడా ముడిపడి ఉండటం ఇంకా కంగారు పెడుతోందట. దత్తత తీసుకున్న బంగారు కుటుంబం బాగోగులు చూసే క్రమంలో… అవసరాన్ని బట్టి వాళ్ళకు ఆర్థిక సాయం కూడా చేయాలి. ఇక్కడ పేరుకు అవసరాన్ని బట్టి అని అంటున్నా…. అంతిమంగా వ్యవహారం మొత్తం ఆర్థికం చుట్టూనే తిరుగుతుందని, ఆ స్థాయి అందరికీ ఉండాలి కదా అన్నది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రశ్న. ఇష్టం ఉండి, ఆర్థిక స్థోమత కలిగి, స్వచ్చందంగా ఎవరైనా ముందుకు వచ్చి బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటే ఓకేగానీ…. మీరు టార్గెట్స్‌తో బలవంత పెడితే ఎలా?… ఇదే పద్ధతి గనుక కొనసాగితే…. ఆందోళన తప్పదని అంటున్నారట గురువులు. ఉపాధ్యాయులతో పాటు సచివాలయ సిబ్బందికి కూడా…. P4 టార్గెట్స్‌ ఇస్తున్నట్టు సమాచారం. దీంతో వాళ్ళలో సైతం అసహనం అలాగే పెరుగుతోందని అంటున్నారు. సమాజంలో అత్యంత ధనికులు, పేరు మోసిన వ్యాపార వేత్తలు, బడా పారిశ్రామిక వేత్తలు చాలా మంది ఉన్నారని, వాళ్ళందర్నీ వదిలేసి… ఉద్యోగుల మీద ఈ వత్తిడి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. మాకేం.. లక్షలకు లక్షల జీతాలు లేవు, అయినా ఎవరి కష్టాలు వారికి ఉన్నాయి.

మా అవసరాలు, పిల్లల భవిష్యత్‌ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా..? అదంతా వదిలేసి దత్తత అంటూ మా మీద పడితే ఎలాగని ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆందోళగా ఉన్నట్టు సమాచారం. అసలు ప్రభుత్వం ఇంత చెబుతోంది కదా….మరి ప్రజాప్రతినిధుల నుంచి కనీస స్పందన ఎందుకు లేదు? వాళ్ళని వదిలేసి మమ్మల్ని ఎందుకు వత్తిడి చేస్తున్నారన్నది వాళ్ళ ప్రశ్న. ప్రస్తుతం కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళంతా ఎందుకు ముందుకు రావడం లేదు? ఏం… ఎమ్మెల్యేలకేమన్నా సంపాదన తక్కువగా ఉందా అంటూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారట ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ముందు ఆదర్శంగా ఉండాల్సింది ప్రజా ప్రతినిధులు కదా… అందుకే ముందు వాళ్ళని మొదలుపెట్టమన్నది… కేవలం జీతాల మీద బతికే వాళ్ళ మనోగతం. ఉద్యోగవర్గాల్లో వస్తున్న ఈ మార్పును గమనించిన కొన్ని రాజకీయపక్షాలు వాళ్ళకు మద్దతుగా ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నాయట. దీంతో మేటర్‌ ఎట్నుంచి ఎటో వెళ్ళిపోతోందని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు దిద్దుబాటు మొదలుపెట్టారట. ఉపాధ్యాయుల్లో ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు చేరాక స్పందించిన p4 స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఇందులో బలంవంతం ఏదీ లేదని తాజాగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అయినాసరే… ఇప్పటిదాకా జరిగిన పరిణామాల్ని చూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో మాత్రం టెన్షన్‌ పోవడం లేదట.

Exit mobile version