Site icon NTV Telugu

OTR: టీడీపీలోకి రఘురాజు..!! | శృంగవరపుకోట రాజకీయ డ్రామా..!!

Otr (1)

Otr (1)

OTR: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజక వర్గంలో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. భర్త వైసీపీలో, భార్య టీడీపీలో ఉండి ట్రెండింగ్‌ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఎన్నాళ్లిలా అనుకుంటూ… ఇద్దరూ ఒకే పార్టీ… అదీ అధికార పార్టీలో ఉందామనుకుంటే అక్కడ నో ఎంట్రీ బోర్డ్‌ చూపిస్తున్నారట. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దంపతుల డిఫరెంట్‌ స్టోరీ ఇది. స్థానిక సంస్థల కోటాలో ఫ్యాన్‌ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన రఘురాజు ఇప్పుడు పొలిటిక్‌ క్రాస్‌రోడ్స్‌లో నిలబడి పసుపు పార్టీలోకి గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్నా లేనట్టుగానే కొనసాగుతున్నారాయన. టీడీపీలో చేరేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌ అయింది. రఘురాజు వైసీపీ ఎమ్మెల్సీగా గెలిచినప్పటి నుంచే అప్పటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో విభేదాలు మొదలయ్యాయి.

ఆ విభేదాలే ఆయన రాజకీయ ప్రయాణాన్ని సంక్లిష్టం చేశాయన్న అభిప్రాయం స్థానికంగా ఉంది. ఆ క్రమంలోనే గత ఎన్నికల ముందే కీలక నిర్ణయం తీసుకున్నారాయన. తన భార్య సుబ్బలక్ష్మిని టీడీపీలోకి పంపారు. అప్పటి నుంచి ఆమె తెలుగుదేశం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ యాక్టివ్ లీడర్‌ అన్న పేరు తెచ్చుకున్నారు. రఘురాజు మాత్రం వైసీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి కారణంగా మౌన రాజకీయాన్ని కొనసాగిస్తున్నారన్నది లోకల్‌ వాయిస్‌. అయితే…ఇటీవల ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ…వేటేయాలని మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు వెళ్లింది. అది సీరియస్‌ అవడంతో…కోర్ట్‌కు వెళ్ళిమరీ… తాత్కాలికంగా పదవి నిలబెట్టుకున్నారాయన. కానీ ఎప్పటికైనా ప్రమాదం తప్పదన్న భావనలోనే ఉన్నారట.

Read Also: Revanth Reddy: కేసీఆర్‌ పెట్టిన సంతకం ఏపీకి అడ్వాంటేజ్‌.. కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం రావాలి!

అందుకే సపోర్ట్ కోసం ఇప్పుడు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లిన రఘురాజు లోకేష్‌ స్థాయిలో కూడా చర్చించారన్న ప్రచారం ఉంది. కానీ అక్కడే అసలైన ట్విస్ట్‌కు బీజం పడిందట. లోకల్ లీడర్ల అభిప్రాయం లేకుండా పార్టీలోకి తీసుకోవడం కుదరదని టీడీపీ అధిష్ఠానం స్పష్టం చేసినట్టు తెలిసింది. దాంతో ఆ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మరోనేత గొంప కృష్ణ దృష్టికి తీసుకెళ్ళిన అధిష్టానం…. ఏదో ఒక రోజు కూర్చొని నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు సమాచారం. కానీ వాళ్ళిద్దరికి మాత్రం… రఘురాజును పార్టీలోకి తీసుకుంటే కొత్త తల నొప్పులు వస్తాయేమోనన్న భయం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ పెద్దలకు కూడా ఇదే విషయాన్ని చెప్పారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా శృంగవరపుకోట ఎంపీపీ పదవి కేంద్రంగా రఘురాజు, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మధ్య భవిష్యత్తులో రచ్చ జరిగే అవకాశముందట. అలాగే ఈ వ్యవహారం వెనుక జిందాల్ భూ వివాదాల ఇష్యూ కూడా కీలకంగా ఉందంటున్నారు. రఘురాజును పార్టీలోకి తీసుకొని ఆ గొడవలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారని టీడీపీ పెద్దలు స్కెచ్ వేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. అదే సమయంలో రఘురాజు చేరిక పార్టీలో కొత్త సమస్యలకు దారి తీస్తుందన్న అభిప్రాయమూ బలంగా వినిపిస్తోంది. మొత్తానికి భార్య టీడీపీలో, భర్త వైసీపీలో ఉన్నారు. రెండు పార్టీల మధ్య చిక్కుకున్న రఘురాజు రాజకీయ భవితవ్యం ఇప్పుడు లోకల్ లీడర్ల నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. అడ్డంకులు తొలగితే టీడీపీ కండువా మెడలో పడటం ఖాయం. లేకపోతే ఒకే ఇంట్లో ఉంటూ రెండు పార్టీల కండువాలు వేసుకోవాల్సిందేనన్నది రాజకీయ వర్గాల మాట.

Exit mobile version