Site icon NTV Telugu

Mallikarjun Kharge: ట్రంప్ వాదనలను మోడీ ఎందుకు ఖండించడం లేదు..? ఖర్గే ప్రశ్న..

Mallikarjun Kharge

Mallikarjun Kharge

ఆపరేషన్ సిందూర్ పై నేడు లోక్ సభలో చర్చ కొనసాగుతోంది. హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. ఆపరేషన్ మహాదేవ్ లో పహల్గామ్ నిందితులను సైన్యం హతమార్చిందని అమిత్ షా స్పష్టం చేశారు. హతమైన ఉగ్రవాదులకు సంబంధించి ఆధారాలకు సభకు తెలిపారు. కాగా ఈ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్‌లో కొన్ని ప్రశ్నలు సంధించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పహల్గామ్ సంఘటనను నిఘా వైఫల్యం అని స్పష్టం చేశారన్నారు. దానికి తాను బాధ్యత వహిస్తామని మనోజ్ సిన్హా అన్నట్టు తెలిపారు. వాస్తవానికి నిఘా హోంమంత్రి ఆధీనంలోకి వస్తుంది.. దీనికి హోంమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని తెలిపారు.. హోంమంత్రిని కాపాడటానికి లెఫ్టినెంట్ గవర్నర్ తాను బాధ్యత వహిస్తానని అన్నారా..? లేక హోంమంత్రి ఆయనతో ఇలా చెప్పించారా? అని ప్రశ్నించారు.

READ MORE: Ramchander Rao: కుర్చీ కాపాడుకునేందుకు సీఎం రేవంత్ కష్టపడుతున్నారు!

“బీజేపీ ప్రభుత్వ హయాంలో పహల్గామ్‌లో ఐదుసార్లు దాడులు జరిగాయి. ఇంకా ఈ అంశంపై బీజేపీ గుణపాఠం నేర్చుకోలేదు. నిన్న ముగ్గురు ఉగ్రవాదులను చంపినట్లు ఇప్పుడే తెలిపారు. మిగిలిన వాళ్లను ఎప్పుడు కనుగొంటారో కూడా చెప్పండి. హోంమంత్రి కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ అంశంపై మేము సీడబ్ల్యూసీ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించాం. సైన్యాన్ని గౌరవిస్తూ జై హింద్ యాత్ర చేపట్టాం. రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని నిర్ణయించుకుని.. ప్రభుత్వానికి సంఘీభావంగా నిలడ్డాం. కానీ మోడీ మాత్రం ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు. ఇంకా చేస్తునే ఉన్నారు. పహల్గామ్‌కు ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ ప్రారంభించారు. సైన్యం పాక్ పై బలంగా దాడి చేసింది. పాకిస్థాన్ లొంగిపోయింది. అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించారు. ఈ ప్రకటన ఎవరు, ఎక్కడి నుంచి చేశారు అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు మన ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి సమాధానం ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్ నుంచి కాల్పుల విరమణ ప్రకటించారు. తాను యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దానిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అధ్యక్షుడు ట్రంప్ తాను యుద్ధం ఆపానని 29 సార్లు తెలిపారు. ట్రంప్ భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు. ఐదు జెట్ విమానాలను కూల్చివేసినట్లు మీ స్నేహితుడు ట్రంప్ అన్నారు. ఒక్క జెట్ కూడా నేల మట్టం కాలేదని మోడీ చెబితే దేశ ప్రజలు వినాలనుకుంటున్నారు.” అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీలు, మంత్రులు సాయుధ దళాలను అవమానిస్తున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.

Exit mobile version