డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగడం, గంటల తరబడి వేచి చూడటం ఇప్పటివరకు ఎంతో మందికి ఇబ్బందికరంగా మారేది. స్లాట్లు బుక్ చేసుకోవడం, ఆఫీసులకి పరుగెత్తడం లాంటి సమస్యలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే ఈ కష్టాలన్నింటికీ కాలం చెల్లబోతోంది. ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘సారథి’ పోర్టల్‌లో అత్యాధునిక ఏఐ విధానాన్ని తీసుకొచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, మరో వారంలో రవాణా శాఖ దీన్ని అధికారికంగా అమల్లోకి తెస్తోంది. ఇకపై ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లే అవసరమే లేకుండా, ఎవరి సహాయం లేకుండా నేరుగా ఇంట్లోనే కూర్చొని లెర్నర్స్ లైసెన్స్ (LLR) పొందే అద్భుతమైన అవకాశం సామాన్యులకు అందుబాటులోకి రానుంది.
ఇంటి వద్దే కంప్యూటర్ లేదా లాప్టాప్ సహాయంతో ఈ పరీక్ష రాసేందుకు వెబ్‌క్యామ్ ద్వారా పక్కా ఏఐ నిఘా ఏర్పాటు చేశారు. పరీక్షకు లాగిన్ కాగానే అభ్యర్థి ముఖాన్ని సిస్టమ్ స్కాన్ చేస్తుంది. దరఖాస్తు చేసుకున్న ఫొటోతో ఇది వంద శాతం సరిపోలితేనే ముందుకు వెళ్తుంది. కేవలం ఫొటో పెట్టి మోసగించే ప్రయత్నాలను అడ్డుకోవడానికి, అభ్యర్థి సజీవంగా ఉన్నారో లేదో పరీక్షించడానికి ఐదుసార్లు నవ్వడం, ఐదుసార్లు కంటిరెప్పలు ఆడించడం వంటి నిబంధనలు పెట్టారు. ఇవి పూర్తయితేనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
పరీక్ష రాస్తున్నంత సేపు అత్యంత కఠినమైన నిబంధనలు అమలవుతాయి. కెమెరా ఫ్రేమ్‌లోకి వేరే వ్యక్తి వచ్చినా, అభ్యర్థి పక్కకు తప్పుకున్నా సిస్టమ్ వెంటనే పరీక్షను రద్దు చేస్తుంది. అంతేకాకుండా, గూగుల్ సెర్చ్ చేయడం లేదా ఇతర విండోస్ ఓపెన్ చేయడం కుదరదు. ఒకవేళ సాంకేతిక లోపాలతో ఫేస్ రికగ్నిషన్ ఫెయిల్ అయితే, ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా నేరుగా ఆర్టీఓ ఆఫీసులో పరీక్ష రాసేందుకు బ్యాకప్ వెసులుబాటు కూడా కల్పించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఉత్తీర్ణత వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. పాస్ అయిన వెంటనే డిజిటల్ సంతకం, క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎల్ఎల్ఆర్ పీడీఎఫ్ నేరుగా మొబైల్‌కే డౌన్లోడ్ అవుతుంది.

