స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!

  • వన్‌ప్లస్ ఏస్ 7 సిరీస్ అక్టోబర్ 29న చైనాలో లాంచ్
  • ఏస్ 7 ప్రోలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్
  • గేమింగ్ పనితీరు కోసం విండ్ చేజర్ గేమ్ కెర్నల్ టెక్నాలజీ..
Oneplus Ace 7 Pro

Oneplus Ace 7 Pro

OnePlus Ace 7 Pro Launch: వన్ ప్లస్ (OnePlus) నుండి Ace 7 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ఖరారు చేసింది. గతేడాది వచ్చిన Ace 6 సిరీస్‌కు కొనసాగింపుగా రానున్న ఈ సరికొత్త లైనప్ అక్టోబర్ 29న చైనాలో లాంచ్ కానుంది. ఈ లైనప్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘వన్ ప్లస్ ఏస్ 7 ప్రో’ (OnePlus Ace 7 Pro) శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5) ప్రాసెసర్‌తో రానుంది. పనితీరును ఉన్నత స్థాయికి చేర్చేందుకు కంపెనీ తన సొంత “విండ్ చేజర్ గేమ్ కెర్నల్” (Wind Chaser Game Kernel)ను ఫ్యాక్టరీ స్థాయిలోనే ప్రాసెసర్ చిప్‌సెట్ నిర్మాణంలో పొందుపరిచింది.

హెవీ గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయాల్లో ఫోన్ వేడెక్కకుండా స్థిరమైన ఫ్రేమ్ రేట్లను అందించడం కోసం ఈ సిరీస్‌లో అధునాతన కూలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ ఆర్కిటెక్చర్‌లో డ్యూయల్-ఎయిర్‌ఫ్లో ఛానల్ డిజైన్ అమర్చడం వల్ల అంతర్గత వేడి గాలి సులభంగా బయటకు వెళ్లిపోయి, టచ్ ఉపరితలాల వైపు చల్లటి గాలి చేరుతుంది. డెస్క్‌టాప్ పీసీ గ్రాఫిక్స్ కార్డుల ఆధారంగా రూపొందించిన ప్రత్యేక టవర్ ఫిన్ హీట్ సింక్ నిర్మాణం వేడిని అత్యంత వేగంగా బయటకు పంపనుంది. వీటికి తోడు ఇంటెలిజెంట్ అల్గారిథమ్ ఆధారిత థర్మల్ సెన్సార్లు నిరంతరం ఉష్ణోగ్రతను పర్యవేక్షిస్తూ ఫోన్ వేడెక్కకుండా సమర్థవంతంగా నియంత్రిస్తాయి.

ఈ సిరీస్ మొబైల్స్ దృఢమైన రూపకల్పనతో పాటు సరికొత్త లుక్‌తో వస్తోంది. స్టాండర్డ్ వన్ ప్లస్ ఏస్ 7 ‘రేడియంట్ వైట్’ రంగులో, ఏస్ 7 ప్రో ‘మిడ్‌నైట్ బ్లాక్’ రంగులో అందుబాటులో ఉంటాయి. వేలిముద్రలు, గీతలు పడకుండా ఉండేలా ఫోన్ వెనుక భాగాన్ని చక్కటి ఫైబర్‌గ్లాస్ మ్యాట్ ఫినిషింగ్‌తో తయారు చేశారు. ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్ ఫోన్ అంచులను కప్పి ఉంచుతూ ప్రీమియం హ్యాండ్-ఫీల్‌ను అందిస్తుంది. వెనుక కెమెరా అమరిక కోసం మెటల్ క్యూబ్ రూపంలో “స్టార్మ్ ఐలాండ్” డిజైన్‌ను ఎంచుకున్నారు. ప్రత్యేకంగా ఎయిర్ వెంట్లు బయటకు కనిపించకుండా.. ఈ కెమెరా మాడ్యూల్‌లోనే ఓవల్ ఆకారపు ఎయిర్ ఇన్‌టేక్‌ను అనుసంధానించి యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను నిక్షిప్తం చేశారు. ప్రధాన కెమెరా కింద అమర్చిన “డైనమిక్ క్రెసెంట్ లైటింగ్” సాధారణ సమయాల్లో కనిపించకుండా దాగి ఉండి, గేమింగ్ ఆడుతున్నప్పుడు లేదా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు విభిన్న కాంతి ప్రభావాలతో యూజర్లకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

ముందు భాగంలో అత్యంత సన్నని అంచులు కలిగిన సమతుల్య ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్ మధ్యభాగంలో చిన్న పంచ్-హోల్ కటౌట్ ఇవ్వడంతో డిస్‌ప్లే వ్యూయింగ్ ఏరియా మరింత పెరిగింది. చైనాలోని ప్రధాన ఈ-కామర్స్ వేదికల్లో వన్ ప్లస్ ఏస్ 7, ఏస్ 7 ప్రో మోడళ్ల ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలు, గ్లోబల్ లభ్యతను వచ్చే వారం జరిగే లాంచ్ ఈవెంట్‌లో సంస్థ అధికారికంగా వెల్లడించనుంది.