NTV Telugu Site icon

Dharmapuri Issue: తెరుచుకున్న స్ట్రాంగ్‌రూమ్‌.. 26న హైకోర్టుకు నివేదిక

Dharmapuri Strong Room

Dharmapuri Strong Room

Dharmapuri Issue: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం ఈవీఎంల స్ట్రాంగ్‌రూమ్‌ను అధికారులు ఎట్టకేలకు తెరిచారు. కలెక్టర్ యాస్మిన్‌భాషా ఆధ్వర్యంలో జగిత్యాల వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలో ఉంచిన స్ట్రాంగ్‌రూంను కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో తాళాలు పగులగొట్టి గదిని తెరిచారు. అందులోని పత్రాలు, సీసీ ఫుటేజీని పరిశీలించారు. వాటిని స్వాధీనం చేసుకుని ఈ నెల 26న హైకోర్టుకు అధికారులు సమర్పించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. 17సీ, 17ఏ పత్రాలను పరిశీలించారు. 17 గంటల పాటు డాక్యుమెంట్లు పరిశీలించి స్కాన్ చేసి అధికారులు, సిబ్బంది ప్రక్రియను పూర్తి చేశారు.

17A,17C డాక్యుమెంట్లతో పాటుగా పూర్తి స్థాయి నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు ఎన్నికల అధికారులు అందించనున్నారు. ఈ నెల 26 వరకు నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఇచ్చే సీల్డ్ కవర్‌లో ఎలాంటి రిపోర్ట్ ఉందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2018లో హైకోర్ట్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారించిన న్యాయస్థానం, అప్పటి ఈవీ ప్యాడ్​లు ఉన్న స్ట్రాంగ్​ రూంను తెరిచేందుకు ఆదేశించింది. డాక్యూమెంట్లు కోర్టుకు అందించే క్రమంలో జరిగిన పరిణామాలపై, వీడియో పుటేజీ మిస్‌ అవడంపై ఈనెల 26న జరిగే విచారణలో హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది కీలకంగా మారింది. రీ కౌంటింగ్ జరపాలి.. తాళాలు పోయిన ఘటనలో సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ అభ్యర్ధి, పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Read Also: BRS Meeting: నేడు మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ

17A,17B,17C ఫామ్స్ భద్ర పరిచిన బాక్స్‌లకు కేవలం నాలుగింటికే తాళాలు ఉన్నాయి.. వాటికి కూడా సీల్‌ లేదు, మిగతా బాక్స్‌లకు తాళాలు లేవని, వాటిని పగులగొట్టారని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. 2018 ఎన్నికల్లో కౌంటింగ్ చేసిన అధికారులు 17ఏ,17సి సామగ్రి పొందుపరచలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా తాళాలు లేకపోవడంతో జరగాల్సిన మాల్ ప్రాక్టీస్ జరిగిపోయిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించిన వీడియో, సీసీ ఫుటేజ్ లేదని, దొరకడం లేదని కలెక్టర్ చెప్పారని లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత నోటిఫైడ్ ఏరియా ఈవీఎంలు భద్రపరచలేదన్నారు. ఈవీఎంలు భధ్రపరచిన స్ట్రాంగ్‌ రూం ఉన్న వి.ఆర్.కే కాలేజీ ఎంట్రన్స్ నుంచి స్ట్రాంగ్ రూమ్ వరకు ఉండాల్సిన ఒక్క సీసీ టీవీ ఫుటేజీ కూడా లేదన్నారు. కౌంటింగ్ వీడియో పుటేజీ లేదు.. స్ట్రాంగ్ రూంకు భద్రత కల్పించడంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ పుటేజీ లేదన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు డబుల్ సీల్ వేయలేదని పేర్కొన్నారు. 209 పోలింగ్ బూత్‌కు సంబంధించి 17C ఫామ్స్‌కు సీల్ లేదని ఆయన తెలిపారు. అన్ని విషయాల్లో ల్యాప్స్ తప్పిదాలు ఉన్నాయనేది తేటతెల్లం అయింది కాబట్టి రీకౌంటింగ్ చేసేలా కోర్టు అన్ని చర్యలు చేపట్టాలని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. న్యాయం గెలుస్తుందని.. కోర్టుపై పూర్తి నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Show comments