Off The Record: జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి, 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తానేటి వనిత కొవ్వూరు వదిలేసి గోపాలపురంలో అడుగు పెట్టాక అస్సలు కలిసి రావడం లేదట. అదే సమయంలో ఆమె వ్యవహార శైలి కూడా…పార్టీ ఆవిర్భావం నుంచి పాతుకుపోయిన నేతలకు ఏమాత్రం పడటం లేదంటున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా… మొదట్నుంచి పార్టీలో ఉన్నవాళ్లని పక్కనబెట్టి…తర్వాత వచ్చిన, కోవర్టులుగా పనిచేసే వారికే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే నియోజకవర్గంలో వైసిపి ఖాళీ అవుతోందని వైసీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. పార్టీ నుంచి వెళ్ళిపోయే వారి సంఖ్య పెరుగుతున్నా… మాజీ మంత్రి తీరు మాత్రం మారడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ప్రజాభిప్రాయాన్ని పార్టీవైపు తిప్పుకునే విషయంలో మాజీ మంత్రి ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నారన్నది కేడర్ వాయిస్. కొవ్వూరు నుంచి గోపాలపురం నియోజకవర్గానికి షిఫ్ట్ అయిన తానేటి వనిత నియోజకవర్గ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదని చెప్పుకుంటున్నారు.
దీంతో ఇటీవల పార్టీని వదిలి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగిపోయి ఆమె ఫ్రస్ట్రేట్ అవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ అసహనంతోనే నోరు జారుతున్నారని కూడా మాట్లాడుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పొండి… చేసిన తప్పును జనం తెలుసుకుంటున్నారు. ఆటోమేటిగ్గా పార్టీ బలపడుంది. అందుకు ఎవరి సాయం అవసరం లేదంటూ ఇటీవల మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై సొంత నేతలే తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. నిత్యం జనంలో ఉండేందుకు పార్టీ పెద్దలు ఏదో ఒక కార్యక్రమానికి పిలుపునిస్తూ…క్యాడర్ చేజారకుండా చూసుకోమని చెబుతున్నా…. గోపాలపురంలో అందుకు భిన్నంగా జరుగుతోందని, వనిత నోటికొచ్చినట్టు మాట్లాడి అందర్నీ దూరం చేసుకుంటున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. అలాగే… పాత కార్యక్రమానికి ఫ్లెక్సీలు మార్చి రెండేసి ప్రోగ్రామ్స్ నిర్వహించినట్టుగా మేనేజ్ చేస్తున్నారని, దీనివల్ల ఎవరికి నష్టమో ఒక్కసారి ఆలోచించుకోవాలంటున్నారు. పార్టీ కోసం ఫస్ట్ నుంచి పని చేస్తున్న వారికి కనీస విలువ లేకపోవడమే ఇలాంటి వాటికి కారణం అంటున్నారు. ఇటీవల 40 మంది ఒకేసారి పార్టీకి రాజీనామా చేసి పక్కకి జరిగినా… ఆ విషయాన్ని మాజీ మంత్రి ఏ మాత్రం పట్టించుకోకపోగా ఒకరిద్దరు పోతే నష్టమేం లేదని మాట్లాడ్డం నియోజకవర్గ నేతలకు మింగుడు పడడం లేదట. పార్టీలో ప్రతి ఒక్కరూ ఇంపార్టెంట్. మన పనితీరు బాగుంటే మరింతమంది చేరుతారు తప్ప బయటకి ఎందుకు వెళ్తారంటూ ప్రశ్నిస్తున్నారు గోపాలపురం వైసీపీ లీడర్స్.
కొవ్వూరులో ఇలా చేసుకునే నియోజకవర్గం మారాల్సి వచ్చిందని, ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయితే క్యాడర్ పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పొలిటికల్ సీనియర్ అయిన ఈ మాజీ మంత్రి 40 మంది వెళ్ళిపోతే నష్టం లేదంటున్నారని, వాళ్ళకు లింక్ అయి ఉండే ఓట్ల సంగతిని మర్చిపోతే ఎలాగని సొంత నాయకులే గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీకి ప్రత్యర్ధుల కంటే సొంత పార్టీ నేతలే శత్రువులుగా మారుతున్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయట. ఇలాగే ఉంటే త్వరలోనే నియోజకవర్గంలో పార్టీ ఖాళీ అవుతుందన్న వాయిస్ సైతం పెరుగుతోంది. మాజీ మంత్రి తీరుపై పార్టీ పెద్దలకు చెప్పుకున్నా… ఉపయోగం లేకుండా పోతోందన్నది
కొందరు నాయకుల ఆవేదన అట. క్షేత్ర స్థాయిలో ఎంత దరిద్రంగా ఉన్నా…పైన మాత్రం మేడం బాగా మేనేజ్ చేయగలరు అంటూ సోంతోళ్ళే సెటైర్స్ వేస్తున్నారు. దీంతోపాటు గోపాలపురం నియోజకవర్గానికి మాజీ మంత్రితోపాటు కొత్తగా వచ్చిన వలస నేతలు భజన చేస్తూ జేజమ్మా… అని కీర్తిస్తూ ఫ్లెక్సీలతో పబ్బం గడుపుకుంటున్నారని, అందుకే నియోజకవర్గంలో గ్రూపులు ఎక్కువయ్యాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కొవ్వూరులో కొనసాగిన పరిస్థితే గోపాలపురంలోనూ రిపీట్ అవుతోందన్న అభిప్రాయం బలపడుతోందని, అది మాజీ మంత్రి పొలిటికల్ కేరీర్కే అంత మంచిది కాదని అంటున్నారు ఇక్కడి ద్వితీయ శ్రేణి నాయకులు.
