Site icon NTV Telugu

Off The Record: బీజేపీ ఎమ్మెల్యే సడెన్ గా రివర్స్ గేర్ వేశారా..?

Vishnukumar Raju Otr

Vishnukumar Raju Otr

Off The Record: పెనుమత్స విష్ణుకుమార్ రాజు… విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే. NDAతో సంబంధం లేకుండానే మొదటి నుంచి టీడీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కమలం నేతల్లో ఈయనదే మొదటి స్ధానం అని చెబుతుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల కంటే విష్ణుకుమార్ రాజు వాయిస్సే ఎక్కువ వినిపించేదని టాక్‌. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కోసం కొన్నిసార్లు భాష కట్టలు తెంచుకున్నా పెద్దగా ఫీల్ అయ్యేవారు కాదట ఈ సీనియర్ నేత. కూటమి బలంతో 2024లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన…కొంతకాలంగా టీడీపీ ముఖ్యనాయకత్వంతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గ అభివృద్ధి అంశాల మీద మినహా భాగస్వామ్య పక్షాలతో కలిసి హడావుడి చేస్తున్న సందర్భాలు బాగా తగ్గి పోయాయనే టాక్‌ నడుస్తోంది. రాజుగారి వైఖరిలో ఏదో తేడా కనిపిస్తుందే అనే చర్చ బీజేపీ, టీడీపీల్లో కొద్ది రోజులుగా ఉంది. దీని వెనుక కారణాలపై ద్వితీయశ్రేణి నాయకత్వం ఆరా తీస్తోందట.

ఇక.. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు షాకింగ్ కామెంట్స్‌తో తెరపైకి వచ్చారు విష్ణుకుమార్ రాజు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి శిరోభారంగా తయారైన రుషికొండ నిర్మాణాల గురించి లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేశారనే చర్చ నడుస్తోంది. సుమారు 450 కోట్ల రూపాయల వ్యయంతో రుషికొండలో ప్యాలెస్ నిర్మించింది వైసీపీ ప్రభుత్వం. ఈ భవనాల నిర్మాణం నుంచి వినియోగం వరకూ జరిగినంత రాజకీయ చర్చ మరో కట్టడం మీద జరగలేదంటే అతిశయోక్తి కాదంటారు కొంతమంది నేతలు. ప్రజాధనం వృథా చేసి చేపట్టిన రుషికొండ నిర్మాణాలను సద్వినియోగం చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం….మంత్రుల కమిటీని నియమించింది. వివిధ రూపాల్లో అభిప్రాయాలు సేకరించి…నివేదికను సైతం సిద్ధం చేసిందట. దీని ఆధారంగా రుషికొండ భవనాలను స్టార్ హోటల్‌గా మలిచేందుకు అనుకూలమని, అందుకు కొన్నిమార్పులు అవసరమనే సూచనలు నివేదికలో ఉన్నాయని తెలుస్తోంది. ఆ దిశగా కేటాయింపులకు సర్కార్ మొగ్గు చూపుతుందనే ప్రచారం సైతం జరుగుతోంది. అద్భుతమైన కట్టడంలో హోటల్ పెట్టేందుకు ఆతిథ్య రంగంలో గుర్తింపు పొందిన సంస్ధలు ముందుకు వచ్చాయనే టాక్‌ వినిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో రుషికొండ భవనాలపై రెండు మూడు రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందని సమాచారం. అంతా సానుకూలమే అనుకుంటున్న వేళ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎదురు తిరిగారు. రుషికొండ మీద మంత్రుల కమిటీ సిఫార్సులను ఏకిపడేశారు. స్ధానిక ఎమ్మెల్యేలు, ఎంపీ అభిప్రాయం లేకుండానే మీ నిర్ణయాలు తీసేసుకుంటారా?అని ప్రశ్నలు సంధించారు. ఈ కామెంట్లు పరోక్షంగా ప్రభుత్వ పెద్దలకే అనేది కొత్త చర్చ నడుస్తోంది. ఐటీ పెట్టుబడులు మాదిరిగా రుషికొండను ఆదాయ మార్గంగా చూడకుండా ఆధ్యాత్మిక కోణంలోనూ ఆలోచించాలనే విష్ణుకుమార్ రాజు వ్యక్తిగత అభిప్రాయం లోతైన భావనతో కూడిందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. హోటల్ ఇండస్ట్రీకి రుషికొండను కేటాయించే పక్షంలో పోటీదారుల రేసులోకి వచ్చే వాళ్లు ఎవరై ఉంటారనే సమాచారం విష్ణు దగ్గర ఉందా?అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఐతే…చెప్పాల్సిందంతా చెప్పేసిన విష్ణుకుమార్‌ రోజు ఆఖరుకు తన వ్యక్తిగత అభిప్రాయం అనేశారు.

విశాఖ, విజయవాడల్లో స్టార్ హోటల్స్ నడుపుతున్న ఓ ప్రముఖ గ్రూప్ రుషికొండ మీద ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్టు తెలిసింది. టీడీపీ అధినాయకత్వంతో వున్న సత్సంబంధాలు కారణంగానే ఈ అద్భుతమైన ప్రాజెక్టు దక్కించుకునే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతున్నాయా?అనే అభిప్రాయం ఎమ్మెల్యే మాటల్లో ధ్వనిస్తోందట. ఆ హోటల్ పేరు చెబుతూనే అక్కడ భోజనం, వసతి చాలా ఖరీదైనది అటువంటి చోటుకు సామాన్యులు వెళ్ళడం సాధ్యమేనా?అనే ప్రస్తావన తెస్తున్నారు బీజేపీ సీనియర్ నేత. ఏకపక్ష నిర్ణయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే అడ్డం తిరిగినట్టు సమాచారం. వ్యక్తిగత అభిప్రాయం పేరుతో విష్ణు రాజేసిన అగ్గి కూటమిలో కొత్త చర్చకు తెరతీసింది. టీడీపీ హైకమాండ్‌తో పటిష్టమైన వ్యక్తిగత సంబంధాలు కొరుకునే బీజేపీ నేత రుషికొండపై కుండబద్దలు కొట్టడం ఒకటి రెండు రోజుల్లో చోటుచేసుకున్న పరిణామం కాదనేది సుస్పష్టంగా తెలుస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పైగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రుషికొండకు గుండుకొట్టేసిందని, ప్రజాధనం వృధా అయ్యిందని ఒంటికాలితో లేచిన ఆయన ఇప్పుడు తన టోన్ డౌన్ చేసి మరీ ప్రభుత్వం మీద చురకలేయడం ఆసక్తికరమే. దీని వెనుక ఇతర కారణాలు వున్నాయనే ప్రచారం ఉంది.

అసెంబ్లీ సమావేశాల్లో విష్ణుకు మార్ రాజు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వందల కోట్లు బకాయిలు పడిన కారణంగా వడ్డీలు కట్టుకోలేక నానా అవస్ధలు పడు తున్నారని ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ అంశం సభా సాక్షిగా ప్రజల్లోకి వెళ్ళడంపై టీడీపీ నాయకత్వం ప్రతికూలంగా తీసుకున్నట్టు తెలిసింది. సమస్య తీవ్రమైందే అయినప్పటికీ రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం వుంటుందని…ఆ దిశగా సీనియర్లు సంయమనం పాటించకపోవడం సరైనది కాదని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయ పడినట్టు సమాచారం. ఆ తర్వాత కాలంలో అంతా సర్దుకున్నట్టే కనిపించింది. కానీ, సడన్‌గా విష్ణుకుమార్ రాజు వ్యక్తిగత అభిప్రాయం పేరుతో రుషికొండ మీద చేసిన బోల్డ్ కామెంట్స్ విశాఖ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. దీని పర్యావసానాలు ఎలా వుంటాయి..?నిజంగానే ప్రభుత్వం ఆలోచనలను పసిగట్టే ఈ వ్యాఖ్యలు చేశారా? అనేది పెద్ద చర్చకు దారి తీస్తోంది. విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యలతో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాల్సిందే.

Exit mobile version