NTV Telugu Site icon

Odisha Train Accident: 288కి చేరిన రైలు ప్రమాద మృతుల సంఖ్య

Odisha Train Accident

Odisha Train Accident

Odisha Train Accident: ఒడిశా ప్రభుత్వం మంగళవారం బాలాసోర్ రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను 288 అని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు. ఒడిశాలోని వివిధ జిల్లా ఆస్పత్రులు, మార్చురీల నుంచి అందిన నివేదికల తర్వాత బాలాసోర్‌ జిల్లా కలెక్టర్ ఈ సంఖ్యను నిర్ధారించినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే 205 మృత దేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించినట్లు చెప్పిన ఆయన.. రోడ్డు మార్గంలో మృతదేహాలు తరలించాలనుకునే వారికి అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మిగిలిన 83 మృతదేహాలను గుర్తింపు కోసం ఎయిమ్స్-భువనేశ్వర్ మరియు ఇతర ఆసుపత్రులలో ఉంచినట్లు ఆయన చెప్పారు. ఆ మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. క్షతగాత్రుల చికిత్స, మృతదేహాలను ఆయా ప్రాంతాలకు తరలించేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందన్నారు.

Read Also: Maharashtra: విషాదం.. గోడకూలి ముగ్గురు కార్మికులు మృతి

కాగా, ఒడిశాకు చెందిన 39 మంది మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.1.95 కోట్లు మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి డబ్బు అందించడం జరిగింది. ఇదిలా ఉండగా.. బాలాసోర్ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 531 బాధిత కుటుంబాలకు పరిహారం అందించినట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే సీపీఆర్వో ఆదిత్య కుమార్ తెలిపారు. మొత్తం రూ. 15 కోట్ల 6 లక్షల మేర పరిహారాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. పరిహారం అందని కుటుంబాలు కటక్‌, మిడ్నాపూర్‌, భువనేశ్వర్, బాలేశ్వర్‌లోని సహాయక కేంద్రాలను సంప్రందించాలని ఆదిత్య కుమార్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 288 మంది మృతి చెందగా.. 1,200 మందికి పైగా గాయపడ్డారు.