Site icon NTV Telugu

India Finds Estimated 20 Tonnes of Gold: భారత్‌లో బంగారు నిధి.. ఎన్ని టన్నులు అంటే?

07

07

India Finds Estimated 20 Tonnes of Gold: భారత్‌కు బంగారు నిధి దొరికింది. మీరు చదువుతున్నది నిజమే.. ఈ నిధి ఒడిశా రాష్ట్రంలో దాగి ఉంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) సర్వేలో ఈ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో దాదాపు 20 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు అంచనా వేసింది. విషయం బయటికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, మైనింగ్ శాఖ వెంటనే చర్యలు చేపట్టాయి. అసలు ఎక్కడెక్కడ బంగారు నిల్వలు ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ MORE: Bigg Boss : బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’లో 45 మంది పోటీ.. ప్రోమో రిలీజ్

ఈ జిల్లాల్లో బంగారు నిల్వలు..
దేవ్‌ఘర్, సుందర్‌గఢ్, నబరంగ్‌పూర్, కియోంఝర్, వేలు, కోరాపుట్ జిల్లాల్లో పసిడి నిల్వలు బయటపడ్డాయి. వీటితో పాటు మయూర్‌భంజ్, మల్కాన్‌గిరి, సంబల్‌పూర్, బౌధ్ జిల్లాల్లో కూడా గోల్డ్ కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ జిల్లాల్లో ఎంత బంగారు నిల్వలు ఉన్నాయనేది అధికారిక గణాంకాలు ఇంకా విడుదల కాలేదు. కానీ ఒక ప్రాథమిక అంచనా ప్రకారం 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల మధ్య నిల్వలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిని దేశీయ ఉత్పత్తిని పెంచే దిశగా కీలక ముందడుగా చెబుతున్నారు.

ఒడిశా ప్రభుత్వం, ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ (OMC), GSI కలిసి గనులను వాణిజ్యీకరించడానికి వేగంగా పనులు చేపడుతున్నాయి. దేవ్‌ఘర్ జిల్లాలోని మొదటి బంగారు మైనింగ్ బ్లాక్ వేలానికి సిద్ధమవుతోంది. ఇక్కడ బంగారం నిల్వలు, నాణ్యత, వెలికితీతలను నిర్ణయించడానికి G3 నుంచి G2 స్థాయి వరకు వివరణాత్మక డ్రిల్లింగ్, నమూనా సేకరణ జరుగుతోందని అధికారులు తెలిపారు. తర్వాత పరిశోధనలు, ప్రయోగశాల విశ్లేషణల తుది నివేదిక ఆధారంగా సాంకేతిక కమిటీల ద్వారా వాణిజ్య సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. అనంతరం పారదర్శక వేలం నిర్వహించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తారు.

ఈ నిధిని వెలికితీస్తే ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే ఇండియా బంగారం దిగుమతులపై ఆధారపడటం కొంచెం తగ్గుతుంది. ఒడిశాను ఇనుము, ఖనిజం, బాక్సైట్ కేంద్రంగా మాత్రమే కాకుండా ఇకపై బంగారం కేంద్రంగా కూడా గుర్తించవచ్చు. దేశంలోని క్రోమైట్‌లో 96%, ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. అలాగే బాక్సైట్‌లో 52%, ఇనుప ఖనిజంలో 33% నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బంగారం కూడా ఈ జాబితాలో చేరింది. మొత్తం మీద ఒడిశా నుంచి వచ్చిన ఈ బంగారం భారతదేశ మైనింగ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించగలదని, స్థానిక ప్రజలకు ఆర్థిక వరంలా నిలుస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: CM Chandrababu: సూపర్ సిక్స్ పథకాలపై సీఎం సమీక్ష.. పార్టీ నేతలకు కీలక సూచనలు!

Exit mobile version