NTV Telugu Site icon

Train Accident: 48 గంటలు నరకయాతన.. పొదల్లో సజీవంగా రైలు ప్రమాద బాధితుడు

Train

Train

Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఒడిఆర్‌ఎఫ్‌తోపాటు పలు ఏజెన్సీలు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేశాయి. రెస్క్యూ ఆపరేషన్ జరిగిన రెండు రోజుల తర్వాత ఎన్‌డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ అతుల్ కర్వాల్ ఆదివారం సాయంత్రం శిథిలాలలో చిక్కుకున్న ఎవరూ బతికే అవకాశం లేదని చెప్పారు.

ప్రమాదం తర్వాత కేంద్ర మరియు రాష్ట్ర ఏజెన్సీలకు చెందిన వెయ్యి మందికి పైగా సిబ్బంది రెండు రోజుల పాటు ఆపరేషన్ కొనసాగించారు. నిరంతర ఆపరేషన్ కారణంగా ఈ వ్యక్తులు అలసిపోయారు. అదే రోజు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో స్థానిక సోరో పోలీస్ స్టేషన్‌లోని పోలీసులకు ఓ శబ్ధం వినిపించింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోల్తాపడిన కోచ్‌లలో ఒకదాని పక్కన ఉన్న పొద నుండి సహాయం కోసం కేకలు వినిపించాయి. ఈ పిలుపు చాలా హృదయవిధారకంగా ఉంది. 2 రోజులుగా, రెస్క్యూ సిబ్బంది ఈ ప్రదేశాలను క్షుణ్నంగా పరిశీలించారు. కానీ సమీపంలోని పొద దగ్గరకు వెళ్లడం మర్చిపోయారు.

Read Also:Birthday Party: పుట్టిన రోజే పొట్టన పెట్టుకున్నారు.. ఫుడ్ బిల్లు కట్టలేదని కత్తితో పొడిచేశారు..

సోరో పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక పోలీసు దీని గురించి మాట్లాడుతూ, “ఇంత భయంకరమైన రైలు ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత కూడా ఎవరూ బతికి ఉంటారని అనుకోలేదు. కానీ ఆశ్చర్యం వేసింది. 48గంటలుగా గాయాలతో పొదల్లోనే చిక్కుకున్న వ్యక్తిని గుర్తించాము. కొంతమంది సామాజిక కార్యకర్తల సహాయంతో అతన్ని సోరోలోని కమ్యూనిటీ సెంటర్‌కు తీసుకెళ్లాం. అతనికి ప్రథమ చికిత్స అందించి, ఇక్కడ నుండి అతన్ని బాలాసోర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్చాము. బాలాసోర్ జిల్లా ఆసుపత్రిలో చేరిన వ్యక్తి పరిస్థితి విషమంగానే ఉంది. అతడు అస్సాంకు చెందిన వాడని గుర్తించాం. తన వయసు దాదాపు 35ఏళ్లు ఉంటు్ంది. అతని పేరు దులాల్ మజుందార్ అని చెప్పాడు. అతను తన రాష్ట్రానికి చెందిన మరో 5 మందితో కలిసి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. అయితే ఈ ప్రమాదంలో అతనితో పాటు రైలులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారా లేదా అనేది తెలియరాలేదన్నారు.

సంఘటన జరిగినప్పుడు తాను కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రి వైద్యుడు సుభాజిత్ గిరి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు నుంచి దూకి పొదల్లో పడిపోయే అవకాశం ఉంది. ఈ ఘోర ప్రమాదం తర్వాత అతను రెండు రోజుల పాటు ప్రాణాలతో బయటపడడం ఒక అద్భుతం. ఎయిమ్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాజ్‌కిషోర్ దాస్ మాట్లాడుతూ, “దులాల్ మజుందార్‌ను సోమవారం ఉదయం జిల్లా ఆసుపత్రి నుండి బయటకు తీసుకెళ్లి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో చేర్చారు. తలకు గాయం కావడంతో ఇక్కడ చికిత్స పొందుతున్నాడు. అతను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. చికిత్స అందిస్తున్నాం. ” అన్నారు.

Read Also:Balanagar Flyover: బాలానగర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..

ప్రమాదం జరిగిన 2 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన సంఘటన తరువాత, స్థానిక పోలీసులతో పాటు రైల్వే బృందం సోమవారం తిరిగి తమ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించింది. గత 3 రోజుల సెర్చ్ ఆపరేషన్‌లో వదిలివేయబడిన ప్రదేశాలను ఈసారి బృందం పరిశీలించడం ప్రారంభించింది.