NTV Telugu Site icon

Adani Group: అదానీ గ్రూప్‌పై మళ్లీ ఆరోపణలు.. పాత స్టోరీకి కొత్త స్కీన్ ప్లే అంటున్న కంపెనీ

Adani

Adani

OCCRP Allegations on Adani Group : అదానీ గ్రూప్ పై మరోసారి పిడుగుపడింది. మళ్లీ ఆ సంస్థపై అక్రమ పెట్టుబడులు ఆరోపణలు ఊపందుకున్నాయి. ఈసారి ఈ ఆరోపణలు చేసింది ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్ ప్రాజెక్ట్‌(ఓసీసీఆర్‌పీ). అదానీ గ్రూప్ కంపెనీల్లో అజ్ఞాత విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని ఓసీసీఆర్‌పీ సంచలన ఆరోపణలు చేస్తోంది. యాక్టివ్ గా లేని మారిషస్‌ ఫండ్స్‌ ద్వారా కోట్లాది డాలర్లను గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా అదానీ షేర్ విలువ కోట్లకు కోట్లు పెరుగుతుందని తెలిపింది. యూఏఈకి చెందిన నాసెర్‌ అలీ షాబాన్‌ అలీ, తైవాన్‌కు చెందిన చాంగ్‌ చుంగ్‌–లింగ్‌ ఈ అక్రమ ట్రాన్సక్షన్లలో కీలక పాత్ర పోషించారని వెల్లడించింది. వీరిద్దరూ కొన్ని కోట్ల డాలర్ల పెట్టుబడులతో అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో లావాదేవీలు నిర్వహించినట్లు ఓసీసీఆర్‌పీ తాజాగా ఆరోపణలు గుప్పించింది.

ఇదిలా వుండగా ఈ ఏడాది జనవరిలోనూ అదానీ గ్రూప్‌ కంపెనీలలో అకౌంటింగ్‌ అవకతవకలు జరుగుతున్నట్లు యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల కారణంగా అదానీ షేర్ విలువ ఒక్కసారిగా పడిపోయింది. అయితే ఈ ఆరోపణలపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది.  విచారణ జరిపిన సెబీ  షేర్ల ధరల్లో అవకతవకలకు  ఆధారాలు లేవంటూ సుప్రీంకు తెలిపింది. అదానీ కంపెనీలక క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే తాజాగా మరోసారి ఓసీసీఆర్‌పీ అదానీ కంపెనీలపై అవకతవకల ఆరోపణలు చేసింది.

Also Read: Parliament Special session: కీలక నిర్ణయం తీసుకోనున్న మోడీ సర్కార్? రాజకీయాలను షేక్ చేయనున్నారా?

అయితే ఈ ఆరోపణలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. అదానీ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్‌పై  సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. అయితే అదానీ కంపెనీకి సెబీ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని కూడా తప్పుబట్టిన రాహుల్ రుజువులు ఇచ్చినా సెబీ రాహుల్ కు క్లీన్ చిట్ ఇచ్చిందని పేర్కొన్నారు. క్లీన్ చిట్ ఇచ్చిన సెబీలోని ఆ వ్యక్తి ఇప్పుడు అదానీ కంపెనీకి చెందిన ఎన్డీటీవీలో డైరెక్టర్ గా ఉన్నారని, దీన్ని బట్టే విచారణ ఏవిధంగా జరిగిందో అర్థమవుతుందని రాహుల్ పేర్కొన్నారు. ఈ విషయం గురించి నిలదీయడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని రాహుల్ కోరారు.

ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. ఓసీసీఆర్‌పీ ఆరోపణల నివేదికలో పేర్కొ న్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను గురించి సుప్రీం కోర్టు నియమించిన కమిటి దర్యాప్తులో పేర్కొందని తెలిపింది. అయిపోయిన విషయాన్నే మళ్లీ తవ్వి ఆరోపణలు చేస్తున్నారని ఇవి రీసైకిల్ చేసినవంటూ కొట్టిపారేసింది. పసలేని విషయాలపై విదేశీ మీడియా రాద్దాంతం చేస్తుందని ఇది ముందుగానే ఊహించిందని కంపెనీ పేర్కొంది. దీనిపై పూర్తి స్థాయిలో వివరణ ఇస్తూ ఒక మీడియా స్టేట్మెంట్ విడుదల చేసింది.విదేశీ సంస్థలు తమ ప్రయత్నాల ద్వారా అదానీ గ్రూప్ స్టాక్ ధరలను తగ్గించి తద్వారా లాభాలను ఆర్జించడం కోసం ప్రయత్నిస్తున్నాయని తన ప్రకటనలో వెల్లడించింది అదానీ గ్రూప్. అయితే త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఉండనుండగా మళ్లీ అదానీ గ్రూప్ పై ఇలాంటి ఆరోపణలు రావడం ఎటువంటి చర్చకు దారి తీస్తుందో అర్థం కావడం లేదు.