*తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: అమిత్ షా
తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయని.. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం బహిరంగ సభలో స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా భారీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్.. సోనియా కుటుంబం కోసం, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తుందని ఆరోపించారు. భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిందని.. అయితే, శ్రీరామనవమికి పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ విస్మరించారని అమిత్ షా మండిపడ్డారు. కేసీఆర్ కారు భద్రాచలం వెళ్తుంది కానీ.. ఆలయం వరకు వెళ్లదన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందని విమర్శించారు. దరాబాద్ విముక్తికి 75 ఏళ్లు నిండాయని.. తెలంగాణ అమరవీరుల కలలను కేసీఆర్ కల్లలు చేశారని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ 4జీ పార్టీ, బీఆర్ఎస్ 2జీ పార్టీ, ఎంఐఎం 3జీ పార్టీ అంటూ కుటుంబ పార్టీలపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మోడీజీ పార్టీనేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయంటూ అబద్ధాలు చెబుతున్నారని అమిత్ షా మండిపడ్డారు. బీఆర్ఎస్, ఎంఐఎంలు కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ఉన్నాయి. బీజేపీ ఎప్పుడూ.. బీఆర్ఎస్, ఎంఐఎంతో కలవదని అమిత్ షా స్పష్టం చేశారు. సీఎం అయ్యేది కేసీఆర్ కాదు.. కేటీఆర్ కాదు.. తెలంగాణలో వచ్చేది బీజేపీ సీఎం అని మరోసారి స్పష్టం చేశారు అమిత్ షా. సీఆర్ అవినీతిపై మాట్లాడితే బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు, ఈటల రాజేందర్ ను శాసన సభలో గొంతు నొక్కారని అమిత్ షా అన్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు. 22వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ వెచ్చిందని పేర్కొన్నారు. బడ్జెట్ లో మోడీ ప్రభుత్వం లక్షా25వేల కోట్లు రైతుల కోసం వెచ్చించిదని తెలిపారు. తెలంగాణలో వరిధాన్యం కేసీఆర్ 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే.. కేంద్రం 9లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తుందని అన్నారు. అంతేకాకుండా.. 11 కోట్ల రైతుల సంక్షేమం కోసం మోడీ బడ్జెట్ కేటాయించారన్నారు. 11 లక్షల మహిళలకు మోడీ ప్రభుత్వం గ్యాస్ పంపిణీ చేసిందని తెలిపారు. 2లక్షల 50 వేల మంది కోసం పేదలకు మోడీ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందని అమిత్ షా ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక, యువత వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ను ఇంటికి పంపి.. బీజేపీని అధికారంలోకి తీసుకొద్దాం అని తెలంగాణ ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు.
*రైతులకు భద్రత బీజేపీతోనే సాధ్యం: కిషన్ రెడ్డి
ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘రైతు గోస-బీజేపీ భరోసా’ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సునీల్ బన్సల్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయంపై నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రజాకార్ల అణచివేతకు గురైన గడ్డపై రైతు సభా జరుపుతున్నామని.. అమిత్ షా నేతృత్వంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకున్నామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని రంగాల వారిని మోసం చేశారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుబంధు పేరుతో అనేక సమస్యలు ఉన్నాయని.. రైతు రుణమాఫీ పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. రైతుల పంటలకు భీమ పథకం అమలు లేదని అన్నారు. కేసీఆర్ కోటి మాగాని ఏమైంది అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు నష్ట పోతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకే గూటి పక్షులు అని.. ఎంఐఎం పార్టీకీ తొత్తులని విమర్శించారు. తెలంగాణ బాగుండాలంటే బీజేపికి ఓటు వేయండని కిషన్ రెడ్డి అన్నారు. అనంతరం బహిరంగ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రైతులకు భద్రత బీజేపీతో సాధ్యమన్నారు. కేసీఆర్ రింగ్ రోడ్డు భూములను అమ్ముకున్నాడని ఆరోపించారు. రైతు పంట కొంటానని చెప్పిన కేసీఆర్ దగా చేశాడని మండిపడ్డారు. సబ్సిడీలన్ని బీజేపీ అధికారం వచ్చాక అందజేస్తామని హామీ ఇచ్చారు. సామాన్యుడు సొంతింటి కళ నెరవెరలేదని.. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు బీజేపీ వైపు చూస్తున్నారని ఈటల తెలిపారు. మరోవైపు ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ మోసం చేయడంలో పీహెచ్ డి పొందాడాని దుయ్యబట్టారు. పాస్ పోర్ట్ దొంగ కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ పేరు చెబితే బయట సిగ్గు పోతుందని.. పెగ్గు వేస్తే అన్ని అబద్ధాలే మాట్లాడతాడని మండిపడ్డారు. తెలంగాణను అప్పుల స్టేట్ గా మార్చేశాడని.. తెలంగాణలో రామ రాజ్యం రావాలని బండి సంజయ్ అన్నారు.
*చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రత వివరాలు పంపిన విక్రమ్
అంతరిక్ష పరిశోధన చరిత్రలో మొట్టమొదటిసారిగా చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై నేల ఉష్ణోగ్రతను వివరించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన విక్రమ్ ల్యాండర్‌లోని ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్) పేలోడ్ సహాయంతో చంద్రయాన్-3 చేసిన పరిశోధనలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆగస్టు 23న చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయిన నాలుగు రోజుల తర్వాత ఈ గొప్ప విషయం పరిశోధనలో తెలిసింది. చంద్రుడి ఉపరితలంపై 10సెం.మీ. లోతు వరకు ఉపరితలాన్ని అధ్యయనం చేసిన ప్రజ్ఞాన్ రోవర్ తొట్టతొలిసారి చంద్రుడి దక్షిణ ధృవం వద్దనున్న నేలకి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేసింది. ఈ పరిశీలనలో చంద్రుని దక్షిణ ధృవం వద్ద ఉన్న మట్టిని విశ్లేషించగా.. ఉపరితలం క్రింద 10 సెంటీమీటర్ల వరకు ఉష్ణోగ్రత లోతును బట్టి హెచ్చుతగ్గులను కలిగి ఉందని ఇస్రో తెలిపింది. చంద్రుడి దక్షిణ ధృవం నేలకి సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించిన హెచ్చుతగ్గుల సమాచారం ప్రపంచానికి చేరడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చంద్రునిపై చేసిన పరిశోధనల్లో ప్రోబ్ లోతుకు చొచ్చుకు పోతున్న కొలది ఉష్ణోగ్రతలు నమోదు చేయబడ్డాయి. లోతు పెరుగుతున్న కొద్దీ చంద్రుని ఉపరితలం ఉష్ణోగ్రత తగ్గుతుందని తెలిసింది. ద్రుని ఉపరితలం ఉష్ణ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి, ధ్రువం చుట్టూ ఉన్న చంద్రుని ఉపరితలం ఉష్ణోగ్రత ప్రొఫైల్‌ను ChaSTE (చంద్ర యొక్క ఉపరితల థర్మోఫిజికల్ ప్రయోగం) కొలుస్తుందని ఇస్రో ట్వీట్‌లో వివరించింది. ఇది ఉపరితలం క్రింద 10 సెంటీమీటర్ల లోతును చేరుకోగల నియంత్రిత వ్యాప్తి మెకానిజంతో కూడిన ఉష్ణోగ్రత ప్రోబ్‌ను కలిగి ఉంది. ప్రోబ్‌లో 10 వ్యక్తిగత ఉష్ణోగ్రత సెన్సార్‌లు అమర్చబడి ఉన్నాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) సహకారంతో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లోని స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ (SPL) నేతృత్వంలోని బృందం ఈ పేలోడ్‌ను అభివృద్ధి చేసింది. ఇస్రో ట్విటర్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం.. ” గ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ నుండి 60 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు తెలుస్తోంది. ‘ఈ గ్రాఫ్ చంద్రుని ఉపరితలంపై లోతు వ్యత్యాసాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులను సూచిస్తోంది. చంద్రుని దక్షిణ ధృవానికి సంబంధించి ఇదే మొట్టమొదటి అధ్యయనం. ఇంకా లోతైన పరిశీలనలు జరుగుతున్నాయి’ అని ఇస్రో ట్వీట్ చేసింది.
*బాస్మతి బియ్యం ఎగుమతులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రీమియం బాస్మతీ బియ్యం ముసుగులో తెలుపు బాస్మతీయేతర బియ్యం ‘అక్రమ’ ఎగుమతిని ఆపడానికి కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది. టన్నుకు 1,200 డాలర్ల కంటే తక్కువ ఖరీదైన బాస్మతి బియ్యం ఎగుమతి అనుమతించకూడదని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం బియ్యం ధరలపైనా ప్రభావం చూపనుంది. బాస్మతి యేతర తెల్ల బియ్యాన్ని హెచ్ఎస్ కోడ్స్ ఆఫ్ పార్‌బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్ కింద ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించామని కేంద్రం తెలిపింది. దేశీయంగా ధరల కట్టడికి, ఆహార భద్రత కోసం జులై మూడో వారంలో బాస్మతి యేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం అమలు చేసింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం.. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) టన్నుకు 1,200 డాలర్ల కంటే తక్కువ ఒప్పందాలను నమోదు చేయకూడదని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం టన్ను 1,200 డాలర్ల కంటే తక్కువ ఉన్న ఒప్పందాలు నిలిపివేయబడ్డాయి. బాస్మతీ బియ్యం ముసుగులో బాస్మతీయేతర బియ్యం అక్రమంగా ఎగుమతి కాకుండా నిరోధించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను నియంత్రించే ఈ అథారిటీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తు కోసం, APEDA అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయవచ్చని సూచనలు చేసింది. బియ్యం రిటైల్ ధరలను నియంత్రించే ప్రయత్నంలో, దేశీయ సరఫరాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. గతేడాది సెప్టెంబరులో పగిలిన బియ్యం ఎగుమతిపై నిషేధం విధించగా, గత నెలలో బాస్మతీయేతర తెల్ల బియ్యంపై నిషేధం విధించింది. గత వారం బాస్మతియేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం విధించారు. ఈ పరిమితులతో భారతదేశం ఇప్పుడు అన్ని రకాల బాస్మతీయేతర బియ్యాన్ని కూడా నిషేధించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, బాస్మతి బియ్యం ముసుగులో తెల్ల బాస్మతీయేతర బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేయడాన్ని నివారించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం APEDAకి ఆదేశాలు జారీ చేసింది. టన్నుకు 1200 డాలర్లు, ఆపైన విలువ కలిగిన బాస్మతి బియ్యం ఎగుమతుల కాంట్రాక్టులకు మాత్రమే రిజిస్ట్రేషన్ కమ్ అల్లోకేషన్ సర్టిఫికేట్ (RCAC) జారీకి నమోదు చేయాలని ఏపీఈడీఏకి ప్రభుత్వం సూచించింది. ఇక టన్నుకు 1200 డాలర్ల కంటే తక్కువ విలువ కలిగిన కాంట్రాక్ట్రులను నిలిపేయవచ్చు.
*బిజినెస్ 20 సమ్మిట్‌లో ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన బిజినెస్ 20 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యత ఉన్న చోట మాత్రమే లాభదాయకమైన మార్కెట్ మనుగడ సాగిస్తుందని ప్రధాని అన్నారు. ఇతర దేశాలను మార్కెట్‌గా పరిగణించడం ఎప్పటికీ పనికిరాదని అన్నారు. ఇది దేశాలకు కూడా వర్తిస్తుందని, ఇతర దేశాలను మాత్రమే మార్కెట్‌గా పరిగణించడం ఎప్పటికీ పనిచేయదని మోదీ అన్నారు. త్వరలో లేదా తరువాత అది ఉత్పత్తి దేశాలకు కూడా హాని చేస్తుందన్నారు. భారతదేశంలో డిజిటల్ విప్లవం రాబోతోందని, మనతో స్నేహం మాత్రమే ప్రయోజనకరమని ప్రధాని అన్నారు. బిజినెస్ సమ్మిట్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రగతిలో ప్రతి ఒక్కరినీ సమాన భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన పేదల సంక్షేమ విధానాల వల్ల రానున్న కొన్నేళ్లలో దేశంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య భారీగా పెరుగుతుందని, ఈ పరిణామం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఇక్కడ చాలా మంది గ్లోబల్ బిజినెస్ లీడర్‌లు ఉన్నారని, వ్యాపారాన్ని మరింత వినియోగదారు కేంద్రంగా ఎలా మార్చాలనే దానిపై మనమందరం మరింత ఆలోచించగలమన్నారు. . ఈ వినియోగదారులు వ్యక్తులు లేదా దేశాలు కావచ్చు, వారి ఆసక్తి ఏమిటో శ్రద్ధ వహించాలన్నారు. వినియోగదారుల సంరక్షణకు పెద్ద పీట వేయాలన్న మోదీ.. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ వినియోగదారుల సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. అతిపెద్ద మహమ్మారి కరోనా ప్రపంచానికి పెద్ద పాఠం నేర్పిందని ప్రధాని అన్నారు. ఈ మహమ్మారి ప్రతి దేశానికి, సమాజానికి, వ్యాపార రంగానికి, కార్పొరేట్ సంస్థలకు ఒక పాఠాన్ని నేర్పిందన్నారు. మనం పరస్పర విశ్వాసంతో ఎక్కువగా పెట్టుబడి పెట్టాలన్నారు. కరోనా పరస్పర విశ్వాసాన్ని దారుణంగా నాశనం చేసిందని, ఈ వాతావరణంలో కూడా విశ్వాసంతో నిలిచిన ఏకైక దేశం భారత్ అని ప్రధాని అన్నారు. క్రిప్టోకరెన్సీల సమస్యపై మోదీ మాట్లాడుతూ, దేశాల్లో మరింత ఏకీకృత విధానం అవసరమని అన్నారు. దీని కోసం ఒక గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని, అందులో అన్ని వాటాదారులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఈ సారి భారతదేశంలో పండుగల సీజన్ ఆగస్టు 23 నుండి ప్రారంభమైందని ప్రధాని చెప్పారు. ఎందుకంటే, ఆగస్టు 23న చంద్రుడిని చేరుకునే పని చేశాం. చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత జరుపుకునే వేడుక పండుగ కంటే తక్కువ కాదని ప్రధాని అన్నారు. వచ్చే నెలలో ఢిల్లీలో జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా దేశాల మధ్య వ్యాపార సంబంధిత విషయాలను చర్చించేందుకు ఏర్పాటు చేసిన వేదికే బిజినెస్ 20 లేదా బీ20 ఫోరమ్. గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీకి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. 2010లో దీనిని ఏర్పాటు చేశారు. తాజాగా ఈ బీ20 ఫోరమ్ జీ20 సదస్సుకు 54 సిఫారసులు చేసింది.
*గర్భవతి అనే కనికరం లేకుండా కన్న కూతురిని కడతేర్చారు..
కూతురుపై ఉన్న మమకారాన్ని తల్లి దండ్రులు మరిచారు. తమ కూతురు మరొకరికి జన్మనివ్వబోతుందని తెలిసినా, ఆమె నిండు గర్భవతి అని అర్థం అవతుున్నా ఆమెపై జాలి చూపలేదు. కనికరం లేకుండా ఆమెను కన్నవారే కడతేర్చారు. ఈ దారణమైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది. ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదని తల్లిదండ్రులే కన్న కూతురిని కర్కశంగా చంపేశారు. వరాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ మజాఫర్నగర్కు చెందిన ఓ 19ఏళ్ల యువతి రాహుల్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే పెళ్లికి తమ ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో 2022 అక్టోబర్‌లో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిపై కిడ్నాప్, రేప్ కేసులు పెట్టారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు వారిని డిసెంబర్ లో పట్టుకున్నారు. ప్రియుడిపై కేసు పెట్టి జైలులో పెట్టారు. ఈ క్రమంలో యువతిని ఆమె తల్లిదండ్రలు వారి ఇంటికి తీసుకొని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన కేసు విచారణ కోర్టులో జరగుతూ ఉంది. అయితే తల్లిదండ్రుల వద్దకు రావడానికి ముందు కూతురు గర్భం దాల్చింది. యినప్పటికీ రాహుల్ కు శిక్ష పడాలని యువతి తల్లిదండ్రులు ప్రయత్నించారు. దీని కోసం ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని తమ కూతురిని పలుమార్లు బలవంతం చేశారు. అయినప్పటికి ప్రియుడికి వ్యతిరేకంగా తనను రేప్ చేశాడంటూ సాక్ష్యం చెప్పడానికి నిరాకరించింది. దీంతో ఆవేశంతో ఆ తల్లిదండ్రులు కూతురి గొంతు నులిమి చంపేశారు. అయితే శనివారం స్థానిక కోర్టులో ఈ కేసుకు సంబంధించి కీలక విచారణ జరగాల్సి ఉంది. అయినప్పటికి యువతి, ఆమె తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లలేదు. దీంతో వారు ఎందుకు రాలేదో విచారించాలని కోర్టు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కూతురిని తల్లిదండ్రులే చంపి నదిలో పారేసినట్లు గుర్తించారు. కూతురు తమ మాట వినకపోవడం వల్లే చంపేశామని ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఎన్ని సార్లు అడిగిన రాహుల్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు మా కూతురు అంగీకరించలేదు, అందుకే చంపేశామని తెలిపారు. దీంతొ యువతి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు.
*ఇండియా కూటమికి షాక్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆప్
ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం బీహార్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికను ప్రకటించింది. ఈ చర్య 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఐక్యతను మరింత తగ్గించనుంది. ఆప్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ దేశ రాజధానిలో బీహార్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 2025లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమావేశంలో బీహార్‌లో పార్టీని బలోపేతం చేయాలని సందీప్ పాఠక్ ఉద్ఘాటించారు. ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే, బీహార్ ఇన్‌ఛార్జ్ అజేష్ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. “మురికి రాజకీయాల కారణంగా రాష్ట్రం ముందుకు సాగకపోవటం బీహార్ దురదృష్టం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుంది. కానీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే పార్టీ బలంగా ఉండటం తప్పనిసరి.” అని ఆప్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ చెప్పారు. పార్టీని విస్తరించేందుకు ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేయాలని బీహార్‌లోని పార్టీ నాయకులను పాఠక్ కోరారు. ‘‘బీహార్‌లో ఎన్నికల్లో పోటీ చేస్తాం. కానీ ఎప్పుడు పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. బీహార్‌లో నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేం, అందుకు ముందుగా పార్టీని బలోపేతం చేయాలి. ప్రతి గ్రామంలో సొంతంగా కమిటీ వేయాలి. పార్టీని బలోపేతం చేయడానికి, విస్తరించడానికి ఇప్పటినుంచే కష్టపడండి. ఒకసారి పార్టీ బలంగా మారితే ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తాము, ”అని సందీప్ పాఠక్ జోడించారు.
*విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ మృతి.. జన్యు పరీక్ష ద్వారా నిర్ధారణ
ఆగస్టు 23న రష్యాలో ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు. ఈ సమయంలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ కూడా ఈ విమానంలో ఉన్నారని తెలిసింది. యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారని కూడా తెలిసింది. ప్రిగోజిన్ విమానం కూలిపోవడానికి కారణమేమిటనే దానిపై ప్రశ్నలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్కో సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా వాగ్నర్ తిరుగుబాటు చేసిన సరిగ్గా రెండు నెలల తర్వాత ఈ సంఘటన జరగడంతో, క్రాష్‌లో క్రెమ్లిన్ ప్రమేయం ఉండవచ్చనే ఊహాగానాలు విస్తృతంగా పెరిగిపోయాయి. అయితే, ఇప్పుడు రష్యా యెవ్జెనీ ప్రిగోజిన్ మరణాన్ని ధృవీకరించింది. వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలోనే మరణించారని, ఇది జన్యు పరీక్ష ద్వారా ధృవీకరించబడిందని రష్యా తెలిపింది. వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ గత వారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు జన్యు పరీక్షలు నిర్ధారించాయని రష్యా పరిశోధకులు ఆదివారం తెలిపారు. ఈ విమానంలో 10 మంది ఉన్నారని, వారు ప్రమాదంలో మరణించారని రష్యా చెప్పింది. అంతకుముందు, రష్యాకు చెందిన ఏవియేషన్ ఏజెన్సీ ప్రైవేట్ జెట్‌లోని వ్యక్తులందరి పేర్లను పంచుకుంది. యెవ్జెనీ ప్రిగోజిన్ కూడా విమానంలో ఉన్నారని విమానయాన సంస్థ తెలిపింది. ట్వెర్ ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంపై జన్యు పరీక్షలు పూర్తయినట్లు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. జన్యు పరీక్ష ఫలితాల ప్రకారం మరణించిన 10 మందిని గుర్తించినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో మరణించిన యెవ్జెనీ ప్రిగోజిన్ కూడా విమానంలో ఉన్నారని ఈ పరీక్షలో తేలిందని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో తెలిపారు. అయితే విమానం కూలిపోవడానికి గల కారణాలను రష్యా అధికారులు వెల్లడించలేదు. యెవ్జెనీ ప్రిగోజిన్ రెండు నెలల క్రితం పుతిన్‌పై తిరుగుబాటు చేశారని తెలిసింద. ఈ తిరుగుబాటు జరిగిన రెండు నెలల తర్వాత ఈ సంఘటన జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జూన్ 23-24 తిరుగుబాటును వెన్నుపోటుతో పోల్చారు.
*ఒక స్మగ్లర్ కు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు.. బన్నీ ఏమన్నాడంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నేషనల్ అవార్డ్ విన్ అయిన సంతోషంలో ఉన్న విషయం తెల్సిందే. పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇక 68 ఏళ్ళలో నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డును సాధించాడు. దీంతో అల్లు వారింట సంబురాలు అంబరాన్ని అంటాయి అన్న విషయం తెల్సిందే. నిన్ననే మీడియావారికి సైతం బన్నీ పార్టీ ఇచ్చాడు. ఇక అభిమానులు ఇప్పటికీ బన్నీకి విషెస్ చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే .. టాలీవుడ్ కు అవార్డు రావడంతో హిందీ మీడియా ఓర్చుకోలేక.. కొన్ని పుకార్లు రేకెత్తించాయి. అందులో ఒకటి.. ఒక స్మగ్లర్ గా నటించిన హీరోకు అవార్డు రావడం ఏంటి.. ? దాన్ని ప్రభుత్వం ఎలా ఒప్పుకుంది అని ప్రశ్నిస్తున్నారు. పుష్ప సినిమాలో బన్నీ .. ఒక స్మగ్లర్. గంధపు చెక్కలను పోలీసుల కన్ను కప్పి.. లక్షల్లో అమ్మి సొమ్ము చేసుకుంటాడు. అదే పుష్ప కథ. దీంతో అభిమానులు బాలీవుడ్ మీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అక్కడ చూడాల్సింది పాత్రను కాదు.. నటనను.. ప్రభుత్వం చూసింది నటనను అని చెప్పుకొచ్చారు. తాజాగా బన్నీ కూడా ఇదే విషయం చెప్పుకొచ్చాడు. ” ఒక స్మగ్లర్ కు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు..? అని నేను అనుకున్నాను.. కానీ, ఇక్కడ లాజిక్ చూడడానికి ఏమి లేదు. లాజిక్ లు వెతక్కుండా జూరీ నటనకు పట్టం కట్టింది. నేను ఈ పాత్రను చేయడానికి చాలా ఆలోచించాను. సాధారణంగా మన భారతీయ సినీ పరిశ్రమలో కమర్షియల్ సినిమాను వేరుగా.. పెర్ఫామెన్స్ ఉన్న సినిమాలను వేరుగా చూస్తారు. కమర్షియల్ అనగానే నటన గురించి పట్టించుకోరు. నేను ఈ సినిమాను అలాగే తీయాలనుకున్నాను. కమర్షియల్ సినిమాలో కూడా పెర్ఫామెన్స్ చేయాలి అనుకున్నాను. అందుకు నాకు ఉదాహరణగా నిలిచిన సినిమాలు రుద్రవీణ, ఘరానా మొగుడు. పెర్ఫామెన్స్ అనగానే రుద్రవీణ గుర్తొస్తుంది.. కమర్షియల్ అంగన్ ఘరానా మొగుడు గుర్తొస్తుంది. ఈ రెండు కలిఫై పుష్ప సినిమాలో చేయాలనుకున్నాను. చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగినవాడిగా ఆ రెండు సినిమాలు మైండ్ లో పెట్టుకొని పుష్ప చేశాను. ఇక ఇక్కడ ఇండస్ట్రీకి మనం బలమా.. ? మనకు ఇండస్ట్రీ బలమా..? అనేది కూడా ముఖ్యం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
