Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*థాక్రేతో సీపీఐ చర్చలు.. సీపీఐ ప్రతిపాదనలు ఇవే..
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేతో సీపీఐ నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సీపీఐ నేతలతో థాక్రే చర్చలు జరిపారు. ఈ సమావేశంలో థాక్రే ముందు సీపీఐ నేతలు ప్రతిపాదనలు ఉంచారు. సీపీఐ నాలుగు స్థానాలు కావాలని అడిగింది. మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం సీట్లను సీపీఐ ఆశించింది. అయితే కాంగ్రెస్ మాత్రం మునుగోడు, హుస్నాబాద్ స్థానాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మూడు సీట్లు కోరిన సీపీఐ.. దీనిపై పార్టీలో చర్చ చేసి చెప్తామన్న సీపీఐ నేతలు థాక్రేకు చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఇవ్వడానికి హామీ ఇచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పోటీ చేయమని ప్రకటించగా.. కాంగ్రెస్ తో పొత్తు చేయాలని యోచిస్తుంది. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ 115 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో వామపక్షాల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో వామపక్ష నాయకులు సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తో జతకట్టాలని చూస్తోంది. ముందు నుంచి కాంగ్రెస్, లెఫ్ట్ మధ్య అవసరమైన సమయంలో పొత్తులు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో టీకాంగ్రెస్ నేతలతో సీపీఐ నాయకులు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పొత్తులు, ఇతర అంశాలపై తొందర పడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

*గత ప్రభుత్వం పచ్చగడ్డిలా మేసేసింది.. లోకేష్ అసలు మనిషేనా?
రాష్ట్రంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. కళ్లు పెద్దవి చేసుకుని చూస్తే నాడు – నేడు ఏం జరిగిందో అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్ధంగా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పచ్చగడ్డిలా మేసేసిందని.. గత ప్రభుత్వం కేవలం రెండు కోట్ల మెట్రిక్ టన్నుల వరకే ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. ఈ ప్రభుత్వం 32 లక్షల మంది రైతుల నుంచి 3 కోట్ల 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 58 వేల కోట్లు చెల్లించామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. లోకేష్ అసలు మనిషేనా అంటూ మండిపడ్డ మంత్రి.. కేసులు పెట్టించుకోమని చెప్పే హక్కు ఆయనకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఇది చాలా దుర్మార్గమన్నారు. కొడాలి నాని చిటికెన వేలు మీద ఈక కూడా పీకలేవు లోకేష్ అంటూ మంత్రి మండిపడ్డారు. ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

 

*విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రేపు జగనన్న విద్యాదీవెన నగదు జమ
ఏపీలోని పేద విద్యార్ధులకు చదువు కోసం అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఉన్నత విద్య అభ్యసించే వారికి ఆర్ధికసాయం చేస్తూ అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏడాదిలో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన కింద డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఏపీలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు జగనన్న విద్యా దీవెన పథకం నిధులను విద్యార్థుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జగనన్న విద్యా దీవెన గత ఏడాది మూడవ క్వార్టర్ అమౌంట్ కి సంబంధించి రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాలో నగదును బటన్‌ నొక్క జమ చేయనున్నారు. చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేపు ఉదయం 8.30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి నగరి చేరుకుంటారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి జగనన్న విద్యా దీవెన గత ఏడాది మూడవ క్వార్టర్ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంటును తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు సీఎం జగన్‌. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ ఏడాదికి సంబంధించిన నగదును నగరిలో జరిగే బహిరంగ సభలో జగన్ విడుదల చేయనున్నారు. మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో సభ జరుగుతుండటంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

*మన్ కీ బాత్ లో తెలుగు భాష గురించి ప్రస్తావించిన ప్రధాని మోడీ
మన్‌కీ బాత్‌ 104వ ఎపిసోడ్‌లో భాగంగా నేడు ( ఆదివారం ) ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్‌-3 భారత్‌ విజయానికి ఎప్పటికీ ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. కాగా, చంద్రయాన్‌-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. భారత్‌ వచ్చే నెల ఢిల్లీలో జీ-20 సమావేశాలకు రెడీ అవుతుందని.. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధిలు వస్తున్నారని వెల్లడించారు. తొలిసారి భారత్‌ జీ-20కి నేతృత్వం అంటే.. ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్లు భావించాలని ప్రధాని మోడీ చెప్పారు. ఇక, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష సంస్కృతం.. యోగ, ఆయుర్వేదం, ఫిలాసఫీ వంటి అంశాలపై చాలా మంది అధ్యయనం చేస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం అని ప్రధాని అన్నారు. సంస్కృత భాషను నేర్చుకునేందుకూ చాలా మంది ఆసక్తి చూపుతుండటం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలను ప్రధాని మోడీ తెలిపారు. తెలుగు భాష కూడా చాలా ప్రత్యేకమైంది.. సంస్కృతం లాగానే తెలుగు కూడా అతి పురాతనమైన భాష.. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకోబోతున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే, నేడు భారత్‌ క్రీడల్లో నిలకడగా విజయాలు సాధిస్తోంది అని ప్రధాని మోడీ తెలిపారు. తాజాగా చైనాలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో రికార్డు స్థాయిలో మనవాళ్లు పతకాలను సాధిస్తున్నారన్నాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘మేరీ మాటి.. మేరీ దేశ్‌’ కార్యక్రమం జోరుగా కొనసాగుతుందని మోడీ అన్నాడు. సెప్టెంబర్‌ నెలలో దేశ వ్యాప్తంగా ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం నుంచి మట్టి నమూనా సేకరించే కార్యక్రమం ఉద్యమ స్థాయిలో జరుగుతుందని ప్రధాని మన్‌కీ బాత్‌లో పేర్కొన్నారు.

*ఇండియా కూటమిలో మరికొన్ని రాజకీయ పార్టీలు.. నితీష్‌ కీలక వ్యాఖ్యలు
ముంబయిలో జరగబోయే సమావేశంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో మరికొన్ని రాజకీయ పార్టీలు చేరే అవకాశం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వివిధ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన జేడీయూ నాయకుడు.. అయితే కూటమిలో చేరే అవకాశం ఉన్నవారి పేర్లను వెల్లడించలేదు. అయితే సీట్ల పంపకం వంటి ఎన్నికలకు సంబంధించిన పద్ధతులపై సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. నితీష్‌ కుమార్‌ విలేఖరులతో మాట్లాడుతూ.. ముంబయిలో జరగబోయే సమావేశంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల కోసం ఇండియా కూటమి వ్యూహాలను చర్చిస్తామన్నారు. సీట్ల పంపకం వంటి అంశాలు చర్చించబడతాయన్నారు. అనేక ఇతర అజెండాలు ఖరారు చేయబడతాయని నితీష్‌ స్పష్టం చేశారు. మరికొన్ని రాజకీయ పార్టీలు ఇండియా కూటమిలో చేరతాయన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు గరిష్ట సంఖ్యలో పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని కోరుకుంటున్నామని.. ఆ దిశగానే పనిచేస్తున్నామన్నారు. తనకు ఎలాంటి కోరిక లేదన్నారు.వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీని సంయుక్తంగా ఎదుర్కోవడానికి ఏర్పాటైన 26-పార్టీల ప్రతిపక్ష కూటమి ఇప్పటికే నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు సమావేశమైంది. ముందుగా జూన్ 23న పాట్నాలో, ఆపై జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో రెండు సార్లు సమావేశమైంది. ఈ కూటమి తమ మూడో సమావేశాన్ని ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో నిర్వహించనుంది.ఇదిలావుండగా,.. పాట్నాలోని బెయిలీ రోడ్‌లోని హర్తాలీ మోర్ సమీపంలో కొనసాగుతున్న లోహియా పథ చక్ర నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. దుర్గాపూజలోపు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.

 

*కిడ్నాపర్ల బారి నుంచి బాలికను కాపాడిన వీధి కుక్క
కుక్కలు విశ్వాసానికి మారుపేరు. వాటికి కొంచెం సాయం చేస్తే చాలు మనల్ని గుర్తుపెట్టుకొని ఎంతో నమ్మకంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో కుక్కలు మనుషులను కాపాడినట్లు చూస్తూ ఉంటాం. తాజాగా ఓ వీధి కుక్క స్కూల్ నుంచి వస్తున్న బాలికను కిడ్నాపర్ల బారి నుంచి కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైలర్ అవుతుంది. వీడియో ప్రకారం ఓ బాలిక స్కూల్ నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది. రెడ్ కలర్  కోటు వేసుకున్న ఆ బాలిక రోడ్డుపై ఒంటరిగా ఉంటుంది. ఇంతలో వెనుక నుంచి ఒక కారు వస్తుంది. ఆ బాలిక వద్దకు రాగానే ఆ కారు నెమ్మదిగా ఆగుతుంది. ఎవరో దాని డోర్ ను కారు లోపలి నుంచి నెమ్మదిగా తెరుస్తారు. బాలిక ఇదంతా చూసి కంగారుగా వెనకకు చిన్నచిన్నగా నడుస్తూ ఉంటుంది. అంతలో ఓ వీధి కుక్క వేగంగా పరిగెత్తూకుంటూ వచ్చి వారిపై అరుస్తుంది. దీంతో భయపడిపోయిన కిడ్నాపర్ లు అక్కడి నుంచి పారిపోయారు. ఆ బాలిక పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుక్కకు తెలియకుండానే తన వీధులోకి కొత్త వ్యక్తులు రావడంతో వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దాంతో వారు ఆ బాలికను వదిలేసి వెళ్లిపోయారు. తెలిసి చేసినా, తెలియక చేసినా కుక్క వల్ల బాలికకు మంచి జరిగింది. ఈ మొత్తం ఘటన అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెారాలో రికార్డ్ అయ్యింది. ఈ కుక్క ఒక పెద్ద బోన్ కొనియాలి అని క్యాప్షన్ జోడించి దీనిని సీసీటీవీ ఇడియట్స్ అనే యూజర్ ఎక్స్ (ట్వీటర్) ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు. లక్షకు పైగా లైక్ లు వచ్చాయి. ఈ వీడియో చూసిన వారు పెంపుడు కుక్కల వల్లే కాదు వీధి కుక్కల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. సూపర్ డాగ్ అంటూ మరికొంతమంది కొనియాడుతున్నారు. ఇక కుక్కకు మంచి బోన్ కొనియాలని సూచిస్తున్నారు.  ఆ బాలిక ఎవరో తెలియకపోయినా ఆమెను కుక్క కాపాడిందంటూ నెటిజన్లు ఆ కుక్కను మెచ్చుకుంటున్నారు.

*మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని హోటల్‌ గెలాక్సీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతంలో ఉన్న హోటల్‌లోని రెండో అంతస్తులో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగాయి. హోటల్ నుంచి ఎనిమిది మందిని రక్షించి కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు.మంటలను అదుపులోకి తీసుకొచ్చి భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నాలుగు అగ్నిమాపక యంత్రాలు, అనేక నీటి ట్యాంకర్లను హోటల్‌కు తరలించినట్లు అధికారి తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

*స్కంద ట్రైలర్ రిలీజ్.. బోయపాటి పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ”స్కంద”..బోయపాటి సినిమా అంటేనే ఫుల్ ఊర మాస్ గా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తారు.మరి అలాంటి బోయపాటితో రామ్ సినిమా అంటే థియేటర్స్ దద్దరిళ్లేలా ఈ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ భారీగా ఉహించుకుంటున్నారు…ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటికే భారీ అంచనాలు వున్న ఈ సినిమా సెప్టెంబర్ 15 న వినాయక చవితి కానుకగా విడుదల కానుంది..అయితే విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు.. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బాలయ్య గెస్ట్ గా హాజరయ్యి సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసారు.అయితే ఈ ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి.. బోయపాటి సినిమాలన్నీ ఇంచుమించు అన్ని ఒకేలా ఉంటాయని ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు… రెండు కుటుంబాల మధ్య పగ.. ఆ పగ కోసం చంపుకోవడం మధ్యలో కొన్ని యాక్షన్ సీన్స్ అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి.ఇలా చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కానీ వినయ విధేయ రామ మాత్రం రాంచరణ్ కు భారీ షాక్ ఇచ్చింది.. ఆ తర్వాత అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇప్పుడు రామ్ తో చేస్తున్న స్కంద సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.ట్రైలర్ చూసాక డైలాగ్స్ పవర్ ఫుల్ గా యాక్షన్ అంతకంటే ఎక్కువుగా కనిపించింది..అయితే ఈ సినిమా కూడా బోయపాటి పాత సినిమాల లాగానే ఉంది అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు..అలాగే బోయపాటి గారు మీరు ఇంక మారరా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.. అయితే కంటెంట్ బాగుంటే కనుక ఎన్నిసార్లు రిపీట్ చేసిన హిట్ అవ్వడం ఖాయం అని కొంత మంది ఆయనకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి స్కంద సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

 

Exit mobile version