Site icon NTV Telugu

Top Headlines @ 1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @1pm

Top Headlines @1pm

టమోటోకి, పొటాటోకి తేడా తెలియని సీఎం:
టమోటోకి, పొటాటోకి తేడా తెలియని సీఎం జగన్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. సీఎం జగన్‌ రివర్స్‌ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు. దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిందని మండిపడ్డారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ‘రా.. కదిలిరా’ అని పిలుపునిస్తున్నా అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సభలో చంద్రబాబు మాటాడుతూ జగన్ పాలనను ఎండగట్టారు.

ఎమ్మెల్సీ రామచంద్రయ్య రాజీనామా:
వైసీపీ ఎమ్మెల్సీ పదవికి సీ రామచంద్రయ్య రాజీనామా చేశారు. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే తాను రాజీనామా చేశానని రామచంద్రయ్య తెలిపారు. ఎమ్మెల్సీగా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా.. రాజీనామా చేస్తున్నా అని, ప్రజా జీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నా అని అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో సీఎం వైఎస్ జగన్ చూసుకోవాలన్నారు. తప్పిదాలను జగన్‌కు చెప్పే అవకాశం రావడం లేదని, క్యాడర్ సలహాలు తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని రామచంద్రయ్య చెప్పారు.

వైఎస్ఆర్ కలను నిజం చేయటానికే:
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలను నిజం చేయటానికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ అన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొన్ని పార్టీల్లో భయం పట్టుకుందని విమర్శించారు. వైసీపీలో 2019కి ముందు రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఎక్కడ ఉంది?, ఇప్పుడు ఎక్కడ పెట్టారు అని ప్రశ్నించారు. వైసీపీ మోసపూరిత వైఖరి నచ్చకనే షర్మిల ఆ పార్టీకి దూరమయ్యారని మస్తాన్ వలీ పేర్కొన్నారు.

నేటితో కాంగ్రెస్‌ పాలనకు నెల రోజులు:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెలరోజులు పూర్తి చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో డిసెంబర్ 7న రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పాలన నేటితో ఒక నెల పూర్తయింది. ఈ నేపథ్యంలో రేవంత్ తన నెలరోజుల పాలనను గుర్తు చేస్తూ ప్రత్యేక ట్వీట్ చేశారు. ఈ 30 రోజుల పాలన తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని కాంగ్రెస్‌ నేటితో నెల రోజు పాలపై సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు.

కేంద్రం నిధులు ఇస్తుందని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిందా?
కేంద్రం నిధులు ఇస్తుందని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చిందా? అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిపైనే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడిందని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే కాలయాపన చేసే యోచనగా కనిపిస్తుందన్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డీకే అరుణ అన్నారు. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

వైభవంగా మల్లన్న కల్యాణం:
కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్నస్వామి భక్తుల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా సాగుతోంది. ఉజ్జయిని అధ్యక్షులు సిద్ధలింగ రాజదేశికేంద్ర ఆధ్వర్యంలో బలిజ మేడలమ్మ, గొల్ల కేతంతో మల్లికార్జునుడి కల్యాణమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు.

షోలాపూర్‌లో రాళ్లదాడి:
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో శనివారం హిందూ జనక్రోష్ మోర్చా నిర్వహిస్తున్న సందర్భంగా రాళ్లదాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి షోలాపూర్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు నితీష్‌ రాణే, టీ రాజా సహా పదుల సంఖ్యలో వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోలాపూర్‌లో శనివారం సాయంత్రం సకల్ హిందూ సమాజ్ ఆధ్వర్యంలో హిందూ జన్ ఆక్రోశ్ మోర్చా నిర్వహించారు. ఎమ్మెల్యేలు నితీష్ రాణే, టి రాజా కూడా ఈ సమావేశానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ మోర్చా కాలనీ గుండా వెళుతుండగా కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వి, ధ్వంసం చేసి, దుకాణాలకు నిప్పంటించారని చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే షోలాపూర్ పోలీసులు రంగంలోకి దిగి అతి కష్టం మీద శాంతిభద్రతలను కాపాడారు.

బిడ్డని కోల్పోయిన అవినాష్:
జబర్దస్త్ కామెడీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు అవినాష్. ముక్కు అవినాష్ గా బాగా పేరు తెచ్చుకున్న అతడు.. జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ హౌజ్ కి వెళ్లి అక్కడ కూడా ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేసాడు. జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన తర్వాత అవినాష్ స్టార్ మా ఛానెల్ కి షిఫ్ట్ అయిపోయాడు. 2021లో అనుజాని పెళ్లి చేసుకున్న అవినాష్… ఆడియన్స్ కి కూడా పరిచయం చేసాడు. ఈ జంట మెటర్నిటీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేసాయి. మరో మూడు నెలల్లో అనుజా-అవినాష్ లైఫ్ లోకి కొత్త వ్యక్తి ఎంటర్ అవుతాడు అనుకుంటే.. ఊహించని విధంగా అనుజాకి మిస్ క్యారేజ్ అయ్యింది. 7వ నెలలో తల్లి గర్భంలోనే బిడ్డ చనిపోయింది అంటూ అవినాష్ తన అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు.

 

Exit mobile version