Sravana Masam 2025: తెలుగు రాష్ట్రాలు కళ్యాణ శోభ సంతరించుకున్నాయి. ఎటు చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తుంది. శ్రావణ మాసం రావడంతో శుభకార్యాలకు మంచి ముహూర్తాలున్నాయి. దీంతో లక్షల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మూఢం, ఆషాఢం కారణంగా 48 రోజుల పాటు శుభకార్యాలు జరగలేదు. దీంతో బంగారం, వెండి ఆభరణాల షాపులు వెలవెలబోయాయి. వస్త్ర దుకాణాల్లో బిజినెస్ పడిపోయింది. కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు బోసిపోయాయి. పురోహితులకు పని లేకుండా పోయింది. కానీ… శ్రావణం వస్తూనే సందడి మొదలైంది. పెళ్లిళ్లు, శుభకార్యాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు జనం.
పెళ్లిళ్లకు ఈ నెల 26 నుంచి బలమైన ముహూర్తాలు ఉన్నాయి. జులై 31, ఆగస్టు ఒకటి, మూడు, ఐదు తారీఖుల్లో మంచి ముహూర్తాలున్నాయి. అలాగే, ఆగస్టు ఏడు నుంచి 17వ తారీఖు వరకూ బలమైన ముహూర్తాలు ఉన్నాయి. అదే విధంగా, సెప్టెంబర్ చివరి వారమంతా బలమైన ముహూర్తాలున్నాయి. అలాగే, అక్టోబర్‌లో మూడో వారం మినహా… మిగతావన్నీ మంచి రోజులే ఉన్నాయి. నవంబర్‌లో కూడా చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో జాతకాలతో పాటు తమకు అనువైన రోజుల్లో పెళ్లి వేడుకలకు ప్లాన్ చేస్తున్నాయి కుటుంబాలు.
వర్షాకాలం కావడంతో కళ్యాణ మండపం లేదా ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు జనం. చాలా మంది తిరుమల, సింహాచలం వంటి ప్రముఖ ఆలయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ఆలయాల్లో పెళ్లిల్లు జరిపిస్తుంటారు. అయితే, బంధుమిత్రులంతా అక్కడికి రాలేరు కనుక… వాళ్ల కోసం ప్రత్యేక వింధు ఏర్పాటు చేస్తారు. దీంతో మంచి ముహూర్తాలు ఉన్న రోజులతో పాటు వారాంతాల్లో కళ్యాణ మండలు, ఫంక్షన్ హాళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అవన్నీ బుక్కైపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరుస ముహూర్తాలు కారణంగా పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, వంట మనుషులు, పుష్పాలంకరణ కళాకారులు, టెంట్‌హౌస్‌లు, విద్యుత్ దీపాలంకరణలకు కూడా డిమాండ్ భారీగా పెరిగింది. అలాగే, సన్నాయి మేళం, బ్యాండ్, ఆర్కెస్ట్రా కళాకారాలకు నవంబర్ మాసాంతం వరకూ చేతి నిండా పని ఉంది.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గోల్డ్ షాపుల్లో రద్దీ కనిపిస్తుంది. కొంత మంది తమ అవసరాలకు అనుగుణంగా నగలు కొంటుంటే… ఇంకొంత మంది పాత నగలు ఇచ్చి కొత్త డిజైన్లలో ఆభరణాలు తీసుకుంటున్నారు. అలాగే, ఆయా శుభకార్యాలకు అవసరమైన రీతిలో మంగళ సూత్రాలు, పుస్తెల తాళ్లు వంటివి ఆర్డరిచ్చి చేయించుకుంటున్నారు ఇంకొందరు. అదే విధంగా పెళ్లి సమయంలో పూజా కార్యక్రమాల్లో ఉపయోగించేందుకు, గిఫ్టులుగా ఇచ్చేందుకు వెండి వస్తువుల్ని కొంటున్నారు. దీంతో స్వర్ణకారులు బిజీ అయ్యారు.
ప్రస్తుతం బంగారం ధరలు కాస్త నిలకడగా ఉన్నాయి. దీంతో శుభకార్యాలు ఉన్న వాళ్లు గోల్డ్ కొనుగోళ్లకు ఇదే అనువైన సమయంగా భావిస్తున్నారు. పెళ్లికూతురు తాళిబొట్టు, రెండు హారాలు, చెవిపోగులు, వడ్డాణం, ముక్కుపోగు, ఉంగరాలతో పాటు బొట్టు పువ్వు వంటి సంప్రదాయ నగలు అవసరమౌతాయి. వీటి కోసం సగటున 15 నుంచి 25 తులాల వరకు బంగారం అవసరం అవుతుందంటున్నారు నగలు వ్యాపారులు. అయితే, అంత బంగారం కొనే స్థోమత లేని వాళ్లు కూడా 3 నుంచి 5 తులాల బంగారం కొనుగోళ్లతో సరిపెడుతున్నారు. అదే సమయంలో స్థితిమంతులు 30 నుంచి 40 తులాల వరకు బంగారు ఆభరణాలు కొంటున్నారు.
పెళ్లికొడుకు విషయానికి వస్తే గొలుసు, ఉంగరం వంటివి పెళ్లి కూతురు తరఫు పెడతారు. వీటి కోసం సగటున 3 నుంచి 5 తులాల బంగారం కొంటున్నారు. అలాగే, పెళ్లి కొడుకు తరఫున వధువుకు ఉంగరం, మెడలో హారం, మ్యాచింగ్ చెవిదిద్దులు కొంటున్నారు. కొంత మంది బంగారు గాజులు కూడా చేయిస్తున్నారు. దీంతో వధువు కోసం కూడా పెళ్లి కొడుకు తరఫున కూడా పది తులాలకు తక్కువ కాకుండా బంగారం కొంటున్నారు. అయితే, బంగారం కొనుగోళ్లలో ప్రస్తుతం లైట్ వెయిట్ డిజైన్లకు భారీ గిరాకీ ఉంది. చాలా నగల దుకాణాలు EMI రూపంలో చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. మొత్తానికి ఈ నెల ఆరంభం నుంచే బంగారం విక్రయాలు దాదాపు 25 శాతం పెరిగినట్టు వర్తకులు చెబుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, కడప, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో రోజూ నుంచి రెండు కిలోల వరకు బంగారం అమ్మకాలు జరుగుతున్నాయి. మొత్తానికి పెళ్లిళ్ల సీజన్ పుణ్యమా అని పురోహితుల దగ్గర నుంచి విభిన్న రంగాలకు చెందిన వాళ్లు ఒక్క సారిగా బిజీ అయిపోయారు.
