Site icon NTV Telugu

ITR Refund: లక్షల మంది అందని ఐటీఆర్ రీఫండ్.. ఆలస్యం అయితే ఫైన్ కట్టాల్సిందే

Refund

Refund

ITR Refund: 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ జూలై 31 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గడువుకు ముందే చాలా మంది తమ ఐటీ రిటర్న్స్ ను ఫైల్ చేశారు. ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన చాలా మందికి వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయ్యింది. అయితే కొద్ది మందికి మాత్రం ఇంకా డబ్బు జమ కాలేదు. అయితే వారందరూ తమ ఖాతాలో మనీ ఎందుకు క్రెడిట్ కాలేదని ఆలోచిస్తున్నారు. దానికి కారణాన్ని ఆదాయపు పన్ను శాఖ ట్విటర్ ద్వారా తెలిపింది.

Also Read: ITR Refund: ఇన్ కమ్ ట్యాక్స్‌ రీఫండ్ ఇంకా క్రెడిట్‌ కాలేదా? అయితే ఇలా చెక్ చేసుకోండి

ఆదాయపు పన్ను వెబ్‌సైట్ ప్రకారం, ఆగస్టు 23 వరకు 6.91 కోట్ల మందికి పైగా ప్రజలు ఐటీ రిటర్న్‌లు దాఖలు చేశారు. అయితే 6.59 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌ల ధృవీకరణ చేపట్టారు. అయితే మిగిలిన 31 లక్షల మంది రిటర్న్‌లు ఇ-వెరిఫై చేయలేదు. దీంతో వారి రిటర్న్స్ ను ఆదాయపు పన్ను శాఖ ధృవీకరించలేకపోయింది. అందుకే వారి ఖాతాలో డబ్బులు జమకాలేదు. ఐటీ శాఖ నిబంధనల ప్రకారం, పన్ను చెల్లింపుదారులందరూ తమ ఐటీఆర్ ను ఫైల్ చేసిన తరువాత 30 రోజుల్లో దానిని ధృవీకరించడం తప్పనిసరి. ఒకవేళ ట్యాక్స్ పేయర్ ఇ-ఫైలింగ్ చేసిన తరువాత దానిని ధృవీకరించకపోతే, ఐటీఆర్ ప్రాసెస్ జరగదు. దీనికి సంబంధించే ఆదాయపు పన్ను శాఖ ప్రకటన చేసింది. ‘పన్ను చెల్లింపుదారులకు ధృవీకరణ కోసం 30 రోజుల సమయం ఉంది, ఇది త్వరలో ముగుస్తుంది. వీలైనంత త్వరగా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఈ లోపు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేయకపోతే మళ్లీ రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది’ అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఇక ఆలస్యరుసుము విషయానికి వస్తే వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులు రూ. 1000 ఆలస్యరుసుముగా చెల్లించాలి.ఇక వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5000 చెల్లించాల్సి ఉంటుంది. ఇ-వెరిఫికేషన్ ను మీ బ్యాంక్ ఖాతా నుంచి, ఆధార్ ఓటీపీ ద్వారా, మీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా కూడా చేసుకోవచ్చు.

 

Exit mobile version