Site icon NTV Telugu

Kejriwal: సుప్రీంకోర్టులోనూ కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. పిటిషన్ తిరస్కరణ

Ke

Ke

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్ట్‌పై అత్యవసరంగా విచారించాలంటూ బుధవారం కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని న్యాయస్థానం తాజాగా తిరస్కరించింది. ఈరోజే ఎమర్జెన్సీగా విచారించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. కేసును పరిశీలించి త్వరలోనే ఓ తేదీని ప్రకటిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

బుధవారం తెల్లవారుజామున కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారించాలని కోరారు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు విషయాన్ని తెలియజేశారు. ఎమర్జెన్సీగా విచారించాలని కోరారు. కానీ విచారించడానికి సమయం ఇవ్వలేదు. పరిశీలించి ఒక తేదీని చెబుతామని పేర్కొన్నారు.

మంగళవారం బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్‌ అరెస్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్‌ చెప్పారని ధర్మాసనం పేర్కొంది. కేజ్రీవాల్‌ అరెస్టు, రిమాండ్‌ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదని.. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవని స్పష్టం చేసింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పు వెలువరించారు. దీంతో కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలను కూడా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

మార్చి 21న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. తిరిగి ఏప్రిల్ 1న కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం ఆయన ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా.. మంగళవారం కొట్టేసింది. తాజాగా బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది.

Exit mobile version