NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!

Nmc

Nmc

NMC Guidelines: దేశంలో వైద్యులు, ఆస్పత్రులు, వైద్య సంస్థలు చేసే ప్రచారాలు, ప్రకటనలపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కొత్త నైతిక మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్య రంగాన్ని వాణిజ్యమయం చేయకుండా నిరోధించడం, తప్పుడు సమాచారం నుంచి రోగులను కాపాడటం, వైద్య వృత్తిలోని జవాబుదారీతనాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిబంధనలను రూపొందించారు. ముఖ్యంగా “బెస్ట్ డాక్టర్”, “నంబర్ వన్”, “100 శాతం నయం చేస్తాం”, “నొప్పి లేని చికిత్స” వంటి వ్యాపార ధోరణిలో చేసే అతిశయోక్తి ప్రకటనలను పూర్తిగా నిషేధించారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. సోషల్ మీడియా, యూట్యూబ్, వెబ్‌సైట్లు, గూగుల్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో చేసే ప్రకటనలు కేవలం అవగాహన, సమాచార ఆధారితంగా మాత్రమే ఉండాలి తప్ప రోగులను ఆకర్షించేలా (Solicitation) ఉండకూడదు. ఆన్‌లైన్‌లో పెయిడ్ టెస్టిమోనియల్స్ (డబ్బులిచ్చి చెప్పించే అనుభవాలు), ఫేక్ రివ్యూలు, ఆర్టిఫిషియల్ రేటింగ్స్ ఇవ్వడం లేదా కొనుగోలు చేయడం నేరంగా పరిగణిస్తారు.

రోగుల ఆమోదం ఉన్నప్పటికీ, వారి ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత వైద్య వివరాలను వాణిజ్య ప్రచారాల కోసం వాడకూడదు. ముఖ్యంగా ‘బిఫోర్.. ఆఫ్టర్’ (చికిత్సకు ముందు, తర్వాత) ఫొటోలను ప్రచారానికి ఉపయోగించడంపై కఠిన ఆంక్షలు విధించారు. వైద్యులు తమ పేరుతో మందులు, వైద్య పరికరాలు లేదా ఇతర ప్రైవేట్ ఉత్పత్తులకు వాణిజ్యపరంగా ప్రచారకర్తలుగా (Endorsers) వ్యవహరించరాదు. రోగులను ఒక ఆస్పత్రికి లేదా డాక్టర్‌కు రిఫర్ చేసినందుకు ఏ రూపంలోనైనా కమీషన్లు, బోనస్‌లు, బహుమతులు లేదా పారితోషికాలు ఇవ్వడం, తీసుకోవడం పూర్తిగా నిషేధం. ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించే వైద్య ప్రచారాల్లో ఎలాంటి అవాస్తవాలు, తప్పుదోవ పట్టించే సమాచారం ఉండకూడదు. ఈ కొత్త మార్గదర్శకాలను ఉల్లంఘించే వైద్యులు, ఆస్పత్రులపై గ్రేడెడ్ సిస్టమ్ ప్రకారం చర్యలు ఉంటాయని ఎన్ఎమ్‌సీ స్పష్టం చేసింది. మొదట హెచ్చరికలు/నోటీసులు జారీ చేస్తారు. తీవ్రమైన ఉల్లంఘనలు లేదా పదే పదే తప్పులు చేస్తే సదరు వైద్యుల రిజిస్ట్రేషన్‌ను నిర్దిష్ట కాలం పాటు సస్పెండ్ చేయడం లేదా మెడికల్ రిజిస్టర్ నుంచి శాశ్వతంగా తొలగించడం జరుగుతుందని మర్గదర్శకాల్లో స్పష్టం చేశారు.