భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక మూలాలు అత్యంత బలంగా ఉన్నప్పటికీ, ఈజీ లిక్విడిటీ కారణంగానే భారత ఈక్విటీ మార్కెట్లు ఇటీవల మందగమనానికి గురవుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బ్యాంకాక్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మన మార్కెట్లలో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, విక్రయించడం చాలా సులభం కావడం వల్లనే విదేశీ ఇన్వెస్టర్లు సులభంగా స్టాక్ మార్కెట్ నుంచి వెళ్లిపోతున్నారని ఆమె వివరించారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వ్యాపార అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఎదుగుతోందని, అయితే దేశీయ ఈక్విటీ బెంచ్ మార్కులు ఈ ఏడాది దాదాపు 12 శాతం క్షీణించాయని మంత్రి పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రంగాలు, అమెరికా వైపు పెట్టుబడులు ఆకర్షించబడటమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు AI సాంకేతికతతో ముడిపడి ఉన్న కంపెనీల కారణంగా విదేశీ నిధులను అధికంగా ఆకర్షిస్తున్నాయి. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) గణాంకాల ప్రకారం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఇప్పటివరకు భారత ఈక్విటీల నుంచి దాదాపు 33 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
ఇలాంటి విదేశీ నిధుల ఉపసంహరణ పెరిగినప్పటికీ.. భారతీయ రిటైల్ , మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు స్థానిక మార్కెట్లకు బలమైన మద్దతుగా నిలుస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్ (AMFI) డేటా ప్రకారం.. మార్చి 2021 నుంచి ప్రతి నెలా ఇన్ ఫ్లోస్ నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా AI బూమ్ ఏ క్షణమైనా పేలిపోయినా భారత మార్కెట్లపై దాని ప్రభావం తక్కువగానే ఉంటుందని, ఎందుకంటే ఆ తరహా భారీ పెట్టుబడులు భారత్‌లోకి నేరుగా రాలేదని సీతారామన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా.. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సెమీకండక్టర్ తయారీ రంగాలలో భారత్ ఇప్పుడు వెనుకబడి లేదని, వేగంగా పెట్టుబడులను పెంచుతోందని ధీమా వ్యక్తం చేశారు.

