Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!

Nila Vikhe Patil

Nila Vikhe Patil

Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కి మహారాష్ట్ర మూలాలున్న నీలా విఖే పాటిల్ ఎన్నికయ్యారు. స్టాక్‌హోమ్ సిటీ నుంచి గ్రీన్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆమె, 349 మంది సభ్యులుండే స్వీడిష్ పార్లమెంట్ ‘రిక్స్‌డాగ్’ (Riksdag) లోకి అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో లెఫ్ట్ కూటమికి స్వల్ప మెజారిటీ రావడంతో నీలా ఈ విజయాన్ని అందుకున్నారు. నీలా వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. ఆమె పుట్టింది స్వీడన్‌లోనే అయినా, చిన్నతనమంతా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోనే గడిచింది. ఆ తర్వాత స్వీడన్‌ వెళ్లిన నీలా, అక్కడే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నీలా కుటుంబానికి మహారాష్ట్ర రాజకీయాలు, విద్య, సహకార రంగాలలో గొప్ప చరిత్ర ఉంది. ఆమె తండ్రి అశోక్ విఖే పాటిల్ ప్రముఖ విద్యావేత్త కాగా, తాతయ్య బాలాసాహెబ్ విఖే పాటిల్ కేంద్ర మాజీ మంత్రి. ఇక ఆమె బాబాయి రాధాకృష్ణ విఖే పాటిల్ ప్రస్తుతం మహారాష్ట్రలో మంత్రిగా పనిచేస్తున్నారు. అంతేకాదు, ఆసియాలోనే మొట్టమొదటి సహకార చక్కెర కర్మాగారాన్ని స్థాపించిన విఠల్‌రావ్ విఖే పాటిల్ ఈమెకి ముత్తాత అవుతారు.

తన గెలుపుపై నీలా స్పందిస్తూ.. “మా తాతయ్య గర్వపడేలా పనిచేస్తానని ఆశిస్తున్నాను. నాకు కేవలం 15 ఏళ్ల వయసున్నప్పుడే ఆయన నాతో రాష్ట్ర బడ్జెట్‌ను చదివించేవారు” అని విలేకరులతో తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. తాతయ్యతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేదని, ఆయన చివరి రోజుల్లో ప్రతి వారం ఫోన్ చేసి మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు. స్వీడన్‌లో ఉంటున్నా ఇండియా అంటే తనకు ఎంతో ప్రేమ అని, ఇక్కడ చాలా మంది దగ్గరి స్నేహితులు ఉన్నారని చెప్పారు. రాజకీయాల్లో నీలాకు మంచి అనుభవమే ఉంది. గతంలో స్వీడన్ మాజీ ప్రధాని స్టీఫన్ లోఫ్వెన్ పదవీకాలంలో ప్రధాని కార్యాలయంలో సలహాదారుగా పనిచేసి ఆర్థిక, పన్నులు, గృహనిర్మాణ రంగాలకు సంబంధించిన విషయాలను పర్యవేక్షించారు. ఆ తర్వాత స్టాక్‌హోమ్ సిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. గ్రీన్ పార్టీకి చెందిన గొథెన్‌బర్గ్ యూనిట్, స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్స్‌తో పాటు స్టాక్‌హోమ్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. చదువు విషయానికి వస్తే.. గొథెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎకనామిక్స్, లా సబ్జెక్టులలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఎంబీఏ పూర్తి చేశారు. స్పెయిన్‌లోని కాంప్లుటెన్స్ యూనివర్సిటీ ఆఫ్ మాడ్రిడ్‌లో కూడా చదువుకున్నారు. ఇప్పుడు ఎంపీగా పిల్లల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణపై ప్రధానంగా దృష్టి పెడతానని నీలా స్పష్టం చేశారు. ఓటు హక్కు లేని చిన్నపిల్లల గొంతుకగా మారి, దేశానికి, స్టాక్‌హోమ్ నగరానికి సేవ చేస్తానని తెలిపారు.

ఇక ఈ ఎన్నికల విషయానికి వస్తే.. స్వీడన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష లెఫ్ట్ కూటమికి చెందిన నాలుగు పార్టీలు కలిపి 176 సీట్లు గెలుచుకున్నాయి. ఇది ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ ప్రభుత్వ బలం కంటే కేవలం మూడు సీట్లు మాత్రమే ఎక్కువ. ఈ ఫలితాలతో ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ రాజీనామా చేయగా, మాజీ ప్రధాని మెగ్డలీనా ఆండర్సన్‌కు చెందిన సోషల్ డెమోక్రాట్స్ పార్టీ 99 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మెజారిటీ చాలా తక్కువగా ఉండటం, కూటమిలోని పార్టీల మధ్య భావజాల తేడాలు ఉండటంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆండర్సన్‌కు కాస్త సవాలుగానే మారనుంది.