NTV Telugu Site icon

Nifty: నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్.. ఆ స్థాయిలో ట్రేడవడం ఇదే తొలిసారి

Nige

Nige

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఇక నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. గురువారం ఉదయం ఒడిదుడుకులతో మొదలైనా.. అనంతరం ఒక్కసారిగా పుంజుకుంది. నిఫ్టీ ఆల్ టైమ్ హై లెవల్లో కొనసాగింది. ఇక సెన్సెక్స్ 750 పాయింట్ల లాభంతో దూసుకెళ్తోంది. నిఫ్టీ 22,794 పాయింట్ల స్థాయిని దాటి 22,800 పాయింట్లకు పైగా ట్రేడవడం ఇదే తొలిసారి. మధ్యాహ్నం 2.20 గంటల సమయానికి సెన్సెక్స్‌ 1109 పాయింట్ల లాభంతో 75,330 దగ్గర కొనసాగగా.. నిఫ్టీ 329 పాయింట్లతో 22,927 పాయింట్ల దగ్గర కొనసాగుతున్నాయి.

గురువారం విడుదల చేసిన హెచ్‌ఎస్‌బీసీ ఫ్లాష్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎమ్‌ఐ) డేటా ప్రకారం.. భారత ఆర్థిక వ్యవస్థ ఎగుమతుల్లో రికార్డు స్థాయిలో పెరుగుదలను నమోదు చేసింది. దాదాపు 18 ఏళ్లలో మే నెలలో అత్యధిక పెరుగుదలను నమోదు చేయడం ఇదే కావడం విశేషం. సెక్టార్ సూచీల్లో ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్‌, ఫిన్‌ సర్వీసెస్‌, రియల్టీ, ప్రైవేట్‌ బ్యాంక్స్‌, ఇన్‌ఫ్రా షేర్లు లాభపడ్డాయి. ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, మెటల్ మరియు ఎనర్జీ వెనుకబడి ఉన్నాయి.

ఇక యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, ఎం అండ్ ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. సెన్సెక్స్‌లో సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టాటా స్టీల్ టాప్ లూజర్‌లుగా ఉన్నాయి.

స్టాక్ మార్కెట్లు ఈ స్థాయిలో దూసుకెళ్లడానికి ఆర్‌బీఐ తాజాగా కేంద్రానికి డివిడెండ్‌ ప్రకటించడమే సూచీల పరుగుకు ప్రధాన కారణం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.2.11 లక్షల కోట్లను ఆర్‌బీఐ ప్రభుత్వానికి అందించనుంది. ఇది కేంద్రం ద్రవ్యలోటు పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా ఒక కారణంగా చెప్పొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా తాజాగా హెచ్‌ఎస్‌బీసీ వెలువరించిన డేటా కూడా సూచీలు రాణించడానికి మరో కారణం.