Nidadavole Municipality: నిడదవోలు వైస్ చైర్మన్ పదవిపై ముదురుతున్న వివాదం.. కూటమిలో కలకలం!

Nidadavole Municipality

Nidadavole Municipality

Nidadavole Vice Chairman Row: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవి వ్యవహారం కూటమి పార్టీల మధ్య రాజకీయ వివాదానికి దారితీస్తోంది. పొత్తు ధర్మాన్ని విస్మరించి జనసేన కౌన్సిలర్ కళ్యాణ చక్రవర్తి వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చేతులెత్తే పద్ధతిలో జరిగిన ఓటింగ్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కళ్యాణ చక్రవర్తికి 18 మంది కౌన్సిలర్లు మద్దతు తెలపగా.. టీడీపీ అభ్యర్థి కొమ్మిన వెంకటేశ్వరరావుకు 13 ఓట్లు వచ్చాయి. వైసీపీకి చెందిన ఓ కౌన్సిలర్ తటస్థంగా ఉన్నారు.

32 మంది కౌన్సిలర్లు ఉన్న నిడదవోలు మున్సిపాలిటీలో జనసేనకు 14, టీడీపీకి 13, వైసీపీకి 3, బీజేపీకి ఒకటి, ఇండిపెండెంట్‌కు ఒక స్థానం ఉన్నాయి. కూటమి ఒప్పందం ప్రకారం టీడీపీకి దక్కాల్సిన వైస్ చైర్మన్ పదవిని జనసేన కైవసం చేసుకోవడంతో వివాదం మొదలైంది. ఈ వ్యవహారంపై మంత్రి కందుల దుర్గేష్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వైస్ చైర్మన్ పదవికి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేసి టీడీపీకి అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తన మాట వినడం లేదంటూ జనసేన అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే తన సొంత డబ్బులు ఖర్చు చేసి జనసేన అభ్యర్థులను గెలిపించుకున్నానని, వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కళ్యాణ చక్రవర్తి తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసేందుకు జనసేన అధిష్టానం సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు ఈ వివాదంపై టీడీపీ తన నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమైంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అధ్యక్షతన నిడదవోలులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. కూటమి పార్టీల ఉనికి, ఐక్యత, పరస్పర గౌరవం, ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న ఒప్పందాల పరిరక్షణ వంటి అంశాలపై సభలో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నిడదవోలు వైస్ చైర్మన్ పదవి వివాదం కూటమి పార్టీల మధ్య విభేదాలను మరోసారి బహిర్గతం చేయడంతో పాటు భవిష్యత్తులో ఈ పరిణామాలు కూటమి ఐక్యతపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.