NTV Telugu Site icon

New Zealand: న్యూజిలాండ్‌లో భీకర తుఫాను.. ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రభుత్వం

Newzealand

Newzealand

New Zealand: న్యూజిలాండ్‌పై గ్యాబ్రియెల్ తుఫాను విరుచుకుపడింది. ఈ తుఫాన్ దాటికి న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉత్తర దీవిలో పెద్ద మొత్తంలో వర్షం కురిసింది. దీంతో మంగళవారం న్యూజిలాండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటిస్తూ నిర్ణయం వెల్లడించింది. ఉష్ణమండల తుఫాను నార్త్ ఐలాండ్‌ను తాకడంతో న్యూజిలాండ్ ప్రభుత్వం మంగళవారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా పదివేల ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అత్యవసర నిర్వహణ మంత్రి కీరన్ మెక్‌అనుల్టీ డిక్లరేషన్‌పై సంతకం చేశారు.

ఈ తుఫాన్‌ నార్త్‌ ఐలాండ్‌లో చాలావరకు పెద్ద ప్రభావాలను చూపుతోందని మెక్‌అనుల్టీ చెప్పారు. న్యూజిలాండ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ఇది మూడోసారి. గతంలో 2019 క్రైస్ట్‌చర్చ్ ఉగ్రవాద దాడులు, 2020లో కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఎమర్జెన్సీని విధించారు. తాజాగా గ్యాబ్రియెల్ తుఫాన్‌ నేపథ్యంలో ఎమర్జెన్సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో న్యూజిలాండ్ చూడని విధంగా కురుస్తున్న వర్షం దేశవ్యాప్తంగా దారుణమైన ప్రతికూల పరిస్థితులను కల్పించిందని మెక్ అనుల్టీ అన్నారు. భీకర వర్షం కారణం దేశంలో సంబంధాలు తెగిపోయాయని వివరించారు. న్యూజిలాండ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వెస్ట్ ఆక్లాండ్‌లో ఒక ఇల్లు కూలిపోవడంతో ఒక అగ్నిమాపక సిబ్బంది తప్పిపోయారని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

Marburg Virus: ప్రపంచంపై దాడి చేయనున్న మరో వైరస్.. గినియాలో 9 మంది మృతి

ఈ తుఫాను న్యూజిలాండ్ వాసుల జీవితాలకు నిజమైన ముప్పుతో కూడిన ముఖ్యమైన విపత్తు అని మెక్‌అనుల్టీ జోడించారు. మంగళవారం మరింత వర్షం, గాలులు ఎమర్జెన్సీ సేవలకు ఆటంకం కలిగిస్తాయని ఆయన అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం విస్తృతమైన వరదలు, కొండచరియలు విరిగిపడడం, దెబ్బతిన్న రోడ్లు, మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని వెల్లడించారు. ఈ వాతావరణం కారణంగా సోమవారం విమానాలను నిలిపివేసింది న్యూజిలాండ్. అయితే మంగళవారం మధ్యాహ్నం కొన్ని సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని ఎయిర్ న్యూజిలాండ్ తెలిపింది.