AP Cabinet: రేపు సచివాలయంలో జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వ నూతన పాలసీలు చర్చకు రానున్నాయి. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానంలో ప్రణాళికలను రచించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా రూపొందించిన నూతన పాలసీపై కేబినెట్‌లో చర్చించనున్నారు. మొత్తం 10 ప్రభుత్వ శాఖల్లో నూతన విధానాలను అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి వరుస సమీక్షలతో ప్రభుత్వ శాఖల్లో కొత్త పాలసీలు కొలిక్కి వచ్చాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా కొత్త పాలసీల రూపకల్పనపై మంత్రివర్గం చర్చించనుంది. జాబ్ ఫస్ట్ (ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యం) అనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వ పాలసీలు ప్రభుత్వం సిద్ధం చేసింది. పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలు, పొరుగు రాష్ట్రాల్లో ఉత్తమ విధానాలతో కొత్త పాలసీల రూపకల్పన జరిగింది.
Read Also: Andhra Pradesh: తుఫాను ప్రభావిత జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం
రేపు కేబినెట్ ముందుకు 5-6 పాలసీలను చర్చించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. పారిశ్రామిక అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ , క్లీన్ ఎనర్జీ , ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ , ప్రైవేటు పారిశ్రామిక పార్కులు తదితర పాలసీలు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముందుగా పెట్టుబడులు పెట్టిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా పారిశ్రామిక పాలసీలో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంలో కసరత్తు చేశారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామిక వేత్త అనే కాన్సెప్ట్ తో ఎంఎస్ఎంఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. విద్యుత్ రంగంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉండేలా క్లీన్ ఎనర్జీ పాలసీని కూడా రూపొందించారు.