NTV Telugu Site icon

NATO leaders: నాటో దేశాధినేతల భేటీలో ఆసక్తికర సీన్.. బ్రేక్ తీసుకుని ఏం చేశారంటే..!

Nato

Nato

ఉక్రెయిన్‌పై రష్యా భీకరమైన యుద్ధం కొనసాగిస్తున్న వేళ అమెరికాలోని వాషింగ్టన్‌లో నాటో దేశాధినేతల సదస్సు జరుగుతోంది. అయితే ఈ సదస్సులో ఇంట్రెస్టింగ్ పరిణామం చోటుచేసుకుంది. కీలక భేటీ జరుగుతుండగా ఇద్దరు ప్రధానులు బ్రేక్ తీసుకొని ఫుట్‌బాల్ మ్యాచ్‌ వీక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

జర్మనీ వేదికగా యూఈఎఫ్‌ఏ యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ జరుగుతోంది. బుధవారం జరిగిన ఒక సెమీఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌, ఇంగ్లండ్ తలపడ్డాయి. అదే సమయంలో అమెరికాలోని వాషింగ్టన్‌లో నాటో సదస్సు జరుగుతోంది. అక్కడే ఉన్న బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌, నెదర్లాండ్స్‌ ప్రధాని డిక్‌ స్కూఫ్ కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నారు. ఇద్దరు టీవీ ముందు కూర్చొని తమ జట్ల ఆటను వీక్షించారు. తమ టీమ్‌ సభ్యులు గోల్‌కొట్టినప్పుడు ఎంజాయ్‌ చేశారు. చివరకు 2-1 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత స్టార్మర్‌కు డిక్‌ అభినందనలు తెలియజేశారు.

మ్యాచ్ చూసిన వీడియోను బ్రిటన్ ప్రధాని ఎక్స్‌ వేదికగా షేర్ చేశారు. ‘‘సరైన సమయంలో నాటో సదస్సు నుంచి బయటకు వచ్చి, స్కోర్ చెక్‌ చేసుకున్నాను. ఇంగ్లండ్ అద్భుతంగా ఆడింది’’ అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే అమెరికాలో జరిగిన నాటో సదస్సులో నాయకులు ఉక్రెయిన్‌కు 43 బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని అందించాలని ప్రతిజ్ఞ చేశారు.