NTV Telugu Site icon

Dowry Harassment: నవ వధువుకు కట్నం వేధింపులు.. 5 కోట్లు ఇచ్చినా..!

Dowry Harassment

Dowry Harassment

విజయవాడలో కట్నం కోసం నవ వధువుకు వేధింపుల పర్వం బయటపడింది. రూ.5 కోట్లు ఇచ్చినా.. పెళ్లైన రెండు రోజులకే కట్నం వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేని వధువు భవానీపురం పోలీసులకు కంప్లైంట్ చేసింది. భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 498A, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3,4 ల కింది కేసు నమోదు చేసి పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. తండ్రీ కొడుకులకు 14 రోజుల రిమాండ్ విధించి.. నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించారు.

చెరుకూరి లక్ష్మణరావు విజయవాడ ఆర్టీసీలో కంట్రోలర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు హేమంత్ అజయ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటక రాయచూర్‌లోని ఏక్లాస్పూర్ చౌదరీస్ కాలనీలో ఉండే వెలిసేటి ప్రసన్నకుమార్ చౌదరి పెద్ద ఆసామి (180 ఎకరాలు). ఆయన కుమార్తె లక్ష్మి కీర్తన చౌదరికి అజయ్‌తో పెళ్లి నిశ్చయించారు. కూతురు సుఖపడుతుందని వివాహానికి ముందు నగదు, స్థిరాస్థులు, బంగారం, వెండి మొత్తం కలిపి సుమారు రూ.5 కోట్లు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనెల 7న రాయచూర్‌లో కీర్తన, అజయ్‌ పెళ్లి ఘనంగా జరిగింది. ఈనెల 9న నిడమానూరులోని ఓ ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ కూడా ఘనంగా జరిగింది.

వివాహం జరిగిన రెండు రోజులకు లక్ష్మి కీర్తన చౌదరికి కట్నం వేధింపులు మొదలయ్యాయి. మరో రూ.50 లక్షలు తేవాలని అజయ్, లక్ష్మణరావు వేధించారు. కట్నం కోసం నవ వధువును తండ్రి, కొడుకులు బంధించారు. అనంతరం భవానీపురం పోలీసు స్టేషనులో నవవధువు కీర్తన కంప్లైంట్ చేసింది. ఐపీసీ సెక్షన్ 498A, వరకట్న నిషేధ చట్టం సెక్షన్లు 3,4 కింద కేసు నమోదు చేశారు. తండ్రికొడుకులకు 14 రోజుల రిమాండ్ విధించి నెల్లూరు జైలుకు తరలించారు. లక్ష్మణరావు మరో నెల రోజుల్లో రిటైర్ కానున్నారు. కొడుకు అజయ్‌కి గతంలో ఒక సంబంధం ఖాయం చేసుకుని 1.5 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం.