NTV Telugu Site icon

Hardik Pandya-Mohammed Shami: హార్ధిక్‌ పాండ్యాకు థ్యాంక్స్‌.. సరైన సమయంలో గాయపడ్డాడు!

Hardik Pandya Injury

Hardik Pandya Injury

Netizens Trolls Hardik Pandya over Mohammed Shami: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ (117; 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్ (105; 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత సెంచరీలతో పాటు మహమ్మద్‌ షమీ (7/57) సూపర్‌ బౌలింగ్‌తో భారత్ విజయం సాధించింది. 7 వికెట్స్ పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన షమీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో షమీ పేరు ట్రెండ్ అవుతోంది. అయితే అనూహ్యంగా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా పేరు కూడా నెట్టింట ట్రెండ్ కావడం గమనార్హం. హార్దిక్ సరైన సమయంలో గాయపడ్డావు, నీకు పెద్ద థ్యాంక్స్‌ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

విషయం ఏంటంటే.. వన్డే ప్రపంచకప్‌ 2023 ఆరంభంలో మహమ్మద్‌ షమీ ఆడలేదు. జట్టు సమీకరణల కారణంగా లీగ్ దశలోని మొదటి నాలుగు మ్యాచ్‌లలో షమీకి చోటు దక్కలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా గాయపడటంతో.. మూడో పేసర్ కోటాలో షమీకి తుది జట్టులో అవకాశం వచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 5 వికెట్లతో విజృంభించాడు. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సత్తాచాటిన షమీ.. తన ప్రదర్శన గాలి వాటం కాదని నిరూపించాడు. శ్రీలంకలపై ఐదు వికెట్స్ పడగొట్టాడు. ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్స్ తీసిన షమీ.. దక్షిణాఫ్రికాపై 2 వికెట్స్ పడగొట్టాడు.

Also Read: IND vs NZ: అప్పుడు తెలియదు.. రాత్రంతా మేల్కొని ఉన్నా: సత్య నాదెళ్ల

నెదర్లాండ్స్‌పై ఒక్క వికెట్ తీయని మహమ్మద్‌ షమీ.. కీలక సెమీస్ మ్యాచ్‌లలో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఏకంగా 7 వికెట్స్ పడగొట్టి భారత జట్టుకు అద్భుత విజయం అందించాడు. కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లతో వన్డే ప్రపంచకప్‌ 2023లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఒకవేళ హార్దిక్ పాండ్యా గాయపడకపోయి ఉండుటే.. కాంబినేషన్ల కారణంగా షమీకి తుది జట్టులో చోటు దక్కడం కష్టం అయ్యేది. అప్పుడు టీమిండియాకు ఎలాంటి విజయాలు వచ్చేవి కావేమో. అందుకే గాయపడి షమీ ఆడేందుకు అవకాశం కల్పించిన పాండ్యాకు ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు. హార్దిక్ సరైన సమయంలో గాయపడ్డాడు, చాలా థ్యాంక్స్‌, హార్దిక్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు.