రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 విజయోత్సవ సంబరాలు విషాదంగా ముగిసాయి. బుధవారం ఆర్సీబీ ఆటగాళ్లు అహ్మదాబాద్ నుంచి సొంతగడ్డకు వస్తుండడంతో.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి లక్షలాది మంది అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 11 మంది అభిమానులు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విచారం వ్యక్తమైంది.
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం సంతాపం వ్యక్తం చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలానే మృతుల కుటుంబాలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది కానీ.. ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించలేదు. దాంతో సోషల్ మీడియాలో ఆర్సీబీ యాజమాన్యంపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Virat Kohli: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన కోహ్లీ!
ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన ఆర్సీబీకి బీసీసీఐ రూ.20 కోట్ల ప్రైజ్‌మనీని ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మొత్తం ప్రైజ్‌మనీని చిన్నస్వామి స్టేడియం మృతుల కుటుంబాలకు అందజేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పోయిన ప్రాణాలను ఎలాగూ తిరిగి తీసుకురాలేమని, కనీసం ఆర్థిక సాయం అయినా చేయాలని సూచిస్తున్నారు. మరి ఆర్సీబీ యాజమాన్యం మృతుల కుటుంబాలను ఆదుకుంటుందో లేదో చూడాలి. ఈ ఘటనపై ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించి విచారం వ్యక్తం చేశాడు.
