పర్యాటకులకు భారీ షాక్. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌లో టికెట్ ధరలు పెరిగాయి. అన్ని రకాల టికట్ ధరలను ప్రభుత్వం పెంచింది. మంగళవారం పార్క్‌లో జరిగిన జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీలో చర్చించి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని జూపార్క్ క్యూరేటర్ వసంత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మార్చి 1 నుంచి నెహ్రూ జూపార్క్ ఎంట్రీ టికెట్ పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చొప్పున వసూలు చేయనున్నారు. గతంలో పెద్దలకు రూ.70, పిల్లలకు రూ.45గా ఉండేది. ఫోటో కెమెరా అనుమతికి రూ.150, వీడియో కెమెరా (ప్రొఫెషనల్)కు రూ.2500 రూపాయలు, కమర్షియల్ మూవీ షూటింగ్ కోసం రూ.10 వేలు ఛార్జి చేస్తారు. అన్ని రోజుల్లో ట్రైన్ రైడ్ 20 నిమిషాలకు పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40లుగా నిర్ణయించారు. బ్యాటరీ ఆపరేటెడ్ అయితే పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.70 చొప్పున వసూలు చేయనున్నారు.
అలానే నెహ్రూ జూపార్క్‌లోని పార్కింగ్ ఫీజు కూడా పెంచారు. సైకిల్‌కు రూ.10, బైక్‌కు రూ.30, ఆటోకు రూ.80, కారు/జీప్ రూ.100 వసూలు చేయనున్నారు. టెంపో,తూఫాన్ వాహనంకు రూ.150, 21 సీట్లు గల మినీ బస్సుకు రూ.200, 21 సీట్లు పైగా ఉన్న బస్సుకు రూ.300 చొప్పున పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.