NTV Telugu Site icon

Neeraj Chopra: రజత పతకం సాధించిన నీరజ్‌ చోప్రా.. చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు!

Neeraj Chopra Silver Medal

Neeraj Chopra Silver Medal

Neeraj Chopra wins silver medal with 89.45m in Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత స్టార్‌ అథ్లెట్‌, గోల్డెన్ బాయ్ నీరజ్‌ చోప్రా రజత పతకం సాధించాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్‌ త్రో ఫైనల్‌లో నీరజ్‌ తన రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. మొత్తంగా 12 మంది పోటీ పడ్డ ఫైనల్‌లో మన బల్లెం వీరుడు రెండో స్థానంలో నిలిచాడు. ఫైనల్‌ బరిలో మొత్తం ఆరు ప్రయత్నాల్లో నీరజ్‌ కేవలం రెండో త్రోలోనే సఫలమయ్యాడు. మిగతా ఐదు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు.

పాకిస్తాన్ అథ్లెట్‌ నదీమ్‌ అర్షద్‌ ఈటెను 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. గ్రెనడా అథ్లెట్‌ పీటర్స్‌ అండర్సన్‌ 88.54 మీటర్లు విసిరి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. గోల్డ్ మెడలిస్ట్ అర్షద్‌.. రెండుసార్లు ఈటెను 90 మీటర్ల కంటె ఎక్కువగా విసిరాడు. 11 మందిలో ఎవరూ కూడా 90 మీటర్ల మార్కును అందుకోలేకపోయారు. 26 ఏళ్ల నీరజ్‌ చోప్రా ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి.. ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. క్వాలిఫయింగ్‌లో 89.34 మీటర్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన నీరజ్‌.. ఫైనల్లో మాత్రం కాస్త ఒత్తిడికి లోనయ్యాడు.

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ విజేత అయిన నీరజ్‌ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం సాధిస్తాడని యావత్‌ భారత్‌ ఆశలు పెట్టుకుంది. నీరజ్‌ మెరుగైన ప్రదర్శన చేసినా.. పాకిస్తాన్ అథ్లెట్‌ అనూహ్య ప్రదర్శనతో రెండో స్థానంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. వరుస రెండు ఒలింపిక్స్‌ పోటీల్లో రెండు పతకాలు అందుకున్న భారత బల్లెం వీరుడిగా నీరజ్‌ రికార్డు సృష్టించాడు. గత ఒలింపిక్స్‌లో నీరజ్‌ 87.58 మీటర్లతో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌ మొత్తం ఐదు పతకాలు సాధించింది.

Show comments