Site icon NTV Telugu

Neeraj Chopra: డైమండ్‌ లీగ్‌.. రెండో స్థానంలో నీరజ్‌ చోప్రా!

Neeraj Chopra Diamond League 2024

Neeraj Chopra Diamond League 2024

Neeraj Chopra Lausanne Diamond League 2024 Highlights: భారత స్టార్‌ జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా మరోసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. లుసానె డైమండ్‌ లీగ్‌ను రెండో స్థానంతో ముగించాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఈటెను 89.45 మీటర్లు విసిరిన నీరజ్‌.. డైమండ్‌ లీగ్‌లో 89.49 మీటర్లు విసిరాడు. ఈ సీజన్‌లో అతడు అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించినా.. 90 మీటర్ల కల మాత్రం నెరవేరలేదు. గ్రెనెడా త్రోయర్ అండర్సన్‌ పీటర్స్‌ ఈటెను 90.61 మీటర్లు విసిరి విజేతగా నిలవగా.. జర్మన్‌ క్రీడాకారుడు వెబర్‌ జులియన్‌ 87.08 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు.

తొలి రౌండ్‌లో ఈటెను 82.10 మీటర్లు విసిరిన నీరజ్‌ చోప్రా నాలుగో స్థానంలో నిలిచాడు. ఆపై వరుసగా, 83.21 మీటర్లు, 83.13, 82.34, 85.58 ప్రదర్శన చేశాడు. ఫైనల్‌ రౌండ్‌లో అండర్సన్‌ పీటర్స్‌ ఈటెను 90.61 మీటర్లు విసరగా.. నీరజ్‌ 89.49 మీటర్లు విసిరి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఇక నీరజ్‌ కెరీర్‌లో ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అంతకుముందు స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌ 2022లో ఈటెను 89.94 మీటర్లు విసిరాడు. అతడి కెరీర్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమం.

నీరజ్‌ చోప్రా 2022లో ఈటెను 87.66 మీటర్లు విసిరి డైమండ్‌ లీగ్‌ విజేతగా నిలిచాడు. అప్పటినుంచే మనోడి పేరు వెలుగులోకి వచ్చింది. 2023 డైమండ్‌ లీగ్‌లో 89.08 మీటర్లు విసిరాడు. ఇక పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో 89.45 మీటర్లు విసిరి రజతం నెగ్గిన సంగతి తెలిసిందే. 90 మీటర్ల కలను అతడు త్వరలోనే చేరుకునే అవకాశం ఉంది.

Exit mobile version